జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఘాటు విమర్శలు చేశారు. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్‌పై నిప్పులు చెరిగారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేయకుండా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునివ్వడాన్ని ఆమె తప్పు పట్టారు. పోటీ చేయనందుకు పార్టీ పెట్టడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ అమ్ముడు పోయారని తీవ్రస్థాయిలో రోజా విమర్శించారు.
ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయమై బేరాలాడేందుకు ఆయన ఢిల్లీలో కూచున్నారని విమర్శించారు. అది జనసేన పార్టీనా లేక తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే మోడీ భజన సేన పార్టీనో తనకు అర్థం కావడం లేదని సెటైర్ వేశారు.
పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే పోటీ చేయకుండా బీజేపీ-టీడీపీలకు ఓటు వేయాలని, ఏం జరిగినా తాను చూసుకుంటానని నమ్మబలికారన్నారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారని రోజా మండిపడ్డారు.
తన సామాజిక వర్గం ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ గెలవలేకపోయారన్నారు. అలాంటప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో ఆయనేం చేస్తారని ప్రశ్నించారు. అలాగే తిరుపతిలో గెలిచి తీరుతామని బీజేపీ ధీమాగా చెబుతోందని, ఏమంటారనే ప్రశ్నకు ఆమె గట్టి జవాబిచ్చారు.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ గెలవాలని ఆశ పడడంలో తప్పు లేదన్నారు. కానీ అత్యాశ మంచిది కాదన్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం వైసీపీదేనని ఆమె ధీమాగా చెప్పారు.
ఇక టీడీపీ విషయానికి వస్తే అమరావతిని అద్భుతంగా కట్టానని గ్రాఫిక్స్ చూపించి నమ్మించానని అనుకున్నారని, కానీ అదే రాజధాని ప్రాంతంలోని రెండు అసెంబ్లీ సీట్లను తమ పార్టీ గెలుచుకుందన్నారు. అలాగే బాబు ముద్దుల తనయుడు లోకేశ్‌పైనే తమ పార్టీ గెలిచిందన్నారు.
ఇక తిరుపతిలో ఆ పార్టీ ఏం గెలుస్తుందని ప్రశ్నించారు. బాబు గురించి సొంత జిల్లా వాసులకు బాగా తెలుసన్నారు.