ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇంకా చుక్కనీటి సరఫరాకు నోచుకోలేదు. కానీ ఆ ప్రాజెక్టు అసెంబ్లీ వేదికగా నవ్వుని పారించింది. హాస్యాన్ని పండించింది. పొట్ట చెక్కలయ్యేలా సభ్యులంతా నవ్వడానికి ఈ పోలవరం ప్రాజెక్టు కేంద్రమైంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నవ్వులపాలు కావడాన్ని చూడొచ్చు.
“నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” అని ఒక సినీ రచయిత అన్నారు. రాజకీయ నేతల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ మొహంపై చిరునవ్వు తాండవమాడడం చూస్తున్నాం. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు సభ్యులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వడంతో మరోసారి నవ్వు గురించి చర్చకు వచ్చింది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కూడా ఇదే రీతిలో అసెంబ్లీ సమావేశాల్లో బిగ్గరగా నవ్విన సందర్భాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నవ్వడం ఒక యోగమని, నవ్వలేకపోవడం ఒక రోగమని పెద్దలు చెప్పారని, బాబు నవ్వలేకపోతే తానేం చేయాలని వైఎస్సార్ దెప్పి పొడవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
తాజాగా పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బాబు హయాంలో ప్రాజెక్టు పూర్తి అయిందని, చూసేందుకు రండి …రండి అంటూ పెద్ద ఎత్తున జనాన్ని తీసుకెళ్లారని గుర్తు చేశారు. బాబు హయాంలో బస్సులు పెట్టి, జనాన్ని తరలించి చేసిన ఆర్భాటం అంతాఇంకా కాదన్నారు.
పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారని జగన్ విమర్శించారు. ఇందుకోసం ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేశారని జగన్ మండిపడ్డారు. ప్రాజెక్టు వద్దకు తరలించిన జనంతో “జయము.. జయము చంద్రన్నా..” అంటూ మహిళలు పాడుతూ భజన చేస్తున్న ఓ పాటకు సంబంధించిన వీడియోను అసెంబ్లీలో జగన్ ప్రదర్శింపజేశారు.
ఆ వీడియోను చూస్తున్న సందర్భంలో సభ్యులంతా పొట్ట చెక్కలయ్యేట్లు విరగబడి నవ్వారు. ఇక జగన్‌ను చూస్తే, పగలబడి నవ్వుతూ కనిపించారు. నవ్వును ఆయన ఆపుకోలేకపోయారు. అసెంబ్లీలో నిండుగా నవ్వుతూ ఒకప్పుడు వైఎస్, నేడు ఆయన తనయుడు జగన్ కనిపించడం విశేషం. కాగా ఇలాంటి జయము …జయము చంద్రన్నా పాటలే, తనకు అపజయాన్ని మిగిల్చాయని చంద్రబాబు గుర్తించారో లేదో మరి!