హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఆయన బావ చంద్రబాబుపై నగరి ఎమ్మెల్యే రోజా ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల హిందూపురం పర్యటనకు వెళ్లిన బాలకృష్ణకు సీమ ఉద్యమకారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. ఆ మరుసటి రోజు ఆయన ఓ చానల్‌తో మాట్లాడుతూ తాను సైగ చేసి ఉంటే ఏమయ్యేదో అని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేశారు.
బాలకృష్ణ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని హితవు పలికారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణలను తరిమికొట్టే రోజు వస్తుందని ఆమె మండిపడ్డారు. అలాగే పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని,. వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేగా లోకేష్ గెలవలేరని, అతని భవిష్యత్ రాజకీయ సమాధి అవుతుందని జోష్యం చెప్పారు. కొడుకు రాజకీయ జీవితం సమాధి అవుతుందనే భయంతోనే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జీవోల గురించి తెలియదన్నారు. మొత్తానికి బాలకృష్ణ, చంద్రబాబుపై రోజా తనదైన శైలిలో చెడుగుడు ఆడుకున్నారు.