సంక్షేమ ల‌బ్ధిదారుల్లో ఆందోళ‌న‌!

గ‌త నాలుగేళ్లుగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్‌కు ద‌క్కింది. అయితే సంక్షేమ క్యాలెండ‌ర్‌లో పేర్కొన్న‌ట్టుగా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెనను ఈ ద‌ఫా…

గ‌త నాలుగేళ్లుగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్‌కు ద‌క్కింది. అయితే సంక్షేమ క్యాలెండ‌ర్‌లో పేర్కొన్న‌ట్టుగా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెనను ఈ ద‌ఫా వాయిదా వేయ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక ఇబ్బందుల్ని ప్ర‌తిబింబిస్తోంది. నిధుల కొర‌త‌తో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన సంక్షేమ ప‌థ‌క ల‌బ్ధిదారుల ఖాతాల్లో నిధులు జ‌మ చేయ‌లేక‌పోయామ‌ని స్వ‌యంగా చీఫ్ సెక్ర‌ట‌రీ జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు.

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలోని నార్ప‌ల మండ‌ల కేంద్రంలో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన స‌భ‌ను షెడ్యూల్ ప్ర‌కారం రెండు రోజుల క్రితం నిర్వ‌హించాల్సి వుండింది. అయితే బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల్లో ఖాతాల్లో నిధులు జ‌మ కాక‌పోతే ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని సీఎం భావించారు. దీంతో వాయిదా వేసేందుకే ఆయ‌న మొగ్గు చూపారు. ఇదిలా వుండ‌గా సంక్షేమ క్యాలెండ‌ర్‌లో పేర్కొన్న‌ట్టు మిగిలిన ప‌థ‌కాల అమ‌లుపై ఆందోళ‌న నెల‌కుంది.  

ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సంక్షేమ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలో మే నెల‌లో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, జూన్‌లో జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), జూలైలో  జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (రెండో త్రైమాసికం), ఆగ‌స్టులో జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, ఇలా వ‌చ్చే ఏడాది మార్చిలో  జగనన్న వసతి దీవెన (రెండో విడత) నిధులు జ‌మ చేసేందుకు ముంద‌స్తుగా క్యాలెండ‌ర్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అప్పులు లెక్క‌కు మించి చేశారు. రానున్న ఎన్నిక‌ల సీజ్. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో ల‌బ్ధిదారుల్లో ఆందోళ‌న క‌లిగేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తే…. గ‌త నాలుగేళ్ల‌లో నిర్విరామంగా అందించిన ల‌బ్ధి అంతా బూడిద‌లో పోసిన చంద‌మ‌వుతుంది. ఇదే వైసీపీని భ‌య‌పెడుతోంది. అస‌లు త‌మ ఓటు బ్యాంకే సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి పొందుతున్న వార‌ని వైసీపీ పెద్ద‌లు చెబుతున్నారు. 

సంక్షేమ ప‌థ‌కాల‌కు రాష్ట్ర బ‌డ్జెట్ అంతా కేటాయించ‌డంతో, అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌నే ఆవేద‌న కొన్ని వ‌ర్గాల్లో వుంది. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో జ‌గ‌న్ స‌ర్కార్‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు క‌త్తిమీద సామే అని చెప్ప‌క త‌ప్ప‌దు.