ఎన్నిక‌ల బ‌రిలో వివేకా కుమార్తె…క‌డ‌ప‌లో చ‌ర్చ‌!

మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. డాక్ట‌ర్ సునీత గురించి మీడియాలో భిన్న‌మైన క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న వీర వ‌నిత‌గా ఆమెను…

మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. డాక్ట‌ర్ సునీత గురించి మీడియాలో భిన్న‌మైన క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న వీర వ‌నిత‌గా ఆమెను ఎల్లో మీడియా చిత్రీక‌రిస్తోంది. జ‌గ‌న్ సొంత మీడియా డాక్ట‌ర్ సునీత‌ను విల‌న్‌గా జ‌నం ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. వివేకాను కుమార్తె సునీత‌, అల్లుడు న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డే చంపించార‌ని వైసీపీ అనుకూల మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది.

వైరి వ‌ర్గాలుగా విడిపోయిన త‌ర్వాత ఆరోప‌ణ‌ల్లో నిజాల‌ను వెతుక్కోవ‌డం అంటే… నేతి బీర‌కాయ‌లో నెయ్యి కోసం అన్వేషించ‌డం మాదిరిగా అవుతుంది. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో డాక్ట‌ర్ సునీత రాజ‌కీయ ప్ర‌వేశంపై ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే వివేకా హ‌త్య కేసులో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. భాస్క‌ర్‌రెడ్డి కుమారుడైన క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి మెడ‌పై అరెస్ట్ క‌త్తి వేలాడుతోంది.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే… వివేకా హ‌త్య రానున్న ఎన్నిక‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ క‌డ‌ప జిల్లాలో విస్తృతంగా సాగుతోంది. రానున్న ఎన్నిక‌ల్లో వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత రాజ‌కీయ ప‌య‌నంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. పులివెందుల లేదా క‌డ‌ప లోక్‌స‌భ బ‌రిలో డాక్ట‌ర్ సునీత వుంటుంద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఒకవేళ ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఎఫెక్ట్ ఎలా వుంటుంద‌నే కోణంలో అంచ‌నాలు వేస్తున్నారు.

డాక్ట‌ర్ సునీత ఎన్నిక‌ల బ‌రిలో వుంటే మాత్రం వైసీపీకి న‌ష్టం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేసి, త‌న తండ్రిని చంపిన , అలాగే మ‌ద్ద‌తు ఇచ్చిన వారిని ఓడించాల‌ని క‌న్నీళ్ల‌తో పిలుపు ఇస్తే మాత్రం ఫ‌లితాలు అనూహ్యంగా వుండే అవ‌కాశాలున్నాయ‌ని వైసీపీ, టీడీపీ నేతలు అంటున్నారు.  ఎందుకంటే డాక్ట‌ర్ సునీత‌ను బాధితురాలిగా స‌మాజం చూస్తోంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌ను కూడా ఇలా చూడ‌డం వ‌ల్లే క‌డ‌ప జిల్లా ఆయ‌న్ని నెత్తిన పెట్టుకుంది.

నాయ‌కుల్ని ప్ర‌జ‌లెప్పుడూ వ్య‌క్తిగ‌తంగా ఊరికే ఇష్ట‌ప‌డ‌డం , వ్య‌తిరేకించ‌డం ఉండ‌దు. ఒక బ‌లమైన కార‌ణం నాయ‌కుల్ని ఇష్ట‌ప‌డేలా చేస్తుంది. ఆ ఇష్టం పోవ‌డానికి కూడా బ‌ల‌మైన కార‌ణం వుంటుంది. వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత విష‌యంలో క‌డ‌ప జిల్లా ప్ర‌జానీకంలో తెలియ‌ని సానుభూతి ఏదో డెవ‌లప్ అవుతోంది. దాన్ని వైసీపీ ఏ మేర‌కు ప‌సిగ‌డుతున్న‌దో తెలియ‌దు. 

గ‌తంలో పులివెందుల నుంచి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి వైఎస్ వివేకానంద‌రెడ్డి పోటీ చేయ‌డం తెలిసిందే. పులివెందుల‌లో వైఎస్సార్ కంటే వివేకాకు 3 వేల వర‌కూ ఓట్లు ఎక్కువ వ‌చ్చేవి. వైఎస్సార్‌, వివేకా రామ‌ల‌క్ష్మ‌ణుల్లా అన్యోన్యంగా వుండేవారు. త‌న కంటే వివేకా జ‌నంతో ఎక్కువ మ‌మేకం అయ్యేవార‌ని వైఎస్సార్‌కు తెలుసు. త‌మ్మున్ని చూసి వైఎస్సార్ గ‌ర్వ‌ప‌డేవారే త‌ప్ప‌, ఈర్ష్య‌కు లోను కాలేదు. ప్ర‌స్తుత ప‌రిణామాలు తారుమారు అయ్యాయి.

అయితే తండ్రిని హ‌త్య చేసిన వారిని క‌ట‌క‌టాల‌పాలు చేయాల‌నే ఏకైక ల‌క్ష్యం త‌ప్ప‌, సునీత‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేద‌న్న‌ది వాస్త‌వం. సునీత రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. అయితే ఆమె వెనుక చంద్ర‌బాబునాయుడు ప‌రోక్షంగా ఉన్నార‌నేది నిజం. ఎందుకంటే న్యాయ పోరాటంలో భాగంగా కొండ‌ను ఢీకొడుతున్న త‌న‌కు రాజ‌కీయ అండ అవ‌స‌ర‌మ‌ని ఆమె గుర్తించింది. 

హ‌త్య కేసులో ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి కుటుంబాన్ని దోషులుగా నిల‌బెడితే, అది త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని టీడీపీ త‌న వంతు స‌హకారాన్ని అందించింది. కానీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేలా సునీత‌ను ఒప్పించ‌డంలో చంద్ర‌బాబు టీమ్ ఫెయిల్ అయ్యింద‌న్న‌ది నిజం. ఇదే సంద‌ర్భంలో ఆమె పోటీపై చ‌ర్చ జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం.