ఉద్యోగాల కోత విషయంలో గూగుల్ లో రెండో రౌండ్ మొదలుకాబోతోందా? అవునన్నట్టు సంకేతాలిస్తున్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. తాము చేపట్టిన చర్యలు, పొదుపు కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపిన పిచాయ్.. అయితే ఆ రిజల్ట్స్ సరిపోవంటూ స్పందించారు. కంపెనీ సామర్థ్యాన్ని మరో 20శాతం పెంచేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఫైనాన్స్ పరంగా మెరుగైన చర్యల కోసం సిద్ధమౌతున్నట్టు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ అభిప్రాయపడ్డారు.
ఛాట్ జీపీటీకి పోటీగా తీసుకొచ్చిన బార్డ్ తో పాటు.. జీమెయిల్, గూగుల్ డాక్స్ కు చెందిన కీలక ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు ప్రకటించారు సుందర్ పిచాయ్. వీటిలో ఉన్న అవకాశాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, మిగతా విభాగాల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, తమ వినియోగదారుల్ని ఎక్కువమందిని వీటివైపు తీసుకొచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
కంపెనీలోని ప్రతి విభాగంలో జరుగుతున్న కార్యకలాపాల్ని తను ప్రత్యక్షంగా గమనిస్తున్నానని, తద్వారా ఖర్చుల్ని పునఃసమీక్షించుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు. ఈ స్టేట్ మెంట్ తో మిగతా విభాగాల్లో మరిన్ని ఉద్యోగాల్లో కోతలు ఉండొచ్చంటూ ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చినట్టయింది.
ఈ ఏడాది జనవరి నుంచి గూగుల్ లో లే-ఆఫ్స్ మొదలయ్యాయి. కంపెనీ ఉద్యోగుల్లో 6 శాతానికి సమానంగా ఎంప్లాయీస్ ను తొలిగిస్తున్నట్టు తెలిపిన కంపెనీ.. ఇందులో భాగంగా 12వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. ఆయా దేశాల్లో ఉన్న నిబంధనల ప్రకారం, కొంతమందిని తొలిగించే ప్రక్రియలో జాప్యం జరుగుతుండగా.. అంతలోనే మరో 450 మందిని సాగనంపింది. వీళ్లు 12వేల మందిలో భాగమా లేక అదనమా అనేది తేలాల్సి ఉంది.
ఏదేమైనా.. సుందర్ పిచాయ్ స్టేట్ మెంట్ తో గూగుల్ లో మరిన్ని ఉద్యోగాల తొలగింపు ఖాయమనే ఊహాగానాలు మాత్రం టెక్ ప్రపంచంలో బలంగా వ్యాపించింది. కంపెనీకి సంబంధించి బలమైన పుకార్లు వ్యాపించిన ప్రతిసారి, పిచాయ్ వాటిపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి ఏకంగా అతడి స్టేట్ మెంట్ పైనే పుకార్లు వ్యాపించడంతో, కచ్చితంగా ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు చాలామంది.