బాబును చూసి…ఊస‌ర‌వెల్లి సిగ్గుప‌డుతోంది!

పూట‌కో రంగు, రోజుకో మాట మార్చేవారిని ఊస‌ర‌వెల్లితో పోలుస్తుంటారు. అలాంటి ఊస‌ర‌వెల్లి కూడా చంద్ర‌బాబునాయుడిని చూసి సిగ్గుప‌డుతోంది. జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాని మోదీని వెన‌కేసుకొచ్చేందుకు ప‌దేప‌దే దేశం కోస‌మ‌ని చెప్ప‌డంపై సోష‌ల్…

పూట‌కో రంగు, రోజుకో మాట మార్చేవారిని ఊస‌ర‌వెల్లితో పోలుస్తుంటారు. అలాంటి ఊస‌ర‌వెల్లి కూడా చంద్ర‌బాబునాయుడిని చూసి సిగ్గుప‌డుతోంది. జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాని మోదీని వెన‌కేసుకొచ్చేందుకు ప‌దేప‌దే దేశం కోస‌మ‌ని చెప్ప‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌పంచ రాజ‌కీయాల్లోనే ఇలాంటి అవ‌కాశ‌వాద‌, స్వార్థ రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌ర‌ని నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానంలో అవ‌కాశ‌వాదంతో ఎలా న‌డుచుకున్నారో చెబుతూ, ఆయ‌న్ను న‌గ్నంగా నిల‌బెట్టేందుకు నెటిజ‌న్లు ప్ర‌య‌త్నించారు. జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఏమ‌న్నారంటే…

‘ రాజకీయాల కంటే కూడా నాకు దేశం ప్ర‌ధానం. దేశాభివృద్ధి విషయంలో ప్ర‌ధాని మోదీ పాల‌సీల‌కు మద్దతిస్తాం. ఆయన దేశాభివృద్ధి దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా స్వాగ‌తిస్తాం’

‘రాజకీయాలు, దేశం వేర్వేరు. భారతదేశాన్ని ప్రధాని మోదీ ప్ర‌పంచ వ్యాప్తంగా బాగా ప్రమోట్‌ చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మన దేశాన్ని నిలపాలని ఆయన అనుకుంటున్నారు. దేశాభివృద్ధి కోణంలో ఆయన విధానాలకు ఒక భారత పౌరుడిగా మద్దతిస్తున్నాను’  

‘నాకు అధికారం ముఖ్యం కాదు. టీడీపీకి నాటి ప్ర‌ధాని వాజ్‌పయ్‌ తన కేబినెట్‌లో 7-8 మంత్రి పదవులు ఇస్తామన్నా  తీసుకోలేదు. దేశం విషయంలో రాజకీయాలకు చోటు లేదు. అభివృద్ధి ప్రాతిప‌దిక‌గా మేము కలుస్తాం’

ఇలాంటి కామెంట్స్‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. స‌రిగ్గా నాలుగేళ్ల క్రితం సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు దేశం కోసం బీజేపీని ఓడించాల‌ని, ప్ర‌ధాని మోదీని గ‌ద్దె దింపాల‌ని ఇదే చంద్ర‌బాబు ఘాటు విమ‌ర్శ‌లు చేశార‌ని …నాటి పేప‌ర్ క్లిప్పింగ్స్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో మోదీపై బాబు ఎలాంటి విమ‌ర్శ‌లు చేశారో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున జ‌నానికి తెలియ‌జేసేందుకు య‌త్నించ‌డం గ‌మ‌నార్హం.

“భారతదేశ రాజకీయాల్లో ఏ మాత్రం సిద్ధాంతాలు, విలువల్లేని ఏకైక వ్యక్తి చంద్రబాబే. అవకాశవాదాన్నేతన రాజ‌కీయానికి పునాదిగా చేసుకున్న నాయ‌కుడు చంద్రబాబే. 2004లో ఓడినప్పుడు.. బీజేపీ వల్లే ఓడిపోయామన్నారు. జీవితంలో కమలనాథులతో కలిసి నడిచేదిలేదని బీరాలు పోయారు”

“2014లో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు. హర్యానా వెళ్లి రాజ్‌నాథ్‌ను వేడుకుని కమలనాథులతో పొత్తుకు ఓకే చేయించుకున్నారు. 2019కు వ‌చ్చే స‌రికి దేశం కోసం కాంగ్రెస్‌తో స్నేహ హస్తం. మోదీని బండబూతులు తిట్టారు. ఇప్పుడు మ‌ళ్లీ మోదీ జపం. ఏం చేసినా ఇలాంటివి బాబుకు త‌ప్ప మ‌రొక‌రికి తెలియ‌ని అవ‌కాశ విద్య” అంటూ నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

నాడు పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్‌ను ఓడిస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు, ఆ త‌ర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నుంచి జంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతెందుకు ప్రత్యేక హోదా వ‌ల్ల ఏమొస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాన్ని అసెంబ్లీలో నిల‌దీసిన చంద్ర‌బాబునాయుడే, దాని కోస‌మే ఎన్‌డీఏ నుంచి బ‌య‌టికొచ్చాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం బాబుకే చెల్లింద‌ని నెటిజ‌న్లు తూర్పార‌ప‌ట్టారు.

పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టును కాంట్రాక్టు ప‌నులకు కక్కుర్తిప‌డి, కేంద్ర‌మే ఇచ్చింద‌ని బుకాయించ‌డం బాబుకే చెల్లు. దేశం కోసం కాంగ్రెస్‌లో పొత్తు కుదుర్చుకోవాల్సి వ‌చ్చింద‌ని బాబు మాట‌లు ఇంకా మార్మోగుతున్నాయ‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎల్లో ప‌త్రిక‌ల్లో మోదీపై విమ‌ర్శ‌ల‌కు సంబంధించి బ్యాన‌ర్ హెడ్డింగ్‌ల‌ను గుర్తు చేయ‌డం విశేషం.

మోసాల మోదీ..ఇలా చేస్తార‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు.., బీజేపీకి స‌హ‌క‌రించేవాళ్లు దేశ ద్రోహులు.., మోదీ క‌త్తులు, కోడి క‌త్తుల‌కు భ‌య‌ప‌డ‌ను.., మోదీ హ‌టావో!.., దేశాన్ని ఏకం చేసి మోదీని దించేస్తాం.

మోదీ త్వ‌ర‌లోనే మాజీ ..ఇంకో 80 రోజులే ఆయ‌న ప్ర‌ధాని….ఇలా ఎన్నెన్ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారో జ‌నానికి బాగా గుర్తుంది. మోదీ మ‌రోసారి ప్ర‌ధాని అవుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న మెప్పు కోసం … గ‌తంలో చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల్ని క‌న్వినియంట్‌గా చంద్ర‌బాబు విస్మ‌రించ‌డాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. 2024లో చంద్ర‌బాబు ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా వుందంటే… మోదీని భుజాన మోస్తాన‌న్న చంద్ర‌బాబును బీజేపీ ద‌గ్గ‌రికి రానివ్వ‌ని దుస్థితి.

అలాగే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు మిగిల్చిన చేదు అనుభ‌వాల రీత్యా… ఆయ‌న్ను రాహుల్‌గాంధీ, నితీష్‌కుమార్‌, మ‌మ‌తాబెన‌ర్జీ, ప‌రూక్ అబ్దుల్లా త‌దిత‌ర జాతీయ నేత‌లు ద‌గ్గ‌రికి తీసుకునే ప‌రిస్థితి వుండ‌దనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబుకు రాజ‌కీయ‌, అధికార ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, మ‌రేవి ప‌ట్ట‌వ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. “దేశం” ప్ర‌యోజ‌నాల కోసం భార‌త‌దేశాన్ని తెర‌పైకి తేవ‌డం చంద్ర‌బాబుకే చెల్లిందంటూ నెటిజ‌న్లు చాకిరేవు పెడుతున్నారు.