విశాఖ నుంచి పాల‌న‌పై తేల్చేసిన జ‌గ‌న్‌

ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విశాఖ నుంచి ప‌రిపాల‌న‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తేల్చేశారు. శ్రీ‌కాకుళం జిల్లాలో మూల‌పేట పోర్టుకు శంకుస్థాప‌నకు వెళ్లిన ఆయ‌న మ‌రోసారి ప‌రిపాల‌న రాజ‌ధానిపై ప్ర‌భుత్వ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. సీఎం…

ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విశాఖ నుంచి ప‌రిపాల‌న‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తేల్చేశారు. శ్రీ‌కాకుళం జిల్లాలో మూల‌పేట పోర్టుకు శంకుస్థాప‌నకు వెళ్లిన ఆయ‌న మ‌రోసారి ప‌రిపాల‌న రాజ‌ధానిపై ప్ర‌భుత్వ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. సీఎం జ‌గ‌న్ తాజా ప్ర‌క‌ట‌న ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఈ సెప్టెంబ‌ర్ నుంచి విశాఖ‌లోనే కాపురం పెట్ట‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. సెప్టెంబ‌ర్ నుంచే విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. ప్రాంతాల మ‌ధ్య వైష‌మ్యాలు పోవాల‌నే త‌లంపుతోనే అన్ని జిల్లాల అభివృద్ధి చేప‌ట్టామ‌న్నారు. రాష్ట్రంలో అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన న‌గ‌రం విశాఖ అని ఆయ‌న పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ నుంచే విశాఖ‌కు మ‌కాం మారుస్తున్న‌ట్టు సీఎం ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

ఎందుకంటే జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లుల్ని ఏపీ హైకోర్టు కొట్టి వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ స‌ర్కార్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఏపీ ప్ర‌భుత్వ పిటిష‌న్లపై విచార‌ణ చేప‌ట్టాల్సి వుంది. ఇటీవ‌ల విచార‌ణ‌లో భాగంగా త్వ‌ర‌గా తేల్చాల‌ని ఏపీ ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తిని సుప్రీంకోర్టు తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఒక‌వైపు సుప్రీంకోర్టులో రాజ‌ధాని అంశం పెండింగ్‌లో వుండ‌గానే, సీఎం జ‌గ‌న్ ఏకంగా సెప్టెంబ‌ర్‌లో విశాఖ నుంచి ప‌రిపాల‌న మొద‌లు పెడ‌తామ‌న‌డం కేవ‌లం రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే న్యాయ‌స్థానం తేల్చాల్సి వుంది. ప్ర‌స్తుతం ఏపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా విశాఖ నుంచి పాల‌న అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.