దేశంలో కరోనా వ్యాప్తిలో కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పార్లమెంట్ లో స్పష్టం చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ లో ముంబైలో కాంగ్రెస్ లీడర్లు వలస కార్మికులకు టికెట్లను కొనిచ్చారని, ఆ ప్రయాణాల వల్ల కూడా దేశంలో కరోనా వ్యాపించిందని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తుండటం గమనార్హం!
శ్రామిక ఎక్స్ ప్రెస్ లను పెట్టి మోడీ వాటికి టికెట్ రేట్లను నిర్ధారించారని, వలస కార్మికులను అలాంటి పరిస్థితుల్లో ఉచితంగా సొంత ప్రాంతాలకు పంపించడం మాట అటుంచి, ఆ స్థితిలో కూడా వారికి టికెట్ లను పెట్టిన ఘనత మోడీదే అని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి.
దేశంలో పరిస్థితి ఏమిటో కూడా సమీక్షించుకోకుండా, వలస కార్మికుల గురించి కాస్తైనా ఆలోచించకుండా, కేవలం నాలుగంటే నాలుగు గంటల వ్యవధిని ఇచ్చి సుదీర్ఘ లాక్ డౌన్ ప్రకటించింది ఎవరు? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
మోడీ వ్యాఖ్యలపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. వలస కార్మికుల గురించి మోడీ కాస్తైనా ఆలోచించారా? అని ఆ పార్టీలు ప్రశ్నించాయి. ఉన్నఫలంగా ప్రకటించిన లాక్ డౌన్ తో వలస కార్మికులే కాదు, వేరే నగరాల్లో ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలు చేసుకునే వారికి కూడూ, గూడుకు ఇబ్బంది ఉండదు. అదే వలస కార్మికులది వేరే పరిస్థితి అని కూడా చెప్పనక్కర్లేదు.
పని చేసే ప్రాంతంలో లాక్ డౌన్ల ఫలితంగా పని లేకుండా పోవడమే కాదు, కనీసం ఆశ్రయం కూడా కష్టం. ఇలాంటి వారి సంఖ్య దేశంలో కోట్లలో ఉంది. లాక్ డౌన్ ప్రకటించగానే వీరి జీవితాలు దుర్భరంగా మారాయి. ఏం చేయాలో తెలియక సొంతూళ్లకు వెళదామంటే రైళ్లూ, బస్సులు అన్నీబంద్. దీంతో నడక మార్గాన వందల కిలోమీటర్లు ప్రయాణించిన వారూ కోకొల్లలు. చివరకు వీరి కోస శ్రామిక్ రైళ్లను పెట్టారు. వాటిల్లో మళ్లీ టికెట్ ధరలను పెట్టడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అలాంటి వారికి టికెట్ లు కొనిచ్చారని , తద్వారా కరోనాను వ్యాపింపజేశారని మోడీ అంటున్నారు!
మరి టికెట్ కొనిచ్చిన కాంగ్రెస్ నేతలది తప్పే అనుకుందాం. మరి రైళ్లను పెట్టిందెవరు? అనే ప్రశ్నకు భక్తులు తడుముకోకుండా సమాధానం ఇవ్వాలి! కరోనా వ్యాప్తి సమయంలో కాంగ్రెస్ అన్ని హద్దులూ మీరిందని కూడా మోడీ స్పష్టం చేశారు. అలాగే నెహ్రూపై విమర్శలతో మోడీ రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించారు!