‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మళ్లీ జగన్నే ఆశీర్వదించాలని జనాన్ని కోరేందుకు వైసీపీ దూకుడుగా వెళుతోంది. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకున్నాయి. ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు తమదైన విమర్శతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు నిన్ను ఎందుకు నమ్మాలంటూ ప్రతిపక్షాలు సీఎం జగన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ వీటిని జగన్ పట్టించుకోవడం లేదు.
అయితే గతంలో టీడీపీ ఎన్నికల సమయంలో స్టిక్కర్లను అతికించడాన్ని వైసీపీ తెరపైకి తెచ్చింది. తామిప్పుడు స్టిక్కర్లు అతికిస్తుంటే విమర్శిస్తున్న టీడీపీ, నాడు చేసిందేంటంటూ వైసీపీ నిలదీస్తోంది. మీరు చేస్తే ఒప్పు…మేము చేస్తే తప్పా? అంటూ వైసీపీ ఎదురు దాడికి దిగింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముంగిట డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10 వేలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది.
“నాకు చంద్రన్న ఇచ్చిన పసుపు-కుంకుమ రూ.10 వేలు అందింది. ఈ పసుపు కుంకుమ మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వాడుకోవడానికి ఏ విధమైన షరతులు లేవు. అలాగే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా చంద్రన్నకు ధన్యవాదాలు”
ఇదీ నాడు టీడీపీ ప్రతి ఇంటికీ అంటించిన స్టిక్కర్ అంటూ వైసీపీ దీటుగా సమాధానం ఇస్తోంది. దీనికి సమాధానం చెప్పాలని టీడీపీని నిలదీయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. చేసిన మంచిని చెప్పుకోవడం సహజంగా ఏ ప్రభుత్వమైనా చేస్తుంటుంది. అదేంటోగానీ , గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాల రూపంలో పేదలకు తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ మొత్తంలో లబ్ధి కలిగించారని వైసీపీ గుర్తు చేస్తోంది. అదే ఇప్పుడు టీడీపీని భయపెడుతోంది.
సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమనెక్కడ ముంచుతారో అని టీడీపీ ఆందోళన చెందుతోంది. దాన్ని పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్ని వైసీపీ దీటుగానే తిప్పికొడుతోంది. ఇందుకు తాజా స్టిక్కర్ల అంశమే నిదర్శనం.