కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సురేందర్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకిస్తోందని, విచారణకు వస్తే అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ అవసరమైతే అరెస్ట్ చేస్తామని చెప్పడం విశేషం.
తాజాగా వివేకా హత్య కేసు నిందితుల జాబితాలో అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ చేర్చింది. దీంతో అరెస్ట్‌కు నేరుగానే సంకేతాలు ఇచ్చినట్టైంది. కుట్రపూరితంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది అవినాష్‌రెడ్డి ఆరోపణ, ఆవేదన. కానీ అవినాష్‌రెడ్డి వాదనతో సీబీఐ ఏ మాత్రం ఏకీభవించడం లేదు. రకరకాల ఆధారాలను చూపుతూ… వివేకా హత్యలో అవినాష్‌రెడ్డి పాత్ర వుందని సీబీఐ గట్టిగా వాదిస్తోంది.
దీంతో తన అరెస్ట్ తప్పదని అవినాష్‌రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. అరెస్ట్ నుంచి న్యాయస్థానం ఒక్కటే తనను కాపాడగలదనే నమ్మకంతో ఆయన పోరాటం చేస్తున్నారు. హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, నిజాయతీ తనను కాపాడుతుందని అవినాష్ విశ్వాసం. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై వివేకా కుమార్తె ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో తన వాదన కూడా వినాలని ఆమె కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.