ఆంధ్రా ప్ర‌జ‌ల్ని కించ‌ప‌ర‌చ‌లేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకాన్ని తానెప్పుడూ కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేద‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు చెప్పారు. హ‌రీష్‌రావు విమ‌ర్శ‌పై ఏపీ మంత్రులు ఘాటుగా రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట‌లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకాన్ని తానెప్పుడూ కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేద‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు చెప్పారు. హ‌రీష్‌రావు విమ‌ర్శ‌పై ఏపీ మంత్రులు ఘాటుగా రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట‌లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో హ‌రీష్‌రావు మాట్లాడుతూ తానేదో ఆంధ్రాను అవ‌మానించిన‌ట్టు కొంద‌రు మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆంధ్రాకు చెందిన మేస్త్రీలు త‌న‌ను క‌లిసిన సంద‌ర్భంలో… తెలంగాణ‌లో క‌రెంట్‌, నీళ్లు, పింఛ‌న్లు, ప్రాజెక్టులు, ఇలా అన్ని మంచిగా చేస్తున్నామ‌ని, ఇక్క‌డే వుండాల‌ని కోరాన‌న్నారు. ఆంధ్రా ప్ర‌జ‌ల్ని తిట్టింది లేదు, ఏమీ అన‌లేద‌న్నారు. కానీ ఉన్న‌దంటే ఆంధ్రా నాయ‌కులు ఉలికి ప‌డుతున్నార‌న్నారు. నాడు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతామ‌ని చెప్పి, నేడు ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌శ్నించాన‌న్నారు. విశాఖ ఉక్కు కోసం మీరెందుకు పోరాటం చేయ‌లేద‌ని ప్ర‌శ్నించాన‌న్నారు.

పోల‌వ‌రం ప‌నులు ఎందుకు జ‌ర‌గ‌డం లేద‌ని అన్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇందులో త‌ప్పేం ఉంద‌ని హ‌రీష్ ప్ర‌శ్నించారు. తాను ఆంధ్రా ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడానే త‌ప్ప‌, వారిని ఒక్క మాట కూడా అన‌లేద‌న్నారు. కానీ ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. 

చేత‌నైతే త‌మ‌లా కాళేశ్వ‌రి ప్రాజెక్టును క‌ట్టి నీళ్లు అందించిన‌ట్టుగా పోల‌వ‌రం ద్వారా ఆంధ్రాకు నీళ్లు ఇవ్వాల‌ని హిత‌వు చెప్పారు. ఆంధ్రా ప్ర‌జల‌ను ఒక్క మాట కూడా అన‌లేద‌ని ప‌దేప‌దే హ‌రీష్‌రావు చెప్పారు.