అధికార వైసీపీకి రంగుల పిచ్చి పట్టినట్టుంది. ఒక వైపు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ తన పార్టీ రంగులను వేస్తుండటంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. అంతే కాదు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ‘మీరేం చేస్తున్నారు’ అని ప్రశ్నించింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై దాఖలైన ప్రజావ్యాజ్యంపై కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు ఏమన్నదంటే…
‘ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీ కార్యాలయాకు రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారు ( రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి). స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మీ పనే కదా, అందుకే కదా మీరున్నది. రెండు వారాల్లో రంగులను తొలగించాల్సిందే’
హైకోర్టు హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయని జగన్ సర్కార్ ఇప్పుడు సరికొత్తగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కావలసిన విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఇతరత్రా పంపిణీ చేయాలనే సదాశయంతో త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యాలయాకు పార్టీ రంగులను వేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రంగులు వేయవద్దని తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలా ఆదేశాలు రాలేదని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. మరోసారి హైకోర్టు జోక్యం చేసుకుని చెంపలు వాయిస్తే తప్ప వీరికి బుద్ధి వచ్చేలా లేదు.