రాజధాని అమరావతి విషయమై అమరావతి రైతులు ఢిల్లీలో హల్చల్ చేస్తున్న విషయం విదితమే. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు.. రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడినీ కలిశారు.. పరిస్థితిని వివరించారు. 'సుదీర్ఘ రాజకీయ అనుభవం వెంకయ్యనాయుడుకి సొంతం.. ఆయనకి అన్ని విషయాలూ తెలుసు..' అంటూ ఉపరాష్ట్రపతిని కలిసిన తర్వాత అమరావతి రైతులు వ్యాఖ్యానించారు.
అమరావతి రైతుల తరఫున ఢిల్లీకి వెళ్ళిన జేఏసీ నేతలు, ఢిల్లీలో చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. అమరావతి కోసం రైతులు తమ భూముల్ని ఇచ్చిన మాట వాస్తవం. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం తెరపైకి తెస్తే, దానిపై అప్పట్లో కొందరు వ్యతిరేకించారు.. కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పూలింగ్‌లో భూములు ఇవ్వకపోతే, భూముల్ని బలవంతంగా తీసుకుంటామనీ అప్పట్లో చంద్రబాబు సర్కార్ హెచ్చరించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
'ఇచ్చిన హామీలకు కట్టుబడి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి' అని రైతులు డిమాండ్ చేయడం వరకూ బాగానే వుందిగానీ.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పడితే, అమరావతి ప్రాధాన్యత తగ్గిపోతుందనీ, తమ భూముల విలువలు పడిపోతాయనీ రైతులు ఆందోళన చెందడం ఎంతవరకు సబబు.? పైగా, 'మా ఇళ్ళల్లో జరగాల్సిన పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి.. కట్న కానుకలుగా భూములు రాసిచ్చాం.. ఇప్పుడు వాటి విలువ పడిపోయేసరికి.. సంబంధాలు చెడిపోతున్నాయి..' అని రైతులు వాపోతున్నారు.
మామూలుగా అయితే, వరకట్నం అనేది సామాజిక రుగ్మత. అలాంటి సామాజిక రుగ్మతని సాకుగా చూపి.. అమరావతి విషయంలో రైతులు ప్రభుత్వానికి మాట్లాడితే ఎలా.? ఇక్కడో విషయం సుస్పష్టం. రైతుల ఆవేదనను అర్థం చేసుకోగలమని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ రైతుల్ని తెరవెనుకాల రాజకీయ పార్టీలు రెచ్చగొడుతూనే వున్నాయి. ఈ క్రమంలోనే రైతుల తరఫున జేఏసీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమవుతున్నాయి.. కొన్నిసార్లు వివాదాస్పదమవుతున్నాయి కూడా.!