ధర్మాన నోటిదూల: తటస్థులంటే గోడమీది పిల్లులా!

తన నోటిదూల వలన అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ కొంచెమైనా చేటు చేయగలిగిన కొద్ది మంది నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ముందువరుసలో ఉంటారు.  Advertisement తన నోటికి ఏది వస్తే అది…

తన నోటిదూల వలన అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ కొంచెమైనా చేటు చేయగలిగిన కొద్ది మంది నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ముందువరుసలో ఉంటారు. 

తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడంలో ఆయన సిద్ధహస్తులు. మూడు రాజధానుల పేరుతో జగన్ సర్కారు వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నాం అని చెబుతోంటే.. ‘‘మూడురాజధానులు అనేది ట్రాష్.. రాజధాని విశాఖ మాత్రమే, అమరావతి, కర్నూలు ఉత్తుత్తి మాటలే’’ అనేమాటలతో డేమేజి చేయగలగిన ఘనుడు ధర్మాన. అలాగని ఆయన ఉత్తరాంధ్ర వాసుల్లో ఏమాత్రం పార్టీ మీద ప్రేమను బిల్డప్ చేశారో పట్టభద్ర ఎన్నికల్లో తేలిపోయింది. అలాంటి ధర్మాన తాజాగా ఒక వర్గం ప్రజలు పార్టీని ఈసడించుకునే మాటలతో చర్చనీయాంశం అవుతున్నారు.

వాలంటీర్లను వైసీపీకి అనుకూలంగా పనిచేయమని చెప్పడానికి ఆయన ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ఏకంగా 60 మంది వాలంటీర్లు గైర్హాజరు కావడం, వారి మీద మంత్రి గారికి ఎంత పట్టు ఉన్నదో నిరూపించే ఒక అంశం. కాగా, ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేస్తాం అని చెప్పే ప్రజలతో ఆ మేరకు దేవుడి పటం మీద ఒట్టు వేయించుకోవాలంటూ వాలంటీర్లకు కొత్త బాధ్యత పురమాయించారు. దాని సంగతి పక్కన పెడితే..

ఈ ప్రసంగంలో ధర్మాన ఓటర్లను మూడు రకాలుగా వర్గీకరించారు. ‘ఒకటి- వైసీపీ ఓటర్లు. రెండు- టీడీపీ ఓటర్లు. మూడు- గోడమీద పిల్లి రకం ఓటర్లు’ అని సెలవిచ్చారు. ఇక్కడ గోడమీది పిల్లి ఓటర్లు అంటే.. మాన్య మంత్రివర్యుల ఉద్దేశం.. తటస్థ ఓటర్లు అన్నమాట. తటస్థ ఓటర్లను ఇలా అభివర్ణించడం చాలా అవమానకరంగా ఉంది. మంత్రి చవకబారు ఆలోచన సరళికి నిదర్శనంగా కూడా ఉంది.

ప్రజాస్వామ్యంలో తటస్థ ఓటర్ల పాత్ర చాలా విలువైనది. సాధారణంగా ఓటర్లలో చాలా మంది పార్టీ ప్రాతిపదికన చీలిపోయి ఉంటారు. ఇలా ఒక పార్టీపట్ల విపరీతమైన అభిమానంతో, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి మాత్రమే ఓటు వేసే వైఖరికి వారికి ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. 

కుల, మతాల ప్రేమ, ఆ పార్టీ నాయకుల మీద గుడ్డి నమ్మకం ఇలాంటివి అనేకం. అదే సమయంలో కులమతాలు పట్టించుకోకుండా.. ఒక పార్టీకి కట్టుబడకుండా, మంచి చెడూ చూసుకుని, అభ్యర్థుల గుణగణాల్ని, పార్టీల విధివిధానాల్ని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఓటు వేసే వాళ్లు తటస్థ ఓటర్లు. వారు మంచి చెడులను నిర్ణయిస్తారు. 

అగ్ర పార్టీల్లో ఎవరి సొంత ఓటు బ్యాంకులు వారికి ఉంటాయి. అలాంటప్పుడు, తటస్థ ఓటర్ల నమ్మకాన్ని చూరగొన్న పార్టీ మాత్రమే సాధారణంగా అధికారంలోకి వస్తుంది. అలాంటి తటస్థ ఓటర్లను గోడమీద పిల్లులుగా గేలిచేస్తూ మాట్లాడడం అనేది ధర్మానలో ఉన్న అహంకారానికి నిదర్శనం అనుకోవాలి. 

తాము ఏ పార్టీకి ఓటు వేస్తామో తేల్చుకోకుండా, చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే కోటాలో.. డబ్బుకు ఆశపడే ఓటర్లు కూడా ఉండొచ్చు. ఏ పార్టీ ఎక్కువ డబ్బు ఇచ్చి తమ ఓటును కొనుక్కుంటే వారికి మాత్రమే ఓటు వేయాలని అనుకోవచ్చు. వారు ప్రజాస్వామ్యానికి మచ్చలే అని మనం అనుకోవచ్చు. కానీ వారి ఓట్లకు ధర కట్టి, ప్రజాస్వామ్యాన్ని నీచస్థాయికి దిగజార్చినది మన నాయకులే అని గుర్తుంచుకోవాలి. 

అభ్యర్థుల మంచిచెడులు, పార్టీల విధివిధానాలు- పోకడల్లో సహేతుకత అనే అంశాలపై విచక్షణ ఉపయోగించి, అదే ప్రాతిపదికగా తమ ఓటుకు విలువ ఇచ్చేవారే తటస్థ ఓటర్లు! అలాంటి వారి గురించి ధర్మాన వంటి ఒక స్థాయి ఉన్న నాయకులు లేకిగా మాట్లాడడం తగదు!