రామానాయుడు స్టూడియో స్వాధీనం చేసుకోవాలి

విశాఖ భీమిలీ రూట్ లో ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం ఆనాటి ప్రభుత్వాలు ఒక ఉద్దేశ్యం కోసం ఇచ్చిన 34 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఇంధన శాఖ…

విశాఖ భీమిలీ రూట్ లో ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం ఆనాటి ప్రభుత్వాలు ఒక ఉద్దేశ్యం కోసం ఇచ్చిన 34 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చిన ఉద్దేశ్యాలు నెరవేరనందుకు స్వాధీనం చేసుకోవడమే మంచిదని ఆయన అంటున్నారు.

ఆ స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించరాదని ఆయన అంటున్నారు. ఓపెన్ స్పేస్ గా దాన్ని ఉంచాలని అయితే ఇపుడు అక్కడ అక్రమంగా లే అవుట్లు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఆ భూమి యజమాని వుడా మాస్టర్ ప్లాన్ కి తూట్లు పొడుస్తున్నారని కూడా శర్మ ఆరోపించారు. దానితో పాటు అనేక ఉల్లంఘనలు యధేచ్చగా జరుగుతున్నాయని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ స్టూడియోకు సమీపంలోనే బుద్ధిస్టులకు చెందిన బావికొండ ఉందని ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలతో బావికొండ ప్రాంత ప్రశాంతతకు ఇబ్బందులు వస్తాయని ఆయన అంటున్నారు.

పరిశ్రమ అంటే భూమి ఇవ్వడం మంచిదే కానీ వాణిజ్య కార్యకలాపాలు, లే అవుట్లు అంటే ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. నిబంధనలు పక్కన పెట్టి స్టూడియో భూముల్లో ఇతరాత్రా కార్యక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా ఉండడం తగదని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం వెంటకే జోక్యం చేసుకుని స్టూడియో భూములను స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. లేకపోతే తాను న్యాయ పోరాటానికి సిద్ధపడతానని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. రామానాయుడు స్టూడియో నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వాలు నామమాత్రం ధరకు ల్యాండ్ అలాట్ చేశాయి. అయితే ఇపుడు లే ఔట్లు ఇతర కమర్షియల్ యాక్టివిటీని అక్కడ స్టార్ట్ చేయబోతున్నరని వార్తలు వస్తున్నాయి. దీని మీద శర్మ ఉద్యమిస్తున్నారు. రామానాయుడు స్టూడియో భూములను ప్రభుత్వం తీసుకుంటుందా.