సల్మాన్ కు 16 ఏళ్ల కుర్రాడి నుంచి బెదిరింపులు

చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. వీటిని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. కొన్ని అరెస్టులు కూడా చేశారు. తాజాగా సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి…

చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. వీటిని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. కొన్ని అరెస్టులు కూడా చేశారు. తాజాగా సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి నేరుగా పోలీస్ స్టేషన్ కే ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ ను చంపేయబోతున్నానంటూ ఓ అగంతకుడు కాల్ చేశాడు. 

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దర్యాప్తును ముమ్మరం చేశారు. కాల్ వచ్చిన సెల్ టవర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. చివరికి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే, అతడి వయసు కేవలం పదహారేళ్లు. అవును.. 16 ఏళ్ల కుర్రాడు, సల్మాన్ ను చంపేయబోతున్నానంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసి చెప్పాడు.

ఇంతకీ ఏం జరిగింది..

ముంబయిలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్ కు నిన్న ఓ కాల్ వచ్చింది. సల్మాన్ ను చంపేస్తాననేది ఆ కాల్ సారాంశం. దీంతో పోలీసులు ఈ మేటర్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న థానే జిల్లాలోని షాహాపూర్‌ నుంచి కాల్ వచ్చినట్టు నిర్థారించారు. 

నంబర్ ను ట్రాక్ చేస్తూ వెళ్లిన పోలీసు బృందానికి షాక్ తగిలింది. 16 ఏళ్ల బాలుడు ఈ బెదిరింపు కాల్ చేశాడు. అతడిది రాజస్థాన్‌. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీసులకు అప్పగించారు. 57 ఏళ్ల సల్మాన్ ను 16 ఏళ్ల బాలుడు ఎందుకు బెదిరించాడు.. అతడి వెనక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సల్మాన్ కు ప్రాణహాని..

సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉందనే విషయాన్ని పోలీసులు నిర్థారించారు. చంపేస్తామంటూ గత నెలలో సల్మాన్ ఆఫీస్ కు ఈ-మెయిల్ వచ్చింది. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ ఈ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు నిర్థారించారు. అతడిపై కేసు నమోదు చేశారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రస్తుతం జైళ్లోనే ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో సల్మాన్ కు భద్రత పెంచారు పోలీసులు. వై-ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చారు. అటు సల్మాన్ కూడా తన భద్రత కోసం అత్యాధునిక బుల్లెట్ ప్రూవ్ కారును, విదేశాల నుంచి తెప్పించుకున్నాడు. ఓవైపు ఇంత నడుస్తుంటే, 16 ఏళ్ల బాలుడు సల్మాన్ ను చంపేస్తానంటూ కాల్ చేయడం సంచలనంగా మారింది.