ఊహాగానాలకు తెరపడింది. అనుమానాలు పటాపంచలయ్యాయి. తళైవ అభిమానుల ఆనందానికి పగ్గాల్లేవు. అవును.. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 31న తన పొలిటికల్ పార్టీని ప్రకటించి, జనవరిలో పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ప్రకటించారు.
రీసెంట్ గా జిల్లా కార్యదర్శకులు, అభిమాన సంఘం నాయకులతో సమావేశమయ్యారు రజనీకాంత్. అప్పుడే పార్టీ గురించి ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ రోజు తన ఆలోచనను బయటపెట్టలేదు రజనీ.
నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛను అంతా కలిసి తనకు ఇచ్చారని మాత్రమే ప్రకటించారు. ఆ సమావేశం జరిగిన కొన్ని రోజులకే, తన రాజకీయ పార్టీ గురించి ఈరోజు ప్రకటన చేశారు రజనీకాంత్.
ఒక దశలో పార్టీ పెట్టకుండానే రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటారని అంతా అనుకున్నారు. దానికి కారణం ఆయన పేరిట ఓ లెటర్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడమే.. ఆ లేఖపై అప్పట్లో నర్మగర్భంగా స్పందించారు రజనీకాంత్. దీంతో ఆయన పొలిటికల్ గా యాక్టివ్ అవ్వకపోవచ్చని అంతా అనుకున్నారు.
ఇలా అనుమానాలు, ఊహాగానాలకు చెక్ పెడుతూ.. తన పార్టీ ప్రకటన తేదీని బయటపెట్టారు రజనీకాంత్. వచ్చే ఏడాది తమిళనాట సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో రజనీకాంత్ పాల్గొంటారు. అయితే ఆయన రావడమే అన్ని స్థానాల్లో సోలోగా పోటీ చేస్తారా లేక పొత్తు కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. పార్టీ స్థాపించిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ రాబోతోంది.
రజనీకాంత్ తో కలిసి ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం రజనీతో తెరవెనక సంప్రదింపులు కూడా షురూ చేసింది. మరోవైపు ఆల్రెడీ పార్టీ పెట్టిన కమల్ హాసన్, రజనీకాంత్ ను కూడా కలుపుకొని వెళ్తానని ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ మద్దతు కోరతానని తాజాగా ప్రకటించారు.
రజనీకాంత్ పార్టీ ప్రకటనతో తమిళనాట రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈసారి తమిళ రాజకీయ క్షేత్రంలో చాలా ఈక్వేషన్స్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ పెట్టిన వెంటనే డీఎంకే, అన్నాడీఎంకే నుంచి కీలక నేతలు కొందరు రజనీ వైపు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.