దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ పరపతి తెలంగాణలో ఒక్కసారిగా పెరిగింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే అభిప్రాయాలు ఆ రాష్ట్రంలో క్రమంగా బలపడుతున్నాయి. దీంతో బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి.
కాంగ్రెస్ ముఖ్య నాయకులైన విజయశాంతి త్వరలో తమ పార్టీలో చేరనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు.
అలాగే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ నిన్న బీజేపీలో చేరారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న బీజేపీ చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేకుండా….ప్రజల్లో బలం ఉన్న ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు గట్టి కృషి చేస్తోంది. బీజేపీలో చేరుతారని కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు ముఖ్యమైన నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా బిగ్‌బాస్ ఫేమ్, బుల్లితెర యాంకర్ కత్తి కార్తీక కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆమె తాజాగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఒకట్రెండు రోజుల్లో ఆమె అధికారికంగా పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో కత్తి కార్తీక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్‌పై విమర్శల కత్తి దూశారు. దుబ్బాకలో ఆమె 600 పైచిలుకు ఓట్లు సాధించారు. కానీ దుబ్బాక ప్రచా రంలో ఘాటైన విమర్శలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల్లో పోటీ సందర్భంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తూ హడావుడి చేశారు. కత్తి కార్తీక బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి బలమైన గొంతుక అవుతుందనడంలో సందేహం లేదు.