ఇప్పటికే అతనికి ముగ్గురు భార్యలున్నారు. వాళ్లందరికీ పిల్లలు. ఈ సంసారం చాలదన్నట్టు మళ్లీ పెళ్లి చేసుకోడానికి మరో యువతి కావాలట! పోనీ ఇదేమైనా అతని కోరిక మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్టు. కానే కాదు, ఆ ముగ్గురు భార్యలు ఓ ప్రకటన చేశారు. తమ భర్తకు నాలుగో భార్య కావాలని. ఇంతకూ ఆ ప్రకటన సారాంశం ఏంటంటే…
‘మా ఆయన వయసు 22 సంవత్సరాలు. చూడ చక్కని అందగాడు. మా ఆయనకు నాలుగో భార్యగా.. మాకు సోదరిగా మంచి అందమైన యువతి కావాలి. ఆమె పేరు ఎస్‌తో ప్రారంభం కావాలి’ అంటూ ఇచ్చిన ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకూ ఈ మొగుడు, పెళ్లాల కథేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఎంచక్కగా పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌కు వెళ్లాల్సిందే.
నాలుగో పెళ్లాం కోరుకుంటున్న ఆ యువకుడి పేరు అద్నాన్. సియాల్‌కోట్ నివాసి. అద్నాన్‌కు 16 ఏళ్లలోనే మొదటిసారి వివాహం అయ్యింది. ఇంకా చదువుకుంటున్న దశలోనే సంసార జీవితాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 20 ఏళ్ల వయసులో రెండో వివాహమైంది. గత ఏడాది ముచ్చటగా మూడో పెళ్లైంది. ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలతో పాటు దత్తత తీసుకున్న మరో బిడ్డ ఉన్నారు. అయినా అతనికి పెళ్లిళ్లపై మోజు తీరలేదు.
అతనికి పెళ్లి చేసుకోవాలన్న కోరికకు భార్యల ప్రోత్సాహం తోడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాదండోయ్, నాలుగో భార్యగా రావాలనుకున్న యువతికి ఓ కండీషన్ కూడా పెడుతున్నారు. నాలుగో భార్యగా వచ్చే యువతి పేరు ఎస్‌తో ప్రారంభం కావాలని, మొదటగా అతన్ని కలవాలని కూడా చెబుతున్నారు. ఎస్ అనే అక్షరంతోనే ప్రారంభం కావాలనే కండీషన్‌కు గల కారణాలను చెప్పుకొచ్చారు.
అతని ముగ్గురు భార్యలు … షుంబాల్, షుబానా, షాహిదా. అంటే అందరి పేర్లు ఎస్‌తో ప్రారంభమయ్యాయన్న మాట. అందువల్ల నాలుగో భార్య పేరు కూడా ఎస్‌తో ప్రారంభం కావాలనే కండీషన్‌కు గల కారణంగా చెప్పుకొచ్చారు. అయితే ఒక భార్య, ఇద్దరు పిల్లల్ని పోషించడమే కష్టమైన కాలంలో …అంత మందిని ఎలా పోషిస్తావనే ప్రశ్నకు అతని వద్ద సమాధానం ఉంది.
ఆరు బెడ్ రూములు, డ్రాయింగ్ రూమ్, స్టోర్ రూమ్ ఉన్న ఇంట్లో ఉంటానన్నాడు. మొదటి వివాహం తర్వాత ఆర్థికంగా తనకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కుటుంబ ఖర్చులకు నెలకు అక్షరాలా లక్ష నుంచి ఒకటిన్నర లక్షల పాకిస్తాన్ రూపాయలు వస్తుందన్నాడు.
ముగ్గురు భార్యలు తనను బాగా ప్రేమిస్తారని, తాను కూడా అంతే ప్రేమను పంచుతానని అతను చెప్పుకొచ్చాడు. మరి నాలుగో పెళ్లి చేసుకోవాలనే అతని కోరిక ఏ మాత్రం ఫలిస్తుందో చూడాల్సిందే.