పవన్, కమలం నోర్లకు తాళాలు!

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి అటు పవన్ కల్యాణ్ గానీ, కమల దళాలు గానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయి. తమ కేంద్ర నాయకత్వం ఎలా స్పందిస్తోందనే స్పృహ కూడా లేకుండా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ తో…

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి అటు పవన్ కల్యాణ్ గానీ, కమల దళాలు గానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయి. తమ కేంద్ర నాయకత్వం ఎలా స్పందిస్తోందనే స్పృహ కూడా లేకుండా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ తో ముడి ఉన్న నేతలు తమ ఇష్టం వచ్చినట్లుగా రాజధాని విశాఖకు తరలడానికి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు, మభ్యపెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. లోక్ సభలో హోంశాఖ సహాయమంత్రి చేసిన అధికారిక ప్రకటన నేపథ్యంలో వీరందరి నోర్లకు తాళాలు పడినట్టే లెక్క.

కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందంటూ.. ఎంపీ సుజనాచౌదరి ఒక కొత్త ప్రహసనానికి తెరతీశారు. ఆయన ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినా.. అవి సాంతం రివర్స్ లోనే జరుగుతాయనేది ఏపీ ప్రజలకు అనుభవమే. గతంలో ఆయన కేంద్రమంత్రిగా వెలగబెడుతుండగా.. ప్రత్యేకహోదా విషయంలో కూడా ఇలాంటి మెరమెచ్చు మాటలే అనేకం చెబుతూ ఆయన ప్రజలను వంచిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అమరావతిలో భూముల కొనుగోలులో ఆయనపై అనేక ఆరోపణలున్న సంగతి కూడా తెలిసిందే.

అలాగే కన్నా లక్ష్మీనారాయణ. ఆయన గుంటూరు వాడే కావడం విశేషం. ఆయన కూడా రాజధాని తరలింపు అసాధ్యం. అప్రజాస్వామికం.. అంటూ పదేపదే వల్లిస్తూ.. స్థానికంగా తన పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇక కొత్తగా కమలంతో జట్టు కట్టిన పవన్ కల్యాణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంతగా ఎగిరెగిరి పడుతున్నారో అందరికీ తెలుసు. అమరావతి ప్రజలను అతిగా రెచ్చగొట్టడంలో అందరికంటె ఎక్కువ పాత్ర పోషిస్తున్నది పవన్ కల్యాణే. షూటింగులకు మధ్య గ్యాప్ దొరికినప్పుడెల్లా ఆయన అమరావతి టూరు పెట్టుకుంటున్నారు.

ఇప్పుడు కేంద్రం.. ఈ విషయంలో మేం తలదూర్చం అన్నట్లుగా అధికారిక ప్రకటన చేయడంతో.. వీరందరి నోర్లకు తాళాలు పడుతాయి. క్రమంగా భాజపా, పవన్ కల్యాణ్ లు ఈ విషయంలో పూర్తిగా చల్లారిపోతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది