పవన్ ‘సరే’ అని ఒక్క మాట అనాలే కానీ, నిర్మాతలు క్యూ కడతారు. ఐతే తనకు మొదటి ప్రాధాన్యం సినిమాల కంటే రాజకీయాలే అని నిన్నమొన్నటి వరకు చెబుతూ వస్తున్న పవన్…సహజంగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టున్నారు. అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోవడంలో రాజకీయాల్లో తన ‘పెద్దన్న’ నారా చంద్రబాబునాయుడిని ఆదర్శంగా తీసుకున్నారాయన. సినిమాల్లో పవన్ కాటమరాయుడైతే, రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పెదరాయుడు.
జగన్ మంచి పాలన అందిస్తే తాను శాశ్వతంగా సినిమాలు తీసుకుంటానని చెప్పిన పవన్‌కల్యాణ్…ఇప్పుడు తన మాతృరంగానికే నెమ్మదిగా మారిపోతున్నాడు. పింక్ రీమేక్ స్టార్ట్ చేసినా, క్రిష్ దర్శకత్వంతో కొత్త సినిమా మొదలు పెట్టినా ఎక్కడా ప్రచారానికి నోచుకోవడం లేదు. అంతా గప్‌చిప్‌గా సాగిపోతోంది.
సినిమాల్లోకి పవన్ రీఎంట్రీని గమనిస్తే అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగిపోతున్నదని అర్థమవుతోంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం పవన్ ఎందుకు తహతహలాడారో ఇప్పుడిప్పుడే రాజకీయ విశ్లేషకులకు, పవన్ అభిమానులకు తెలిసి వస్తోంది. సమీప భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో సినిమాలకే అంకితం కావాలని పవన్ పక్కా ప్రణాళికలు రచించుకున్నాడు.
బీజేపీతో ‘పొత్తు’ అనేది కూడా పవన్ దృష్టిలో ఒక సినిమానే. బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్‌మార్చ్ చేస్తామని ఢిల్లీ వేదికంగా ప్రకటించి…ఆ తర్వాత ఆ ఊసేలేదు. బీజేపీ ప్లాన్ చేసి ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే పోవడం వరకే పరిమితం కావాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
అందుకే బీజేపీ సారథ్యంలో నిర్మించనున్న ‘పొత్తు’ సినిమాకు పవన్ కాల్షీట్లు ఇచ్చారు. బీజేపీ షూటింగ్ షెడ్యూల్ ప్రకటిస్తే పవన్ వెళ్లి నటిస్తారు. ఆ షెడ్యూల్ పూర్తి కాగానే రెగ్యులర్‌గా పింక్, క్రిష్ దర్శకత్వంలో జరిగే షూటింగ్‌లకు వెళ్తాడు. ఇదే పవ‘నిజం’ .