ఆంధ్రాలో తెలంగాణాను విలీనం చేసేలా ఉన్నారు!

పార్ల‌మెంట్‌లో ఏపీ విభ‌జ‌న‌పై ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌లు సృష్టించిన రాజ‌కీయ దుమారం కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌ధాని మాట‌ల‌ను తీసుకుని, తెలంగాణ‌లో బీజేపీకి రాజ‌కీయ స‌మాధి క‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధాని వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో…

పార్ల‌మెంట్‌లో ఏపీ విభ‌జ‌న‌పై ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌లు సృష్టించిన రాజ‌కీయ దుమారం కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌ధాని మాట‌ల‌ను తీసుకుని, తెలంగాణ‌లో బీజేపీకి రాజ‌కీయ స‌మాధి క‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధాని వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో బీజేపీని ఇర‌కాటంలో ప‌డేశాయి. తాజాగా తెలంగాణ వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మ‌రోసారి ప్ర‌ధాని మోదీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ప్ర‌ధాని మోదీ తీరు చూస్తుంటే ఆంధ్రాలో మ‌ళ్లీ తెలంగాణాను విలీనం చేసేలా ఉన్నార‌ని సంచ‌ల‌న విమ‌ర్శ చేశారు. నాడు త‌ల్లిని చంపి బిడ్డ‌ను బ‌తికించార‌ని అన్నార‌ని, ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని అంటున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌పై విషం చిమ్మ‌డ‌మే ప్ర‌ధాని మోదీ ప‌నిగా పెట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  

హ‌నుమ‌కొండ‌లో ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను ప్ర‌ధాని కించపరిచార‌ని మండిప‌డ్డారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది? అని ప్ర‌శ్నించారు. వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? దేశ‌వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ‌కు ఒక్క‌టి కూడా కేటాయించ‌లేద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

అలాగే నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి ఇవ్వలేద‌న్నారు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపార‌ని మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లాయ‌న్నారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఉండాలని మోదీ నీతులు బాగానే చెబుతార‌న్నారు. కానీ చేత‌ల్లో మాత్రం చూప‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.