న్యూ ఇయర్ ఆరంభంలోనే తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించి రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా నటుడు రాజశేఖర్ వేదిక మీదకు ఎక్కి రచ్చ రేపారు. చిరంజీవి, రాజశేఖర్ ల మధ్యన వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మైక్ విసిరేసి రాజశేఖర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత రాజశేఖర్ మాకు రాజీనామా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. జరిగిన ఉందంతంపై జీవిత సారీ చెప్పినట్టుగాకూడా వార్తలు వచ్చాయి.
అంతా గడిచి నెల అయినా కాక ముందే మళ్లీ మా వ్యవహారంపై జీవిత లేఖాస్త్రాన్ని సంధించినట్టుగా తెలుస్తూ ఉంది. మా తాజా అధ్యక్షుడు నరేష్ పై ధ్వజమెత్తుతూ జీవిత లేఖ రాసినట్టుగా సమాచారం. మా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జీవిత ఆరోపిస్తున్నారు. ఈ మేరకు 15 మంది సభ్యుల సంతకాలను కూడా తీసుకుని జీవిత క్రమశిక్షన సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.
మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా మీద నరేష్ చేసిన ఆరోపణలు కూడా అబద్ధమని , అక్రమాలు అన్నీ నరేష్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయనేది జీవిత ఆరోపణగా తెలుస్తోంది. మొత్తానికి సినిమా నటుల అసోసియేషన్ రచ్చ ఏ మాత్రం తగ్గకుండా సాగుతున్నట్టుగా ఉంది!