ఈ రోజు రాత్రికి అంద‌రికీ తెలుస్తుంది

నూత‌న పీఆర్సీతో జీతాలు పెర‌గ‌నే పెర‌గ‌వ‌ని ఒక వైపు ఉద్యోగులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతుంటే, ఉన్న‌తాధికారులు మాత్రం చ‌ల్ల‌బ‌రిచేందుకు య‌త్నిస్తున్నారు. అయితే ఉన్న‌తాధికారులు ఉద్యోగుల్ని క‌న్విన్స్ చేయ‌డంలో డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డుతోంది. ఉద్యోగులెవ‌రికీ జీతం…

నూత‌న పీఆర్సీతో జీతాలు పెర‌గ‌నే పెర‌గ‌వ‌ని ఒక వైపు ఉద్యోగులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతుంటే, ఉన్న‌తాధికారులు మాత్రం చ‌ల్ల‌బ‌రిచేందుకు య‌త్నిస్తున్నారు. అయితే ఉన్న‌తాధికారులు ఉద్యోగుల్ని క‌న్విన్స్ చేయ‌డంలో డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డుతోంది. ఉద్యోగులెవ‌రికీ జీతం త‌గ్గ‌కూడ‌ద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పార‌ని ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ సిగ్గుప‌డుతూ చెప్ప‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఉద్యోగుల జీతాలు పెరుగుతాయ‌ని సీఎం జ‌గ‌న్ ఎందుకు ధీమాగా చెప్ప‌లేక‌పోయారో సీఎస్ స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అని ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్యోగుల‌కు నూత‌న పీఆర్సీ ప్ర‌కారం జీతాలు చెల్లిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్‌శ‌ర్మ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల‌కు సీఎం ఏమి చేయ‌గ‌ల‌రో అన్నీ చేస్తార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఐఆర్‌ ఉన్నా.. ఐఆర్‌ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంద‌న్నారు.

అలాగే ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పార‌ని ఆయ‌న బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తే ఎక్కువ పెరుగుదల ఉంద‌న్నారు. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంద‌న్నారు. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదన్నారు. 

ఎవ‌రికీ జీతాలు త‌గ్గ‌లేద‌నే వాస్త‌వం ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంద‌ని స‌మీర్ శ‌ర్మ చెప్ప‌డం విశేషం. అలాగే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 

సమ్మె ఆలోచనను విరమించుకోవాల‌ని సీఎస్ విజ్ఞ‌ప్తి చేశారు. మనమంతా ఒక కుటుంబమ‌న్నారు. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రావాల‌ని సీఎస్ ఆహ్వానించారు.