గతేడాది కరోనా టైమ్ లో నటీనటుల పారితోషికాలపై చాలా పెద్ద చర్చ నడిచింది. ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్లిపోయిందని, నిర్మాతలు నష్టాల్లోకి జారుకున్నారని, ఇలాంటి టైమ్ లో భారీగా పారితోషికం అందుకుంటున్న నటీనటులు తమ రెమ్యూనరేషన్లను తగ్గించుకోవాలని చాలా సినీ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా టాలీవుడ్ లో మాత్రం హీరోలు తమ రెమ్యూనరేషన్లు పెంచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, తనకు ఎదురైన ఓ అనుభవంపై హీరోయిన్ శృతిహాసన్ స్పందించింది.
కరోనా టైమ్ లో శృతిహాసన్ ను కూడా పారితోషికం తగ్గించుకోమని ఓ నిర్మాత కోరాడట. అందుకు ఆమె అంగీకరించిందట. కాకపోతే హీరో కూడా తన రేటు తగ్గించుకున్నప్పుడు మాత్రమే, తను కూడా పేమెంట్ తగ్గించుకుంటానని స్పష్టంచేసిందట. ఆ తర్వాత ఏం జరిగిందో తన మాటల్లోనే..
“కరోనా టైమ్ లో నా పారితోషికం తగ్గించుకోమని ఓ నిర్మాత అడిగాడు. అదే టైమ్ లో నా సినిమాలో హీరో మాత్రం రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. నేను వెంటనే కుదరదని చెప్పేశాను. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ల మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ అంటే కనీసం కలలో కూడా ఊహించలేనంత గ్యాప్ ఉంది. కాబట్టి హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం అవివేకం అవుతుంది. దాని గురించి మాట్లాడ్డం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.”
ఇలా కరోనా టైమ్ లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని బయటపెట్టింది శృతిహాసన్. అయితే ఆ హీరో ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయాల్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై కూడా ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చింది.
“సలార్ అనేది పూర్తిగా యాక్షన్-డ్రామా మూవీ. కానీ ఇందులో నేను మాత్రం యాక్షన్ సీక్వెన్సులు చేయలేదు. ఈ సినిమా స్టోరీలోనే యాక్షన్ ఉంది. ఇక నా క్యారెక్టర్ విషయానికొస్తే, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమాలో నా పాత్ర సింపుల్ గా ఉంటుందని, కథతో సంబంధం ఉండదని చాలామంది అనుకుంటున్నారు. కానీ కథను నడిపించేది నా పాత్రే. అంతకుమించి నేను ఎక్కువగా సలార్ గురించి బయటపెట్టలేను.”
సినిమాలతో పాటు ఓటీటీపై కూడా దృష్టి పెట్టినట్టు వెల్లడించింది శృతిహాసన్. త్వరలోనే తను నటించిన బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోందని ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ లో లీడ్ క్యారెక్టర్ పోషించింది శృతి.