నర్శీపట్నం జిల్లా…ఆయన సైలెంట్…?

కొత్త జిల్లాల మీద నోటిఫికేషన్ కాదు కానీ సరి కొత్త ఆశలు, ఆకాంక్షలు కూడా ఒక్కసారిగా బయటపడిపోతున్నాయి. ఎవరి మటుకు వారు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వరసలో నర్శీపట్నం చేరింది.…

కొత్త జిల్లాల మీద నోటిఫికేషన్ కాదు కానీ సరి కొత్త ఆశలు, ఆకాంక్షలు కూడా ఒక్కసారిగా బయటపడిపోతున్నాయి. ఎవరి మటుకు వారు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వరసలో నర్శీపట్నం చేరింది. నర్శీపట్నాన్ని జిల్లా చేయాలని ఏకంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ కోరుతున్నారు.

ఈ మేరకు ఆయన కలెక్టర్ ని కలసి మరీ వినతి చేశారు. ఇక గత మూడు రోజులుగా జిల్లా ఆఫీసుకు 50కి పైగా వినతులు వస్తే అందులో 50 పై దాటి నర్శీపట్నం జిల్లా కోసమే ఉన్నాయి. అంటే అక్కడ నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నాయన్నమాట.

దీని మీద వైసీపీ లోకల్ గా కూడా చురుకుగా ఉంటోంది. వివిధ ప్రజా సంఘాలతో భేటీలు వేస్తూ నర్శీపట్నమే మన కొత్త జిల్లా అని చెబుతోంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నందువల్ల నర్శీపట్నం జిల్లాను చేయాలని కూడా ఆ పార్టీ నాయకులు  చెబుతున్నారు.

పైగా అనకాపల్లి ఈ సరికే అభివృద్ధి చెందిందని అందువల్ల నర్శీపట్నం జిల్లాను చేస్తేనే వెనకబడిన ప్రాంతానికి మేలు జరుగుతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా నర్శీపట్నానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఈ విషయంలో ఇంతవరకూ మౌనంగానే ఉండడం విశేషం అంటున్నారు.

ఆయన విపక్ష నేతగా దీని మీద ఏ రకంగానూ రియాక్ట్ కాకపోవడం గమనార్హం అంటున్నారు. మరి ఆయనతో పాటు టీడీపీ కూడా కొత్త జిల్లాల మీద పెద్దగా రియాక్ట్ కావడంలేదు. మరి టీడీపీ వ్యూహం ఏమై ఉంటుందబ్బా అని వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారుట. చూడాలి మరి విపక్షం కూడా జోరు చేస్తేనే కదా రాజకీయం రసకందాయంలో పడేది.