పవన్‌కు ‘గ్యాప్’ దొరికితే అంతే సంగతులు!

షూటింగ్ గ్యాప్‌లో భేటీలు.. షాట్ గ్యాప్‌లో మీటింగులు… ఇదీ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీకోసం వెచ్చిస్తున్న సమయం తాలూకు వివరాలు. ఏడాదిన్నరగా కోల్పోయిన సినిమా ఆదాయం మొత్తం అర్జంటుగా రాబట్టేయాలని పట్టుదలతో మళ్లీ…

షూటింగ్ గ్యాప్‌లో భేటీలు.. షాట్ గ్యాప్‌లో మీటింగులు… ఇదీ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీకోసం వెచ్చిస్తున్న సమయం తాలూకు వివరాలు. ఏడాదిన్నరగా కోల్పోయిన సినిమా ఆదాయం మొత్తం అర్జంటుగా రాబట్టేయాలని పట్టుదలతో మళ్లీ షూటింగులు ప్రారంభించాడా? అని అనుమానం వచ్చేంత ముమ్మరంగా సినిమాల్లో తలమునకలై ఉన్న పవన్ కల్యాణ్ పార్టీని గాలికొదిలేసినట్లేనా? లేదా? ఈ సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.

అయితే ఆయన పార్టీకోసం, ప్రజల కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్న అభిప్రాయాన్ని నలుగురిలోనూ కలిగించేందుకు తాపత్రయ పడుతున్నారు. అమరావతిలో టూర్లు ప్రకటించారు. అక్కడి పల్లెల్లో మళ్లీ మళ్లీ పర్యటించి ప్రజల్తో రైతులతో మాట్లాడుతానని అన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా కు చెందిన మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో కూడా మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి సంబంధించిన షెడ్యూలు కూడా విడుదల అయింది. 6,7 తేదీల్లో ఆయన కర్నూలు జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతారు.

ట్విస్టు ఏంటంటే.. ఈ సమావేశాలు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి.. నియోజకవర్గ సమావేశాలను పార్టీ అధినేత హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.

చూడబోతే.. పవన్ కల్యాణ్ కు ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూలులో ఏపీలో మీటింగులు పెట్టడానికి ఖాళీ లేనట్లుంది. ఆయన షూటింగులు మొదలయ్యాయి. షెడ్యూలుకు షెడ్యూలుకు మధ్య గ్యాప్ దొరికితే కొన్ని రోజుల ఖాళీ ఉంటుంది. అప్పుడు ఎంచక్కా.. అమరావతి టూర్లు విజయవాడ క్యాంపు ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉన్నారు. అదే సమయంలో- షాట్‌కు షాట్ కు మధ్య గ్యాప్ దొరికితే కొన్ని గంటల వ్యవధి ఉంటుంది.. ఆ గ్యాప్ లో నియోజకవర్గాల భేటీలు ప్లాన్ చేస్తున్నట్లుంది. అందుకే అందరినీ ఇక్కడకు రమ్మన్నట్లు అనిపిస్తోంది. మొత్తానికి ఇంతగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయాలను వదిలేశాడని ప్రజలు అనుకోకుండా పవన్ జాగ్రత్తగానే మేనేజి చేస్తున్నారు!

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది