పవన్.. అభినవ నీరో!

రోమ్ నగరం తగలబడుతూ వుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడని అంటారు. తన మిత్ర పక్షం, తను మనసా, వాచా, కర్మణా అభిమానించే పార్టీ తెలుగుదేశం నానా ఇబ్బందుల్లో వుంటే, బాబు జైల్లో,…

రోమ్ నగరం తగలబడుతూ వుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడని అంటారు. తన మిత్ర పక్షం, తను మనసా, వాచా, కర్మణా అభిమానించే పార్టీ తెలుగుదేశం నానా ఇబ్బందుల్లో వుంటే, బాబు జైల్లో, చినబాబు ఢిల్లీలో ఇరుక్కుపోయి వుంటే పవన్ బాబు నిమ్మకు నీరెత్తినట్లు తన షూటింగ్ తాను చేసుకుంటున్నారు. మూడు రోజులు చిన్న యాక్షన్ ఎపిసోడ్ కు డేట్ లు ఇచ్చి హ్యాపీగా హైదరాబాద్ నుంచి చేవెళ్ల అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.

గమ్మత్తేమిటంటే ఇదే పవన్ విపరీతమైన హడావుడి చేసారు బాబు అరెస్ట్ అయిన మరుక్షణం. అలాగే ఆ మర్నాడే కొంపలు అంటుకుపోతున్నట్లు పొత్తు అనౌన్స్ చేసారు. అంతే ఆ తరువాత మరి మటుమాయం. ఎక్కడ వున్నారో ఎవరికీ తెలియదు. బాబుకు బెయిల్ రావడం లేదు. అక్టొబర్ అయిదు వరకు బయటకు రావడం లేదని క్లారిటీ వచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ వ్యవహారం తేలే వరకు లోకేష్ యువగళం యాత్ర మొదలు కాదు.

ఈలోగా విలువైన పది రోజులను పవన్ వృధా చేసేసారు. పల్లెత్తు మాట లేదు. ఒకటి రెండు రోజుల్లో వారాహి యాత్ర ప్రారంభిస్తారు. ఎలాగూ తన చిత్తానికి మాటలు విసురుతారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసురుతారు.. అదంతా మామూలే. కానీ లోగా ఎందుకు సైలంట్ అయ్యారు అంటే సమాధానం లేదు. భాజపా బ్రేక్ వేసిందా, పవన్ అత్యుత్సాహ మైత్రి కి కాపు వర్గం కలవరపడిందా?

అందుకే తాను ఎక్కడ వున్నారో కూడా తెలియకుండా కాలం గడిపేసారు. ఇప్పుడు సైలంట్ గా షూట్ జరుపుకుంటున్నారు. ఆయనను నమ్ముకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు పెదబాబు..చినబాబు.