అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ…అదే అన్యాయం!

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై బీజేపీ మినహా, మిగిలిన రాజ‌కీయ ప‌క్షాలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక‌డుగు ముందుకేసి మోడీ స‌ర్కార్‌ను బండ‌కేసి…

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై బీజేపీ మినహా, మిగిలిన రాజ‌కీయ ప‌క్షాలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక‌డుగు ముందుకేసి మోడీ స‌ర్కార్‌ను బండ‌కేసి చావ‌బాదారు. వైసీపీ ఎంపీలు కూడా కేంద్ర బ‌డ్జెట్ ఏపీకి తీవ్ర నిరాశ మిగిల్చింద‌ని వాపోయారు.

ఈ నేప‌థ్యంలో కేంద్ర బ‌డ్జెట్‌పై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు స్పందించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మోడీ స‌ర్కార్ విష‌యంలో ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వైఖ‌రి సానుకూల దృక్ప‌థంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. మోడీ స‌ర్కార్ ఏం చేసినా జై కొట్ట‌డం వైసీపీ, టీడీపీ నేత‌ల‌కు అల‌వాటుగా మారిన సంగ‌తి తెలిసిందే. అందుకే తాజా కేంద్ర బ‌డ్జెట్‌పై ఏపీ రాజ‌కీయ ప‌క్షాల స్పంద‌న స‌ర్వ‌త్రా ఉత్కంఠ క‌లిగిస్తోంది.

కేంద్ర బ‌డ్జెట్‌పై టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం విశేషం. ఈ బ‌డ్జెట్ ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌న్నారు. రైతులు, పేద‌ల కోసం ఏం చేస్తారో బ‌డ్జెట్‌లో చెప్ప‌లేద‌ని విమ‌ర్శించారు. అలాగే వేత‌న జీవుల‌కు మొండిచేయి చూపార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కానీ న‌దుల అనుసంధానాన్ని మాత్రం ఆయ‌న అభినందించారు. 

ఇదిలా వుండ‌గా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న‌లో వైసీపీ మ‌రోసారి విఫ‌ల‌మైంద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. అంతే త‌ప్ప‌, రాష్ట్రానికి మోడీ స‌ర్కార్ అన్యాయం చేసింద‌నే మాట ఆయ‌న నోటి నుంచి రాక‌పోవ‌డాన్ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించార‌ని ఆయ‌న నిల‌దీశారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రంపై పోరాటం చేయ‌డంలో వైసీపీ, టీడీపీ దొందు దొందే. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం మోడీ స‌ర్కార్‌ను పొగడ్త‌ల‌తో ముంచెత్త‌డానికే స‌రిపోయింది. గ‌తంలో రాష్ట్రానికి మోడీ స‌ర్కార్ అన్యాయం చేస్తోంద‌ని ఒక్క‌రోజు కూడా వైసీపీ విమ‌ర్శించ‌లేదు. 

ఎంత‌సేపు టీడీపీపైన్నే వైసీపీ పోరాటం చేసేది. ఇప్పుడు అదే పంథాను టీడీపీ అనుస‌రిస్తోంది. తాము ఏమీ చేయ‌క‌పోయినా ప్ర‌శ్నించే ధైర్యం ఏపీ రాజ‌కీయ పార్టీల‌కు లేద‌నే లెక్క‌లేని త‌న‌మే… ఈ అన్యాయానికి కార‌ణ‌మ‌వుతోంద‌నే ఆవేద‌న ఏపీ పౌర‌స‌మాజం నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.