వెండితెరపై బ్రహ్మానందం కనిపిస్తే చాలు నవ్వులు పూస్తాయి. రాజకీయ తెరపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మతప్రచారకుడు కేఏ పాల్ కనిపిస్తే చాలు అప్రయత్నంగానే నవ్వు వికసిస్తుంది.
ఇప్పటి వరకూ హాస్యానికి ప్రతీకలుగా ఇటు సినిమాల్లో బ్రహ్మానందం, అటు కేఏ పాల్‌ను జనం చూస్తూ వచ్చారు. వీళ్లద్దరికి తాజాగా మరో గట్టి పోటీదారుడొచ్చారు. సీరియస్‌గా ఉంటూనే నవ్వులను సృష్టించడం ఆయన ప్రత్యేకత.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కవిత ఎప్పుడో ఐదేళ్ల క్రితం మాట్లాడిన మాటలు… ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని మళ్లీ సోషల్ మీడియా తెరపైకి వచ్చాయి.
ఇప్పుడీ వీడియో చక్కర్లు కొట్టడానికి కారణం లేకపోలేదు. ఎవరి గురించి అయితే కవిత సెటైర్లు విసిరారో ….అవి ఇప్పటికీ సజీవం కావడం వల్లే మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకూ కవిత వేసిన ఆ పంచ్‌ల సంగతేంటో చూద్దాం.
“నాకు విప్లవం అంటే ఇష్టం. నాకు విప్లవ భావజాలం ఉంది. నాకు పేద ప్రజలంటే ఇష్టం. పేద ప్రజల కష్టాలు తెలుసు. పేద ప్రజల కష్టాలు తెలిసినోడు ఎవరన్నా ఫైవ్‌స్టార్ హోటల్లో మీటింగ్ పెడతాడా? ఎలక్షన్లు వస్తున్నాయంటే మేకప్ అని చెప్పడం, ఎలక్షన్లు కాగానే పేకప్ అని చెప్పడం.
మళ్లీ ఈ వేళ ఎలక్షన్లు వచ్చినాయ్. ఎలక్షన్లకు కరెక్ట్‌గా 40 రోజుల ముందు మళ్లొచ్చినాడు. మళ్లొచ్చి ఏం మాట్లాడుతున్నాడు సమాజం అంటున్నాడు, విప్లవం అంటాడు, నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది.
సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, సీరియస్ పొలిటికల్ డిస్కస్ జరుగుతు న్నప్పుడు పవన్‌కల్యాణ్ పాలిటిక్స్‌లోకి అట్లే వచ్చినాడు. అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ రెండు గంటలపాటు. కానీ ఆయన ఏం మాట్లాడినారో నాకు అర్థం కాలేదు” అని పవన్‌కల్యాణ్‌పై కవిత వేసిన సెటైర్లు.
నిజానికి పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాలో ఎలాంటి మార్పు రాలేదు. నాలుగు రోజుల క్రితం ఇదే పవన్‌కల్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తల నుంచి డిమాండ్ ఉండడం వల్లే పోటీకి దిగాల్సి వస్తుందని ఆర్భాటంగా ప్రకటించారు.
ఆ తర్వాత పవన్‌తో పొత్తు విషయమై చర్చించడానికి బండి సంజయ్ వస్తున్నట్టు జనసేన మీడియా కోఆర్డినేటర్ ప్రకటించారు. అదీ లేదు. ఆ తర్వాత కిషన్‌రెడ్డి, లక్షణ్ వెళ్లి పవన్‌తో చర్చలు జరిపారు.
అలా మాట్లాడారో లేదో …పోటీ నుంచి తప్పుకున్నట్టు, తమ సంపూర్ణ మద్దతు బీజేపీకి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సంబరానికి పార్టీ పెట్టడం ఎందుకు? పోటీ చేస్తామని ప్రకటించడం దేనికి? పోనీ ఒక మాట అన్న తర్వాత దాని మీదైనా గట్టిగా నిలబడ్డారా? అంటే అదీ లేదు.
అసలు తానేం చేయడానికి పార్టీ పెట్టారో ఆయనకైనా క్లారిటీ ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో 2014లో కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ-టీడీపీ మిత్రపక్షానికి పవన్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన తీరుపై సొంత పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి.
ఎవరికీ ఏమీ అర్థం కాని భాషలో మాట్లాడ్డం ఒక్క పవన్‌కల్యాణ్‌కే సాధ్యం. కవిత అన్నట్టు సీరియస్‌గా పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు తానున్నా అని పవన్ ఎంటర్ అవుతారు. మళ్లీ ఠకీమని పడిపోతారు. పవన్ కంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడాయన కంటే పవన్ రాజకీయాల్లో ఎక్కువ కామెడీ పండిస్తున్నారు.
తనను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి నేతలతో రాజధానిపై జగన్ సర్కార్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కదా, రాతమూలకంగా ఏదన్నా చేస్తే … అప్పుడు తన పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పి వారిని అవాక్కు చేశారు.
ఇలా ఎప్పుడే విధంగా వ్యవహరిస్తారో అర్థం కాని పజిల్‌లా పవన్ రాజకీయం ఉంది. కానీ జనానికి మాత్రం పవన్‌కల్యాణ్ రూపంలో మస్తు ఎంటర్‌టైన్‌మెంట్ . ఇదే రీతిలో ఆయన రాజకీయాలు కొనసాగిస్తే మాత్రం పొలిటికల్ జోకర్‌గా మిగలడం ఖాయం.