మెగాస్టార్ మాట చెల్లనట్లేనా?

మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు కదా. ఇక అంతా మంచే జ‌రుగుతుంది…అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు హీరో నాగార్ఙున కొన్ని రోజుల క్రితం.  Advertisement ఆంధ్ర సిఎమ్ జ‌గన్ అపాయింట్ మెంట్ దొరికింది. మెగాస్టార్ వెళ్లి…

మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు కదా. ఇక అంతా మంచే జ‌రుగుతుంది…అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు హీరో నాగార్ఙున కొన్ని రోజుల క్రితం. 

ఆంధ్ర సిఎమ్ జ‌గన్ అపాయింట్ మెంట్ దొరికింది. మెగాస్టార్ వెళ్లి కలిసి వచ్చారు. సిఎమ్ ఇంటిలో మటన్ బిర్యానీ ఆరగించి వచ్చారు. కొన్నాళ్లు ఎవ్వరూ ఏమీ మాట్లాడవద్దు, అంతా సానుకూలంగా జ‌రుగుతుంది అంటూ మైక్ ముందు మెగాస్టార్ సెలవిచ్చారు.

కట్ చేస్తే…అంతా జ‌రిగి మూడు వారాలు అయిపోయింది. కానీ ఏమీ జ‌రిగలేదు. జ‌రుగే దాఖలా కనిపించడం లేదు. మధ్యలో మరో ముచ్చట చోటు చేసుకుంది. చిరంజీవి ఇండస్ట్రీ తరపున సంప్రదింపులకు వెళ్లలేదు..సిఎమ్ తో ఆయన ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదు అంటూ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సెలవిచ్చారు. సిఎమ్ తో మెగాస్టార్ భేటీ అయినపుడు పేర్ని నాని అక్కడ లేకపోవడం ఇక్కడ గమనార్హం.

ప్రస్తుతం అయితే ఆంధ్రలో సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా వుంది. ఎప్పుడు సెకెండ్ షో కు అనుమతి ఇస్తారో తెలియదు. యాభై శాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు తీస్తారో తెలియదు. ఆంధ్రలో కన్నా ఎక్కువ కేసులు వున్న ఏ రాష్ట్రంలోనూ ఏ ఆంక్షలూ లేవు. ఇక్కడ మాత్రం సినిమా రంగం మీద మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఈనెల 10న కోర్టుకు ప్రభుత్వం టికెట్ ల విషయంలో తన అభిప్రాయం వెల్లడిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది పాటి సవరణలతో కొత్త రేట్ల ప్రతిపాదన ఇస్తారని టాక్ వినిపిస్తోంది.నిజంగా ఇస్తారా? ఇస్తే ఆ రేట్లు అయినా ఆమోదయోగ్యంగా వుంటాయా? లేదూ అంటే ఏం జ‌రుగుతుంది? ఇలాంటి పాయింట్లు అన్నీ ఇంకా ప్రశ్నలుగానే మిగిలి వున్నాయి.

ఫిబ్రవరి నెలకు టాలీవుడ్ దూరంగా వుందీ అంటే దానికి కారణం ఇదే. నిజానికి ఈ సమస్యలు లేకుంటే ఫిబ్రవరిలో కూడా పెద్ద సినిమాల హడావుడి వుండేది. ప్రస్తుతానికి రవితేజ‌ ఖిలాడీ మాత్రమే ఈ పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి వస్తోంది.