‘కామాంధుడి భార్య అనే పేరు నాకొద్దు’

రేపిస్టులు, గ్యాంగ్ స్టర్లు, తప్పుడు పనులు చేసి జైలుకెళ్లేవారు.. ఇలాంటి వారిని సహజంగా కుటుంబ సభ్యులు వెనకేసుకు వస్తుంటారు. తమ బిడ్డ అమాయకుడని, తమ భర్త అలాంటివాడు కాదని, తమ సోదరుడు ఎంతో మంచివాడని…

రేపిస్టులు, గ్యాంగ్ స్టర్లు, తప్పుడు పనులు చేసి జైలుకెళ్లేవారు.. ఇలాంటి వారిని సహజంగా కుటుంబ సభ్యులు వెనకేసుకు వస్తుంటారు. తమ బిడ్డ అమాయకుడని, తమ భర్త అలాంటివాడు కాదని, తమ సోదరుడు ఎంతో మంచివాడని తప్పుడు కేసుల్లో ఇరికించారని చెబుతుంటారు కుటుంబ సభ్యులు.

కానీ నిజం తెలిసిన కొంతమంది మానసిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. తమవారు తప్పు చేశారని తెలుసు, ఆ తప్పుని సమాజం ఛీదరించుకుంటుందనీ తెలుసు. కానీ ఆ అవమానాన్ని తుడిచేసుకు వెళ్లేందుకే చాలామంది ప్రయత్నిస్తుంటారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఓ కానిస్టేబుల్ భార్య అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది, కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అసలేం జరిగింది..?

పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు నాగబాబు. అతడికి డిపార్ట్ మెంట్ లో అంత మంచిపేరు లేదు. విధుల విషయంలో సిన్సియర్ గానే కనిపించినా ఇతర చిల్లర వేషాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో స్థానికంగా ఓ 14 ఏళ్ల బాలికను ఆ కానిస్టేబుల్ లొంగదీసుకున్నాడు. పరిచయం పెంచుకుని ఆ యువతిని లాడ్జ్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఆ యువతి ఇష్టపూర్వకంగానే లాడ్జికి వచ్చిందా, లేక బలవంతంగా తీసుకెళ్లాడా అనేది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. అయితే అత్యాచారం చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగబాబుని అరెస్ట్ చేశారు. ఈ అవమానం తట్టుకోలేక నాగబాబు భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.

'కామాంధుడి భార్య', 'రేపిస్ట్ కానిస్టేబుల్ పెళ్లాం'.. అనే మాటలు వినలేక ఆమె ప్రాణం తీసుకోవాలనుకుంది. ఈ ఘటనతో నాగరాజు కుటుంబం ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది.