అఖిల్ ఫోన్ చేసి సురేందర్ రెడ్డి దగ్గర మంచి కథ వుందని చెప్పడంతో ఏజెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైనందని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అప్పుడే తొలిసారి వక్కంతం వంశీ వచ్చి కథ చెప్పారని, విన్నానని వివరించారు. 2021 ఏప్రిల్ లో ప్రారంభించామని, కోవిడ్ కారణంగా డిలే అయిందని, దానికి తోడు చాలా ఎక్కువ లోకేషన్లలో షూట్ చేయడం వల్ల కూడా సినిమా నిర్మాణానికి రెండేళ్ల సమయం పట్టిందని ఆయన గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూలో వివరించారు.
అన్ని విధాలా బాగుంటాయనే ట్యూన్ లు ఎంపిక చేస్తామని, కొన్ని సార్లు అడియో క్లిక్ అవుతాయని, కొన్ని వీడియోగా క్లిక్ అవుతాయని, అసలైన పాట ఇంకా విడుదల చేయాల్సి వచ్చింది. సినిమాలో భీమ్స్ తో ఓ మాంచి మాస్ సాంగ్ చేయించామని చెప్పారు. అదే పాట మొదటే రెడీ అయి వుంటే బాగుండేదని, డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో కూడిన విడియో విడుదల చేద్దామనే ఆలోచనతో ఆలస్యం అవుతోందని అన్నారు.
అఖిల్ బాగా నటిస్తాడని తెలుసు, హార్డ్ వర్క్ చేస్తాడని తెలుసు, కానీ ఓ రోజు షూట్ లో ఓ ఎమోషన్ సీన్ లో అతను చేసిన వర్క్ చూసి, తనకు అఖిల్ మంచి స్టార్ అయిపోతాడనే విషయం అర్థమైందని అన్నారు. నెపోటిజం అని అనేయడం సులువు అని, కానీ వారసులుగా వచ్చే వారి మీద విపరీతమైన ప్రెజర్ వుంటుందని అన్నారు. సక్సెస్ కోసం వాళ్లు చాలా తపన పడాల్సి వుంటుందన్నారు.
అఖిల్ ను ఇలాంటి గెటప్ లో ఇప్పుడు అంతా చూస్తున్నారని, కానీ ముందుగా దాన్ని ఊహించి డిజైన్ చేసిన క్రెడిట్ మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డిదే అన్నారు. తెలుగు సినిమా స్పాన్ ఇప్పుడు బాగా పెరిగిపోయిందని, బాహుబలి ముందు మన సినిమా అంటే తనకు కూడా ఓ లెక్క వుండేదని, కానీ తరువాత మొత్తం మారిపోయిందని అన్నారు.
బాహుబలి విషయంలో బడ్జెట్ చూసుకుని వుంటే ఇవాళ తెలుగు సినిమాకు ఈ మార్కెట్ ఏర్పడి వుండేది కాదనన్నారు. ఏజెంట్ మొదలు పెట్టినపుడు ముందే తెలుసు, ఎంత బడ్జెట్ అవుతుందని, కానీ ఆ మేరకు మార్కెట్ వస్తుందని అంచనా వేసే దిగామన్నారు. ఇప్పుడు తెలుగు సినిమా వ్యాపారం దేనికదే అని, వన్ ప్లస్ వన్ కాదు, ఫైవ్ కూడా కావచ్చన్నారు. అదృష్టం కొద్దీ తెలుగు సినిమా థియేటర్ మార్కెట్ బాగుందన్నారు. గతంలో సినిమా నిర్మాణానికి భయపడాల్సి వచ్చేదని, ఇప్పుడు సరైన కంటెంట్ వుంటే ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చన్నారు.
అఖిల్ పూర్తిగా స్పయ్ మూవీ ఫార్మాట్ లోనే వుంటుందని, రెగ్యులర్ తెలుగు మూవీ మాదిరిగా హీరో ఫ్రెండ్, పక్కన కమెడియన్ ఇలాంటివి వుండవన్నారు. స్ట్రయిట్ గా ఓ స్పయ్ మూవీ మాదిరిగా వేగంగా సాగిపోతున్నారు. ఏజెంట్ సినిమా మొత్తం గన్ కల్చర్ లోనే వుంటుందని వివరించారు. సినిమాలో ఒకటి రెండు సార్లు అఖిల్ షర్డ్ లెస్ గా కనిపిస్తాడని, ఆ సీక్వెన్స్ ను రామ్ లక్ష్మణ్ డిజైన్ బాగా డిజైన్ చేసారన్నారు.
ఏజెంట్ సినిమాకు మొదట్లో 45 కోట్ల రేంజ్ లో అవుతుందని అనుకున్నామని, రెండేళ్ల కాలం పట్టడం వల్ల వడ్డీలు, కోవిడ్ తరువాత ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల బడ్జెట్ డబుల్ అయిందని అనిల్ సుంకర వెల్లడించారు. అఖిల్ గత సినిమాల కన్నా ఈ సినిమాకు నాన్ థియేటర్ బాగా వచ్చిందన్నారు. ముందుగా అమ్మేయకుండా వుంటే ఇప్పుడు మంచి రేట్లు వచ్చి వుండేవన్నారు.
హిందీలో సమాంతరంగా విడుదల చేయాలంటే కనీసం రెండు నెలలు ముందుగా సినిమా రెడీ అయి చేతిలో వుండాల్సి వుంటుందన్నారు. ఏజెంట్ కు హీరో, దర్శకుడు ఫుల్ రెమ్యూనిరేషన్లు తీసుకుని వుంటే ఇది 100 కోట్ల బడ్జెట్ సినిమా అవుతుందన్నారు. ఏజెంట్ సినిమాకు బజ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని, దాన్ని ఇంకా పెంచాల్సి వుందని, మొత్తం మీద మాంచి ఓపెనింగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.
ట్రయిలర్ విడుదల అయితే తాను ఎందుకు ఈ సినిమా మీద ఇంత నమ్మకంగా వున్నాను అన్నది అర్థం అవుతుందన్నారు. ట్రయిలర్ విడుదలయిన తరువాత సినిమాకు బజ్ మరింత పెరుగుతుందన్నారు.