ఈసారి కూడా క్లారిటీ మిస్…?

ఇప్పటికి సరిగ్గా మూడేళ్ల క్రితం ఒక లేఖ పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చారు. చిరకాల డిమాండ్ అయిన రైల్వే జోన్ ని విశాఖకు కానుకగా తమ ప్రభుత్వం ఇస్తున్నట్లుగ 2019లో విశాఖ…

ఇప్పటికి సరిగ్గా మూడేళ్ల క్రితం ఒక లేఖ పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చారు. చిరకాల డిమాండ్ అయిన రైల్వే జోన్ ని విశాఖకు కానుకగా తమ ప్రభుత్వం ఇస్తున్నట్లుగ 2019లో విశాఖ పర్యటనలో చాలా గొప్పగా  చెప్పారు. మరి ఇప్పటిదాకా దానికి సంబంధించిన కార్యాచరణ అయితే ఎక్కడా ఏ కోశానా లేదు.

ఆ మధ్యన కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ అయితే కొత్త జోన్లు అన్నవి ఇక లేనే లేవని తేల్చేసి గట్టి  షాక్ ఇచ్చేశారు. దాని తరువాత వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసివచ్చారు. రైల్వే జోన్ ఉంటుందని కూడా వారు చెప్పారు. ఈసారి బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ కి ఏకంగా మూడు వందల కోట్లు కేటాయిస్తారని కూడా అనకాపల్లి ఎంపీ సత్యవతి ప్రకటించారు కూడా.

కానీ కేంద్ర బడ్జెట్ చూస్తే మళ్లీ నీరసం, నిరాశ కలిపి వచ్చేస్తున్నాయి. ఈ బడ్జెట్ లో కూడా రైల్వే జోన్ కి నిధులు కేటాయించలేదు. మరి ఇలాగైతే రైల్వే జోన్ ఎపుడు అడుగులు ముందుకు వేస్తుందని రైల్వే కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కేంద్రం బడ్జెట్ కనుక రిలీజ్ చేస్తే రైల్వే జోన్ మీద ధీమా ఉంది అనుకోవచ్చు అని, ఇపుడు అలాంటిది ఏదీ లేకపోవడం వల్ల ఆ మధ్య రైల్వే మంత్రి చెప్పినట్లుగా విశాఖ జోన్ ఉందా లేదా అన్నదే డౌట్ గా ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే రైల్వే ఊసు లేని ఈ బడ్జెట్ చూసి విశాఖ వాసులు పెదవి విరుస్తున్నారు.

రైల్వే కూత ఎపుడూ విశాఖకు ఆమడ దూరమే అంటున్నారు. ఇక విశాఖ నుంచి ఇతర నగరలాకు ప్రతిపాదించిన రైళ్ల విషయంలో కూడా బడ్జెట్ లో ఏమీ ప్రతిపాదనలు లేవని అంటున్నారు. మొత్తానికి విశాఖకు ఇది షాకిచ్చే బడ్జెట్ అని విమర్శలు అయితే వస్తున్నాయి.