ఆంధ్రలో టికెట్ రేట్ల సంక్షోభం ఓ కొలిక్కి వస్తోందని అందరూ ఆనందిస్తున్న సమయంలో కొందరు మాత్రం తలో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి క్రెడిట్ గా మారిపోతుందన్న బాధ వాళ్ల మాటల వెనుక తొంగి చూస్తోంది.
తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు టికెట్ రేట్లు పెరిగినంత మాత్రాన డబ్బులు వచ్చేయవని, తెలంగాణలో టికెట్ రేట్లు పెరగడం అన్నది ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
మరి అదే నిజమైతే, టాలీవుడ్ ను ఆంధ్ర సిఎమ్ జగన్ నాశనం చేసేస్తున్నారంత లెవెల్ లో దాదాపు మూడు నాలుగు నెలలుగా ఎందుకు గోల పెడుతున్నట్లు? అందుకోసం కోర్టుకు ఎందుకు వెళ్లినట్లు. టికెట్ రేట్లు పెంచడం అవసరం లేదన్నపుడు ఇక ఇన్ని మల్లగుల్లాలు ఎందుకు? ఎవరికి వారు సైలంట్ గా వుండిపోయి, సినిమాలు విడుదల చేసుకోవచ్చు కదా?
అసలు తమ్మారెడ్డి భరద్వాజ సినిమాలు నిర్మించి ఎంత కాలం అయింది? ఊ అంటే మీడియా మందుకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చే ఇలాంటి వాళ్లు చాలా మంది వల్ల ఇండస్ట్రీకి పైసా ఉపయోగం లేదని..యాక్టివ్ గా సినిమాలు నిర్మించే ఓ నిర్మాత కామెంట్ చేసారు. మంచికో చెడ్డకో చిరంజీవి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారని, దానికి అడ్డం పడడం ఎవ్వరూ చేయకూడదని మరో నిర్మాత అన్నారు.
తమ్మారెడ్డి వ్యవహారం ఇలా వుంటే టాలీవుడ్ ఇండస్ట్రీతో ఏ విధమైన సంబంధం లేని సీపీఐ నారాయణ కూడా ఇలా చిరంజీవిని పిలవడాన్ని తప్పు పడుతున్నారు. ఇండస్ట్రీలోని కమిటీలు, సంఘాల వారిని పిలవాలి కానీ ఇలా చిరంజీవిని, కొంత మంది హీరోలను పిలవడం ఏమిటి అని ఆయన నిలదీస్తున్నారు. ఇలా చేయడం ఇండస్ట్రీని రెండుగా చీల్చడమే అని ఆయన అంటున్నారు.
చిరంజీవిని పిలిచారు. టికెట్ రేట్లు ఇచ్చారు. అది ఇండస్ట్రీకి మంచిదే కదా? అంత మాత్రం చేత ఇండస్ట్రీ ఎందుకు రెండుగా చీలుతుంది? ఈ విషయం సీపీఐ నారాయణ వివరించగలరా? చూస్తుంటే అందరూ కలిసి ఏదో విధంగా చిరంజీవిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది.