అనవసరపు దూకుడుకు అక్షింతలు!

నిజానికి, రాజధాని తరలింపు విషయంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కంగారు పడవలసిన పనేమీ లేదు. వారికి ఆత్రుత, ఆందోళన అనవసరం. జగన్ సర్కారులోని మంత్రి కురసాల కన్నబాబు చెప్పినట్లుగా.. మహా అయితే ఆలస్యం కావొచ్చు…

నిజానికి, రాజధాని తరలింపు విషయంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కంగారు పడవలసిన పనేమీ లేదు. వారికి ఆత్రుత, ఆందోళన అనవసరం. జగన్ సర్కారులోని మంత్రి కురసాల కన్నబాబు చెప్పినట్లుగా.. మహా అయితే ఆలస్యం కావొచ్చు గానీ.. రాజధాని తరలింపు మాత్రం జరిగి తీరుతుంది. ఆ విషయంలో జగన్ చాలా పట్టుదలగానే ఉన్నారు. … అయినప్పటికీ, ప్రభుత్వం కంగారు పడుతోంది. కొంతకాలం ఆగితే అంతా సాఫీగా జరిగిపోయే పనుల విషయంలో, కంగారుగా అనవసరపు దూకుడుతో నిర్ణయాలు తీసుకుంటూ లేని తగాదాల్ని సృష్టించుకుంటోంది.

రాజధాని తరలింపు వ్యవహారం ఇప్పటికే కోర్టు గడప తొక్కింది. రాజధాని తరలింపునకు జరుగుతున్న ప్రయత్నాలను తర్వాతి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేయాలని, అలాంటిదేమైనా జరిగితే అందుకు బాధ్యులైన అధికారుల నుంచే ఖర్చులు వెనక్కు రాబడతాం అని హైకోర్టు  ఇదివరకే చెప్పింది. అయితే విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలించడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం గమనార్హం.

ఈవిషయం తాజాగా హైకోర్టు ముందుకు రావడంతో ప్రభుత్వ చర్యలను వారు తీవ్రంగా ఆక్షేపించారు. స్టేటస్ కో ఆదేశాలిస్తామంటూ హూంకరించారు. అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. ఇదంతా ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా… అనుచితమైన తొందరపాటును వారు ప్రదర్శిస్తున్నారనే భావనను ప్రజలకు కలిగిస్తోంది. అనవసరంగా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకమైన చర్చ న్యాయస్థానం వేదికగా జరిగేందుకు ఆస్కారం కల్పించినట్లు అయింది.

ఈ దూకుడు జగన్ ప్రభుత్వానికి అనవసరం అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. శాసనసభలో ఇప్పటికే బిల్లు పాసయింది. మండలివద్ద ఆగింది. మండలి రద్దు నిర్ణయం అనేది.. కొన్ని నెలల్లోగా కార్యరూపం దాలుస్తుంది. మండలి అభ్యంతరాలకు ఆపైన విలువ ఉండదు. జగన్ ఇష్టానుసారంగా నిర్ణయాలన్నీ అమలవుతాయి. కాకపోతే అందుకు కొన్ని నెలలు వేచి ఉండాలి. ఆ మాత్రం ఓపిక ప్రభుత్వానికి లేకపోతే ఎలా? ఇది అయిదేళ్లు ఉండాల్సిన ప్రభుత్వం.. రేపో మాపో దిగిపోయేది కాదు. ఈలోగా వారు తలచిన అన్ని పనులనూ చక్కబెట్టగలరు. తమ పాలన సామర్థ్యాన్ని  నిరూపించుకోగలరు. అయినప్పటికీ.. ఇలాంటి అనవసర దూకుడు ప్రదర్శించి.. అక్షింతలు వేయించుకోవడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

బాలయ్య గుండు సీక్రెట్ అదేనా?