చ‌రిత్ర హీనులుగా మిగల‌నున్న ‘అన్న’ వార‌సులు!

తెలుగు జాతి అంతా అభిమానంగా పిలుచుకున్న ‘అన్న’  దివంగ‌త నందమూరి తారకరామారావు. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడిగా ప్ర‌సిద్ధిగాంచారు. ఎన్టీఆర్‌ జ‌యంతో, వ‌ర్ధంతో వ‌స్తే…ఆయ‌న సినీ, రాజ‌కీయ వార‌సులు త‌మ ఎల్లో మీడియాలో చ‌క్క‌టి ప్ర‌క‌ట‌న…

తెలుగు జాతి అంతా అభిమానంగా పిలుచుకున్న ‘అన్న’  దివంగ‌త నందమూరి తారకరామారావు. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడిగా ప్ర‌సిద్ధిగాంచారు. ఎన్టీఆర్‌ జ‌యంతో, వ‌ర్ధంతో వ‌స్తే…ఆయ‌న సినీ, రాజ‌కీయ వార‌సులు త‌మ ఎల్లో మీడియాలో చ‌క్క‌టి ప్ర‌క‌ట‌న ఇస్తుంటారు. యుగ‌పురుషుడ‌నో, అవ‌తార పురుషుడ‌నో కీర్తిస్తూ త‌మ భ‌క్తిని చాటుకుంటుంటారు. మ‌రికొంద‌రు వార‌సులు కాస్త ముందుకెళ్లి… తాత‌య్య మ‌ళ్లీ పుట్ట‌వా, నాన్నా మ‌ళ్లీ ఎప్పుడు పుడుతావ‌నో ఆత్మీయంగా మ‌న‌సులో మాట‌ను వెల్ల‌డిస్తూ… అబ్బో ఎంత ప్రేమో అనిపించుకుంటుంటారు.

ఆ ప్రేమ‌, వాత్స‌ల్యంలో నిజ‌మెంతో చాటి చెప్పేందుకు ప్ర‌కృతి కొన్ని ప‌రీక్ష‌ల‌ను పెడుతూ వుంటుంది. ఇప్పుడాలాంటి కాల ప‌రీక్ష‌ను ఎన్టీఆర్ వార‌సుల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రూపంలో ప్ర‌కృతి పెట్టింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  తెలుగుజాతి గ‌ర్వించే ఎన్టీఆర్ పేరును ఆయ‌న పుట్టి పెరిగిన జిల్లాకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పెట్టారు. స‌హ‌జంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతాయ‌ని అంద‌రూ భావించారు.

అబ్బే… తండ్రి పేరును ఓ జిల్లాకు పెట్టిన ముఖ్య‌మంత్రిని అభినందించ‌డానికి దివంగ‌త ఎన్టీఆర్ వార‌సుల‌కు మ‌న‌సు రాలేదు. ఇంకా చంద్ర‌బాబు చాటు పిల్ల‌లుగానే పిలిపించుకునేందుకు ఎన్టీఆర్ వార‌సులు భ‌య‌భ‌క్తుల‌తో మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్టీఆర్ వార‌సులు తెర‌మీద కంటే తెర‌వెనుకే అద్భుతంగా న‌టిస్తార‌ని…. ప్ర‌స్తుత మౌన‌వ్ర‌తంతో నిరూపించార‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డాన్ని ఆయ‌న వార‌సుల్లో ఒక్క ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, ఇవాళ నందమూరి రామకృష్ణ మాత్ర‌మే స్వాగ‌తించారు. తాజాగా సినీ ప‌రిశ్ర‌మ నుంచి ద‌ర్శ‌క నిర్మాత వైవీఎస్ చౌద‌రి ఆ జాబితాలో చేరారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తూ ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం విశేషం.

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘ఎన్టీఆర్‌’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను’ వైవీఎస్‌ చౌదరి ప్ర‌క‌టించారు. ఇంకా ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న ఏమ‌న్నారంటే….

‘ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్త అసంఖ్యాక తెలుగు ప్రజల అభిమతం ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ ముఖ్య కేంద్రంగా ‘ఎన్‌టిఆర్‌’. జిల్లా పేరుతో ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. హర్షాతిరేకాన్ని వ్యక్తపరుస్తున్నాను. 

ఆ పంథాలోనే కేసీఆర్‌గారి నాయకత్వంలో కూడా అతి త్వరలోనే ‘ఎన్‌టిఆర్‌’ జిల్లా పేరుతో నిర్ణయం తీసుకుంటుందని అభిలషిస్తూ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీగారు నాయకత్వంలో భారతదేశ ప్రభుత్వం స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌’ని భారతరత్న బిరుదాంకితుడిని గావిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. 

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28, 2022 సమయానికి ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటుకి సంబంధించిన చట్టబద్ధతతో కూడిన కార్యాచరణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ, ఆయన శత జయంతి ఉత్సవాలను ఒక పండుగలా అధికారిక హోదాలో నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలను వినమ్రంగా కోరుకుంటున్నా’ అని వైవీఎస్‌ చౌదరి పేర్కొన్నారు.

వైవీఎస్ చౌద‌రి లేఖ మ‌రోసారి ఎన్టీఆర్ వార‌సుల స్పంద‌నా రాహిత్యంపై చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఇటీవ‌ల చంద్ర‌బాబు వెక్కివెక్కి ఏడ్చిన సంద‌ర్భంలో మాత్రం…ఎన్టీఆర్ త‌న‌య భువ‌నేశ్వ‌రికి ఘోర అవ‌మానం జ‌రిగింద‌ని వాపోయిన వైనాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. చ‌నిపోయినా ఆయ‌న్ను వాడుకోవ‌డం విడిచి పెట్ట‌లేద‌ని, చెట్టు పేరు చెప్పుకుని పండ్లు అమ్ముకుంటున్న వైనాన్ని ఆ యుగ‌పురుషుడి న‌ట‌, రాజ‌కీయ వార‌సులు ఎప్పుడూ గుర్తు చేస్తుంటార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

చంద్ర‌బాబు ఏడిస్తే… అంతా క‌ట్టక‌ట్టుకుని మీడియా ముందుకొచ్చి వార్నింగ్‌లు ఇచ్చిన ఎన్టీఆర్ వార‌సులు ఇప్పుడు ఎక్క‌డు న్నార‌నే ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు సోష‌ల్ మీడియాలో కొన‌సాగుతూనే వున్నాయి. అర్రె దివంగ‌త ఎన్టీఆర్ వార‌సుల్లో తెర‌మీదే కాదు, తెర‌వెనుక కూడా ఇంత అద్భుతంగా న‌టించే వాళ్లున్నారో జ‌నానికి ఇంత వ‌ర‌కూ తెలియ‌నే తెలియ‌ద‌ని నెటిజ‌న్లు వ్యంగ్య కామెంట్స్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

వార‌సులు చేసిన త‌ప్పును ఎన్టీఆర్ క్ష‌మించినా, చరిత్ర ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకునే వుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. దివంగ‌త ఎన్టీఆర్ వార‌సులు చ‌రిత్ర హీనులుగా మిగిలితే…. అది వారి త‌ప్పే త‌ప్ప చంద్ర‌బాబుదో, మ‌రొక‌రిదో కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.