కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వైసీపీ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం కేంద్ర బడ్జెట్ అద్భుతమని ప్రశంసిస్తున్నాడు. అంతేకాదు, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో అధికార వైసీపీ విఫలమైందని ప్రతి దాడి చేయడం గమనార్హం. పవన్‌కల్యాణ్ మాటలు వింటుంటే ఇంతకూ ఈయన స్థాపించిన జనసేన ఉన్నట్టా? లేక బీజేపీలో విలీనం చేశాడా అనే అనుమానం తలెత్తుతోంది.
రాజకీయంగా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. కానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి విషయానికి వస్తే కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రతి పౌరుడు నోరు తెరవాల్సిందే. అలాంటిది పవన్‌కల్యాణ్ మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించకపోగా, ప్రశంసిస్తూ మాట్లాడడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన…కేంద్రం చేస్తున్న ప్రతి చర్యను సమర్థించాల్సిన అవసరం లేదు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేవడంలో వైసీపీ విఫలమైందని, రాజధాని తరలింపు, కూల్చివేతలపై పెట్టిన శ్రద్ధ బడ్జెట్ కేటాయింపులపై పెడితే బాగుండేదని పవన్ విమర్శించాడు. ఏపీకి నిధులు రాకపోవడమంటే వైసీపీ వైఫల్యమేనని ఆయన కొత్త నిర్వచనం చెప్పాడు. అంతేకాదు వైసీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని పవన్ సూచించాడు.
రాష్ట్రానికి నిధులు కేంద్రమే కదా ఇవ్వాల్సింది…మరి వాళ్లు ఇవ్వనప్పుడు వైసీపీ ఎలా విఫలమైందో పవన్ వివరించి ఉంటే బాగుండేది. ఎంతసేపూ జగన్‌పై విమర్శలు చేయడానికి ఉన్న శ్రద్ధ…పొత్తు పెట్టుకున్న బీజేపీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు తెప్పించడంపై పవన్‌కు ఏ మాత్రం ఆసక్తి లేదని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు తెలిసి కూడా పవన్ మాట్లాడటం అంటే…ఆయన కళ్లు మూసుకున్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.