''లేత మనసులు'' (1966) తెలుగు, తమిళ, హిందీలలో దిగ్విజయంగా ఆడిన సినిమా. వీటన్నిటికీ మూలం ''పేరంట్ ట్రాప్'' (1961). ఒకే పోలికలో వున్న కవలలు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లి ఎదుటివాళ్ల సమస్యలు పరిష్కరించడం మనం అనేక సినిమాల్లో చూశాం. అయితే ఈ సినిమాలో విశేషమేమిటంటే అలా వెళ్లిన యిద్దరూ కలిసి 'తమ' ఉమ్మడి సమస్యను పరిష్కరించుకోవడం! ఒక భార్యాభర్తల జంట విడిపోతుంది. వాళ్లకు కవల ఆడపిల్లలు వున్నారు. విడిపోయినప్పుడు యిద్దరూ చెరో పిల్లనూ తీసుకుపోయారు. కొన్నేళ్లకు అనుకోకుండా యీ పిల్లలిద్దరూ కలిశారు. ఒక పిల్లకు తండ్రి లేని బాధ. మరొక పిల్లకు తల్లిలేని బాధ. ఇద్దరూ స్థానాలు మార్చుకున్నారు. తండ్రిసౌఖ్యం, తల్లి సౌఖ్యం అనుభవించాక వాళ్లకు అనిపించింది, మా అమ్మానాన్నా కలిసివుంటే మాకు యిద్దరి వద్దావున్న సంతోషం దక్కుతుంది కదా అని. ఆ ప్రయత్నాలు చేసి, మధ్యలో అడ్డంకులు అధిగమించి సాధించారు.
ఈ కథ విదేశాలలో అయితే చెల్లుతుంది. అక్కడ విడాకులు సహజం కాబట్టి. కానీ మన భారతీయ వాతావరణంలో, అదీ 55 ఏళ్ల క్రితం విడాకులు అరుదైన సమయంలో యీ కథను ఒప్పించడం ఎలా? దాన్ని సాధించారు, కథకుడు జావర్ సీతారామన్. ఆయన తయారుచేసిన స్క్రిప్టుతో ఎవియం వారు కృష్ణన్ పంజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ''లేతమనసులు'', ‘‘కుళందయుం దైవముం’’ తీశారు. దీని హిందీ వెర్షన్ ‘‘దో కలియాఁ’’ కూడా బాగా ఆడింది. మూలచిత్రమైన ''పేరంట్ ట్రాప్''ను ఎరిక్ కాస్ట్నర్ రాసిన లోటీ అండ్ లీసా అనే నవల ఆధారంగా 1961లో డేవిడ్ షిఫ్ట్ దర్శకత్వంలో తీసిన వాల్ట్‌డిస్నీ ప్రొడక్షన్‌వారు 1998లో అదే పేరుతో నాన్సీ మేయర్స్ డైరక్షన్లో మళ్లీ తీశారు.
ఆ సినిమాలో హీరో, హీరోయిన్లు ఓ ఓడలో కలిశారు. ఇష్టపడ్డారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఫోటోలు తీసుకున్నారు. వాళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఏనీ, హేలీ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కొట్లాడుకుని విడిపోయారు. పిల్లల్ని పంచుకున్నారు. హీరో లండన్ నుంచి అమెరికా వెళ్లి వైన్యార్డ్ పెట్టుకుని బాగా సంపాదించాడు. హీరోయిన్ లండన్‌లో తల్లిదండ్రుల వద్దనే వుండి వెడ్డింగ్ గౌన్ డిజైనర్‌గా బాగా సంపాదిస్తోంది. పిల్లలు పుట్టి దాదాపు పన్నెండేళ్లు గడిచాక ఆ పిల్లలిద్దరూ అనుకోకుండా అమెరికాలో ఓ సమ్మర్ క్యాంప్‌లో యాదృచ్ఛికంగా కలిశారు. తండ్రి వద్ద పెరిగిన హేలీ పార్కర్ టామ్‌బాయ్ టైప్. తల్లి వద్ద పెరిగిన ఏనీ జేమ్స్ కాస్త పద్ధతి ప్రకారం పెరిగిన అమ్మాయి. సమ్మర్ క్యాంప్‌లో ఇద్దరూ ఫెన్సింగ్‌లో తలపడ్డారు. యుద్ధమయ్యాక, హెల్మెట్ తీసి చూసుకుంటే యిద్దరూ ఒకేలా వున్నారని తెలిసింది, కాస్త కాస్త తేడాలు తప్ప! అబ్బురపడ్డారు. ఇక అక్కణ్నుంచి ఒకరితో మరొకరు ప్రతీదాంట్లోనూ పోటీ. పైగా ఎవరి గ్రూపు వారు ఏర్పాటు చేసుకుని, ఒకరినొకరు విపరీతంగా ఏడిపించుకున్నారు. ఒళ్లు మండిపోయిన టీచర్ వీళ్లిద్దరినీ ఓ గదిలో పడేసి వుండమంది.
ఈ సంఘటన తెలుగు వెర్షన్లో సినిమా సగం గడిచాక వస్తుంది. అప్పటిదాకా హీరోహీరోయిన్లు ఎలా కలిశారు, ఎందుకు విడిపోయారు అన్న దానిపై నడుస్తుంది. హీరో హరనాథ్ ఓ ధనిక కుటుంబానికి చెందినవాడు. కానీ యిప్పుడు ఆస్తి లేదు, అనాథ అయ్యాడు. వాళ్ల తాతగారి సహాయంతో పైకి వచ్చిన బస్సుల వ్యాపారి రేలంగి. అతను మంచివాడు. వ్యాపారంలో ఓసారి దెబ్బతింటే, అప్పుడు భార్య జి. వరలక్ష్మి వ్యాపారాన్ని తన అదుపులోకి తీసుకుని బాగా నిర్వహించి యిల్లు నిలబెట్టింది. అప్పటినుండీ పెత్తనం ఆమె చేతిలోకి వెళ్లిపోయింది. రేలంగి వొట్టి డమ్మీ అయిపోయాడు. వరలక్ష్మి గర్విష్టి. ఉన్న ఒక్క కూతురు జమునను గారాబంగా పెంచింది. జమున కూడా అహంకారంగా వుండేది. అందువలన కాలేజీలో అబ్బాయిలు ఆమెను ఆటపట్టించేవారు.
అలాగ ఆటపట్టించేవారిలో హరనాథ్ ప్రథముడు. అతని తాతగారు తనకు సాయం చేసినదానికి ప్రతిగా రేలంగి అతనికి ప్రతీనెలా 200 రూ.లు అజ్ఞాతంగా, ఓ లాయర్ ద్వారా సాయం పంపుతున్నాడు. హీరోకు బుద్ధి చెప్పాలని హీరోయిన్ తన కారులో లిఫ్ట్ ఆఫర్ చేసి మధ్యదారిలో వదిలేసి వెనక్కి నడిచిపొమ్మంది. తీరా చూస్తే కొద్ది దూరం వెళ్లాక ఆమె కారు నిజంగానే ఆగిపోయింది. అటుగా వచ్చిన హీరోని తోడుగా వుండమంది. కాస్సేపటికి భయం వేసి అతని చెంత చేరింది. ఇంకేముంది? ప్రేమ రగిలింది. హీరో ఫ్రెండు పద్మనాభం తెచ్చిన స్కూటర్ సాయంతో యిల్లు చేరారు. వారి ప్రేమ తలిదండ్రుల కంట పడింది. అతను ఫలానా అని తెలిసి రేలంగి సంతోషపడ్డాడు. వరలక్ష్మి చికాకు పడింది. అతన్ని పరీక్షించి గానీ యిల్లరికపు అల్లుడిగా చేసుకోనంది. పరీక్షలో అతని యిండివిడ్యువాలిటీ అత్తగారిని మెప్పించింది. పెళ్లికి సరే అంది.
పెళ్లి జరిగాక వాళ్లు కొంతకాలం సుఖంగానే వున్నారు. వాళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇక అక్కణ్నుంచి కలతలు ప్రారంభమయ్యాయి. పిల్లల పేర్లు పెట్టడం దగ్గర్నుంచి అంతా అత్తగారి పెత్తనమే. తల్లి మాటకు కూతురు ఎదురాడదు. ఆవిడ చెప్పినట్టు వింటే పోతుందిగా అని మొగుణ్ని కన్విన్స్ చేయబోతుంది. కానీ హీరోకి ఆత్మాభిమానం, పట్టుదల ఎక్కువ. ముఖ్యంగా పేదసాదలకు సాయపడే విషయంలో! ఫ్యాక్టరీ వర్కర్సు విషయంలో అతను చూపించే ఔదార్యం అత్తగారికి పడదు. గతిలేక నా దగ్గర వుద్యోగం చేస్తున్నాడు కాబట్టి నా మాటకు ఎదురాడకూడదని ఆవిడ అభిప్రాయం. ఓ సారి వాళ్ల కంపెనీ లారీ గుద్దేసి ఒకతనికి యాక్సిడెంటు అయింది. దాని కారణంగా అతని కూతురి పెళ్లి ఆగిపోతోందని తెలిసి హీరో కంపెనీ తరఫున మూడువేలు యిచ్చాడు. అత్తగారు అడ్డుపడి హేళన చేస్తే తన జీతంలోంచి యిచ్చాడు.
అదే రోజు పిల్లల పుట్టినరోజు పార్టీలో అతని స్నేహితులకు అవమానం జరిగింది. వాళ్లు హీరోని వెక్కిరించారు. అతను కోపంతో యింట్లోంచి వెళ్లిపోదాం రమ్మనమని భార్యకు చెప్పాడు. భార్య ఎటూ తేల్చుకోలేకపోయింది. తల్లి దాష్టీకం చలాయించి కూతుర్ని గదిలోకి నెట్టేసింది. కూతురికి మంచంకోడు తలకు తగిలి స్పృహ తప్పింది. అందువలన భర్త తనతో వస్తావా రావా అని గట్టిగా అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయింది. ఆమె స్థితి తెలియని భర్త అపార్థం చేసుకున్నాడు. ఒక పిల్లను తీసుకుని వెళ్లిపోయాడు. చూశారు కదా, భార్యాభర్తలు విడిపోవడానికి తెలుగులో ఎంత గ్రంథం నడిపేరో! హీరోయిన్ తప్పు లేకపోయినా సంసారం విచ్ఛిన్నమైందని చూపారు. నిజానికి భర్త వెళ్లిపోయాక ఆమె పశ్చాత్తాప పడి క్షమాపణ చెపుతూ పేపర్లో యాడ్స్ యిచ్చింది కూడా. తెలుగులో హీరో అత్తగార్ని వ్యాంప్ను చేశారు. ఇంగ్లీషులో అత్తగారి పాత్రే లేదు. అక్కడ హీరో, హీరోయిన్లు విడిపోవడానికి పెద్ద కారణాలు అక్కరలేదు కాబట్టి చూపలేదు.
హీరో పప్పీ అనే పేరు గల కవలపిల్లని తీసుకుని హీరో రంగూన్ వెళ్లిపోయాడు. అక్కడ అనుకోకుండా వాళ్ల తాతగారిచేత సాయం పొందినతను తారసిల్లాడు. ఆయన స్నేహితుడైన యింగ్లీషాయన ఒక ఎస్టేటు మానేజర్కోసం చూస్తున్నాడు. హీరోకి ఆ వుద్యోగం యిచ్చాడు. హీరో కష్టపడి ఆ కంపెనీని వృద్ధిలోకి తెచ్చాడు. ఇంగ్లీషాయన యితనికి కంపెనీలో భాగస్వామిని చేసి, వాటా సొమ్ముగా కంపెనీని యితనికి యిచ్చేసి స్వదేశం వెళ్లిపోయాడు. పప్పీపై అభిమానంతో మద్రాసులో వున్న తన బంగళా ఆమెకు బహుమతిగా యిచ్చి అక్కడకు వెళ్లమని హీరోకి సలహా యిచ్చాడు. మద్రాసు అంటే హీరో వాళ్ల వూరే. అక్కడకు రాగానే కాలేజీమేట్ పద్మనాభం కలిశాడు. ఉద్యోగం సద్యోగం లేదు, నీ దగ్గరే వంట చేసి పెడుతూ వుంటా అన్నాడు. తను వెళ్లిపోయాక భార్య తనకోసం యాడ్ యిచ్చిన సంగతి హీరోకి తెలియదు కదా. ఆమె పట్ల కోపంగానే వున్నాడు. వచ్చీ రాగానే మావగారు తనకు చేసిన సాయం అంతా వడ్డీతో సహా తీర్చేసి ఉత్తరం రాశాడు. దానిలో భార్య గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు.
అది తెలిసి, హీరోయిన్ బాధ పడింది. అప్పటికే ఆమె పశ్చాత్తాప పడుతోంది. ఓ రోజు వర్షం వచ్చిందని ఒకామె యింటికి వెళితే ఆమె భర్తతో ఎంత అన్యోన్యంగా వుందో చూసింది. ఆమె వేరెవరో కాదు, తన భర్త వలన ఉపకారం పొందిన అమ్మాయే. భర్త ఫోటోను పెట్టుకుని పూజించడం చూసి అలాటివాణ్ని తాను జారవిడుచుకున్నానని బాధపడింది. ఇంటికి వచ్చి తల్లితో పోట్లాడింది. గట్టిగా మాట్లాడితే నీ భర్తను జైలుకి పంపుతా అంది వరలక్ష్మి. రాయబారం కోసం అక్కడకు వచ్చిన పద్మనాభం అది విని హీరోకి చెప్పాడు. అతను మరింత ద్వేషం పెంచుకున్నాడు. ఒకే వూళ్లో ఉంటున్న హీరో దగ్గరున్న పప్పీ అనే కూతురు, హీరోయిన్ దగ్గరున్న లల్లీ అనే కూతురు స్కూల్లో క్లాస్మేట్స్గా తారసిల్లారు. ఇద్దరూ పోట్లాడుకున్నారు. స్కూల్లోనే కాదు, పిక్నిక్కి వెళ్లినపుడు కూడా. దాంతో యింగ్లీషు సినిమాలో లాగానే యిద్దర్నీ ఓ గదిలో పెట్టి తాళం వేసింది టీచర్.
అదే వీళ్లను కలిపింది. తమ పుట్టినరోజు ఒకటే అని తెలుసుకున్నారు. ఫోటో ముక్కలు కలిపి చూసుకుని, తమ తలితండ్రులు ఒకరే అని తెలుసుకున్నారు. వాళ్లిద్దరూ వేరెవర్నీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒకరిపై మరొకరికి ప్రేమ చావలేదని నిర్ధారించుకున్నారు. ఇద్దరూ స్థానాలు మార్చుకుందా మనుకుని ఒకలా తయారయ్యారు. అవతలివాళ్ల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. అయినా వాళ్ల యిళ్లకు వెళ్లాక తబ్బిబ్బు పడ్డారు. ఇంట్లోవాళ్లు కూడా ఏదో మార్పు వుందంటూనే యాక్సెప్ట్ చేశారు. కొత్తగా దొరికిన తల్లి కంపెనీని పప్పీ, తండ్రి కంపెనీని లల్లీ ఎంజాయ్ చేస్తూండగానే వారి ఆనందానికి విఘాతం కలిగింది. హీరో వద్దకు అతని ఆస్తికోసం మెరిడిత్ అనే ఒక అమ్మాయి చేరి పెళ్లి చేసుకుంటానంటోంది. ఇతనూ సుముఖంగా వున్నాడు. అది వాళ్లింట్లో వున్న బట్లర్ చెస్లీకి యిష్టం లేదు నాన్నను కాపాడుకో అని కూతురికి చెప్పింది.
తెలుగులో చెస్లీ పాత్రను మగ చేసి పద్మనాభం చేత వేయించారు. మెరిడిత్ పాత్ర గీతాంజలికి యిచ్చారు. ఆమె పప్పీకి డాన్సు టీచర్‌గా యింట్లో చేరింది. హీరోని తాగించి అతను తనను పాడుచేశాడని నాటకం ఆడారు ఆమె, ఆమె తల్లి. అమాయకుడైన హీరో తను తప్పు చేశాననుకుని పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చాడు. పద్మనాభం చెప్పినా వినలేదు సరికదా అతన్నే మందలించాడు. తండ్రి యిలా మారిపోవడంగురించి తెలియగానే పిల్లలిద్దరూ కంగారు పడ్డారు. ఇంతలో యీ పిల్లల నాటకం అటు తాతగారికి, యిటు బట్లర్‌కు తెలిసింది. వాళ్లు కలగజేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని చూశారు. ఎలా చక్కదిద్దారన్నది ఒరిజినల్లో ఒకలా వుంటే, తెలుగులో యింకోలా వుంది. మొదట ఒరిజినల్ చూదాం. హేరీ తల్లితో చెప్పేసింది. ‘నేను యానీని కాను, తను నాన్నదగ్గర వుంది. నాన్న నిన్ను కలుద్దామను కుంటున్నాడు’ అని. అతను వేరే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడని చెప్పలేదు.
వీళ్లు లండన్‌నుంచి అమెరికాలో తండ్రి వూరికి వెళ్లారు. ఓ హోటల్లో అతను మెరిడిత్ తలిదండ్రులను కలిసేవేళ సరిగ్గా తల్లిని ప్రవేశపెట్టారు. హీరోయిన్ను అక్కడ చూసి హీరో ఆశ్చర్యపడ్డాడు. తల్లి పిల్లలను నిలదీసింది. ‘అవును నాన్న మెరిడిత్ ను చేసుకుందా మనుకుంటున్నాడు. నిన్ను ఓ సారి చూస్తే మనసు మార్చుకుంటాడని మేం రప్పించాం’ అన్నారు. అంతేకాదు, తాతగారి సహాయంతో వాళ్లు మొదటిసారి కలిసిన ఓడలో మళ్లీ కలిసేట్టు ఏర్పాటు చేశారు. హీరో హీరోయిన్లకు పాత విషయాలు జ్ఞాపకం వచ్చాయి. మనసు కరిగింది కానీ మళ్లీ కలవడానికి అహం అడ్డు వచ్చింది. ‘జరిగిపోయినది జరిగిపోయింది. నువ్వు మెరిడిత్‌ను పెళ్లి చేసుకో, కానీ పిల్లలిద్దరూ అన్యోన్యంగా వున్నారు కాబట్టి అందరూ కలిసి సెలవులు గడపండి.’ అంది హీరోయిన్, హీరో సరేనన్నాడు.
మర్నాడు హీరోయిన్ లండన్‌కి బయలుదేరుతుంటే పిల్లలు మొండికేశారు. మేం ఎవరెవరో చెప్పం. మూడు రోజులపాటు మమ్మల్ని మీరిద్దరూ అడవిలో కాంప్‌కు తీసుకెళ్లండి అని పట్టుబట్టారు. వీళ్లు సరేనన్నారు. అయితే మెరిడిత్‌కు భయం వేసింది. పాత భార్య మళ్లీ దగ్గరై పోతుందేమోనని. ఏడుపుమొహం వేసింది. హీరోయిన్ జాలిపడింది. నా బదులు నువ్వెళ్లు, పిల్లలకు మచ్చిక అవుతావు అంది. ఇక చూస్కోండి, క్యాంప్‌లో పిల్లలు ఆమెను తెగ ఏడిపించారు. ఆమె బాగ్‌లో రాళ్లు పెట్టారు. నెత్తిమీద తొండను పడేశారు. రాత్రి పడుక్కుంటే ఆమె బెడ్‌ను బయటకు లాక్కువచ్చి నీళ్లలో వదిలేశారు. దాంతో ఆమెకు పిచ్చికోపం వచ్చింది.‘పిల్లలా? నేనా? ఎవరు కావాలి?’ అని అడిగింది హీరోని. వాళ్లే అన్నాడు హీరో. ఆమె కోపంతో వెళ్లిపోయింది.
కాంప్ నుంచి తిరిగి వచ్చాక తన వైన్ కలక్షన్ చూపించాడు హీరో. తమ పెళ్లినాటి విస్కీ బాటిల్‌కూడా అతను దాచుకోవడం చూసి హీరోయిన్ చలించింది. హీరోకూడా అది గ్రహించాడు. అందుకని ఏమీ ఎరగనట్టు పిల్లల్ని, భార్యను లండన్ పంపి, తాము అంతకంటె ఫాస్ట్‌గా వెళ్లే విమానంలో అక్కడకు చేరి వాళ్లకోసం వెయిట్ చేశాడు. నిన్ను వదలుకోను అని హీరోయిన్‌కు చెప్పాడు. పెళ్లినాటి ఓడలో రెండో హనీమూన్ చేసుకోవడంతో సినిమా సుఖాంతం.
తెలుగులో యీ చిలిపితనమంతా పెట్టలేదు. సెంటిమెంటు మీద లాక్కొచ్చారు. హీరో, గీతాంజలితో తిరగడం చూసి పద్మనాభం అడ్డుకున్నాడు. హీరో అతన్ని తిట్టాడు. లల్లీని గీతాంజలి మెట్లమీద నుండి తోసేసింది. లల్లీ గాయపడింది. అది పప్పీ తల్లికీ, తాతకూ చెప్పింది. విషయమంతా చెప్పేసింది. హీరోయిన్ వెంటనే భర్త వద్దకు బయలుదేరింది. తల్లి అడ్డుకుంటే రేలంగి ఆమెను అదలించాడు. హీరోయిన్ వెళ్లి ప్రాధేయపడినా హీరో కరగలేదు. పిల్లలిద్దరూ నా వద్దనే వుంటారన్నాడు. తండ్రి వ్యవహారం చూసి ఆశ విడిచిన పిల్లలు తిరుపతి వెళ్లి దేవుడికి మొక్కుకుందామనుకున్నారు. వాళ్లు పారిపోవడానికి గీతాంజలి తల్లి సాయం చేసింది. పిల్లల్ని చంపేస్తే హీరోని పూర్తిగా వశపరుచుకోవచ్చు కదాన్న ప్లాను ఆమెది. తనే రౌడీకి అప్పగించి రైలెక్కించింది. తిరుపతి కొండల్లో చంపి పారేయమంది. అది కూతురితో చెప్తుంటే హీరో విన్నాడు. వాళ్లను తరిమేశాడు. భార్యతో సహా తిరుపతి బయలుదేరాడు.
అక్కడ రౌడీ పిల్లల్ని చంపబోతూ పాము కరిచి తనే చచ్చిపోయాడు. అయితే పిల్లలు తలిదండ్రుల వద్దకు ఓ పట్టాన రాలేదు. తాము కలిసే వుంటామని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తేనే దిగివచ్చారు. చివరకు అత్తగారు కూడా కళ్లు తెరిచింది. వ్యాపారం అల్లుడికి అప్పగించి తాను మనవరాళ్లతో ఆడుకుంటానని చెప్పింది. కథ సుఖాంతం.
ఇదీ మన తెలుగు సినిమా. పూర్తి తెలుగు కథలా వుంది కదూ. ఇంగ్లీషు సినిమా 1961 వెర్షన్లో ద్విపాత్రాభినయం చేసిన పాప పేరు హెయిలీ మిల్స్. పాత్రల పేర్లు షారోన్, సుశాన్. 1998లో సినిమాను రీమేక్ చేసినపుడు హెయిలీను గుర్తు చేసుకుంటూ ఒక పాత్ర పేరు హెయిలీ అని పెట్టారు. 1998 నాటి వెర్షన్లో ద్విపాత్రాభినయం చేసినది లిండ్సే లోహన్. తెలుగులో ద్విపాత్రాభినయం చేసినది కుట్టి పద్మిని. తెలుగులో హీరోహీరోయిన్ల అందచందాలతో బాటు డివి నరసరాజుగారి సంభాషణలు, ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణలు. ఇంగ్లీషు సినిమాలో పిల్లల వయసు 12 సం.|లు కాగా, తెలుగులో 7 సం.|లు. అక్కడ విడాకులు, మళ్లీ పెళ్లి చేసుకోవడం వుంటుంది. ఇక్కడ విడాకులు తీసుకోరు. విడిపోతారు, మళ్లీ కలుస్తారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ చూడబుద్ధవుతుంది. (ఫోటో – లేతమనసులు, అటూయిటూ పేరంట్ ట్రాప్ 1961, 1998 వెర్షన్లు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)