యాభై శాతం..బయ్యర్లకు వరం

ఆంధ్ర ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడం, యాభై శాతం ఆక్యుపెన్సీ విధించడం బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు వరంగా మారింది. నిర్మాతలకు మాత్రం ఇబ్బందిగా వుంది. ఆంధ్రలో టికెట్ రేట్లు తక్కువ. యాభైశాతం ఆక్యుపెన్సీ అంటూ బయ్యర్లు…

ఆంధ్ర ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడం, యాభై శాతం ఆక్యుపెన్సీ విధించడం బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు వరంగా మారింది. నిర్మాతలకు మాత్రం ఇబ్బందిగా వుంది. ఆంధ్రలో టికెట్ రేట్లు తక్కువ. యాభైశాతం ఆక్యుపెన్సీ అంటూ బయ్యర్లు కొనుగోలు రేట్లలో కోత పెడుతున్నారు. పుష్ప, అఖండ సినిమాలకు అలాగే జ‌రిగింది. బంగార్రాజు కొన్ని ఏరియాలకు అదే జ‌రిగింది.

కానీ వాస్తవంలో వ్యవహారం వేరుగా వుంది. ఒక్క శ్యామ్ సింగ రాయ్ సినిమాకు మినహా మరే సినిమాకు ఇబ్బంది పెద్దగా ఎదురు కాలేదు. అఖండ సినిమాకు సీడెడ్ లో 200 యూనిఫారమ్ రేటు అమ్మేసారు. ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా 100 రూపాయల యూని ఫారమ్ రేటు అమ్మేసారు.

ఇక పండగ సినిమాలు అయితే చెప్పనక్కరలేదు. బంగార్రాజు సినిమాకు ఆంధ్ర అంతా 100 రూపాయల యూనిఫారమ్ రేటు అమ్మేసారు. అదే టైమ్ లో మిగిలిన సినిమాలకు కూడా అదే చేసారు. దాంతో మంచి నెంబర్లు కనిపించాయి.

ఇప్పుడు మళ్లీ సినిమాల విడుదల మొదలైంది. ఖిలాడీ సినిమాకు రేట్లు తగ్గించమనే డిమాండ్ బయ్యర్ల నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. సెకెండ్ షో లేదు, యాభైశాతం ఆక్యుపెన్సీ, రేట్లు తక్కువ అన్నది కారణాలుగా చెబుతున్నారు. కానీ అలా తగ్గించనంత మాత్రాన మళ్లీ యూనిఫారమ్ 100 రేటు అమ్మరు అన్న గ్యారంటీ లేదు.

ప్రతిపక్షాలు, సినిమా అభిమానులు థియేటర్లను వేధించేస్తున్నారో అంటూ గోల చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు చూసీ చూడనట్లు వదిలేసింది. దాంతో మళ్లీ థియేటర్ల రేట్లు పెంచి అమ్మడం అన్నది మామూలైపోయింది. కానీ విడుదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం డబ్బులు కట్టమంటే, రేట్లను సాకుగా చూపించి బేరాలు ఆడడం మామూలైపోయింది. ఇంతకీ సినిమావాళ్లను సినిమా వాళ్లు వేధిస్తున్నట్లా? ప్రభుత్వం వేధిస్తున్నట్లా?