వ‌ర్షంలాంటి మ‌నిషి క‌థ ‘రైన్ మ్యాన్’

కురిసేట‌ప్పుడు విప‌రీతంగా కుర‌వ‌డం, ఆగిపోయిన‌ప్పుడు పూర్తిగా ఆగడం.. వ‌ర్ష‌మే కాదు, అత‌డు స్పందించే తీరు కూడా అలానే ఉంటుంది. త‌న‌కు కుర‌వాల‌నిపించిన‌ప్పుడు కుంభ‌వృష్టిలా ప‌డుతూ, ఆస‌క్తి లేన‌ప్పుడు అస్స‌లు స్పందించ‌ని మాన‌సిక స్థితిలో ఉండే…

కురిసేట‌ప్పుడు విప‌రీతంగా కుర‌వ‌డం, ఆగిపోయిన‌ప్పుడు పూర్తిగా ఆగడం.. వ‌ర్ష‌మే కాదు, అత‌డు స్పందించే తీరు కూడా అలానే ఉంటుంది. త‌న‌కు కుర‌వాల‌నిపించిన‌ప్పుడు కుంభ‌వృష్టిలా ప‌డుతూ, ఆస‌క్తి లేన‌ప్పుడు అస్స‌లు స్పందించ‌ని మాన‌సిక స్థితిలో ఉండే ఒక వ్య‌క్తి, అత‌డిని భారంగానే ద‌గ్గ‌ర‌కు తీసుకుని, ఆ పై అత‌డితో భావోద్వేగ‌పూరిత‌మైన బంధాన్ని పెంచుకునే అత‌డి త‌మ్ముడి క‌థే ఈ సినిమా.

1988లో విడుద‌లైన రైన్ మ్యాన్ ఆ సంవ‌త్స‌రం అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్ హిట్ గానే కాకుండా, ఆక‌ట్టుకునే క‌థా,క‌థ‌నాల‌తో క్లాసిక్ గా నిలిచిపోయిన అరుదైన సినిమా ఇది.

ప్ర‌పంచంలో చాలా మంది మ‌నుషుల‌ను ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఒక‌టి ఆటిజం. ఈ త‌ర‌హా స‌మ‌స్య‌ల‌తో ఉన్న వారిలో మాన‌సిక ఎదుగుద‌ల ఉండ‌దు. శారీర‌క ఎదుగుద‌ల బాగానే ఉన్నా కొంద‌రు మాన‌సికంగా చిన్న పిల్ల‌ల్లానే మిగిలిపోతారు. ఈ స‌మ‌స్య తీవ్ర‌త ఒక్కోరిలో ఒక్కోలా ఉండ‌వ‌చ్చు.

వారిలో కొంద‌రు అతిగా వాగుతుంటారు, మ‌రి కొంద‌రు మాట్లాడ‌రు. ప‌ద్యాలు కూడా పాడ‌గ‌లిగే వాళ్లుంటారు, అస‌లు పదాలు కూడా తిర‌గ‌ని వారుంటారు, త‌మదైన ప్ర‌పంచంలో బ‌తికేస్తూ ఉంటారు.

ఒకే మాట‌లో చెప్పాలంటే ఆటిజం స‌మ‌స్య‌తో ఉండే వారికి సోష‌ల్ స్కిల్స్ ఉండ‌వు. తాము చెప్పాల‌నుకున్న‌దేమిటో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్ప‌లేక‌పోవ‌డం, అంద‌రిలా చెప్ప‌లేక‌పోవ‌డం వీరి బ‌ల‌హీన‌త‌. అలాగ‌ని వీరికి తెలివితేట‌లు ఉండ‌వ‌ని కాదు.

సాధార‌ణ మ‌నుషుల‌తో పోలిస్తే వీరిలో కొంద‌రికి విప‌రీత‌మైన తెలివితేట‌లుంటాయి. కానీ ఆ తెలివితేట‌ల‌ను అప్లై చేయ‌డంలోనే తేడాలుంటాయి. వీళ్లు చూపే అతి తెలివి, క‌నీస క‌మ్యూనికేష‌న్ లేక‌పోవ‌డంతో.. వీళ్ల‌ను తిక్క‌వాళ్లుగా ట్రీట్ చేస్తూ ఉంటారు మ‌న ప‌ల్లెల్లో!

త‌ర‌చి చూస్తే అలాంటి తిక్క మ‌నుషులు ప్ర‌తి ఊరికీ ఉంటారు! వాళ్ల అతి తెలివిని, తెలియ‌ని త‌నాన్ని రెండింటినీ కామెడీ గా తీసుకుంటూ ఉంటారు మిగ‌తా జ‌నాలు. ఇలాంటి పాత్రనొక‌దాన్ని హీరోగా మార్చి రూపొందించిన సినిమా రైన్ మ్యాన్. ఇందులో రైన్ మ్యాన్ ఆటిజం స‌మ‌స్య‌తో ఉండే వ్య‌క్తే, అయితే అపార‌మైన తెలివితేట‌లు ఉంటాయి.

త‌ను చ‌దివిన‌, తెలుసుకున్న దేన్నీ మ‌రిచిపోడు. చ‌దివిన స‌మాచారాన్ని విశ్లేషించి.. త‌న‌కంటూ కొన్ని అభిప్రాయాల‌ను ఏర్ప‌రుచుకుంటూ ఉంటాడు. ఆ అభిప్రాయాల‌ను వేరే ఎవ‌రైనా ఖండిస్తే అస్స‌లు ఒప్పుకోడు. గొప్ప కౌంటింగ్ స్కిల్స్ ఉంటాయి. కానీ అంద‌రి దృష్టిలో మాత్రం సీరియ‌స్ గా క‌నిపించే ఒక తిక్క‌లోడు!

క‌థ మొద‌ల‌య్యేది చార్లీ పాత్ర‌తో. ఈ పాత్ర‌లో యంగ్ టామ్ క్రూజ్ ను చూడొచ్చు. త‌నొక‌ కార్ డీల‌ర్. గ‌ర్ల్ ఫ్రెండ్ తో టూర్లో ఉండ‌గా.. త‌న తండ్రి చ‌నిపోయిన విష‌యం తెలుస్తుంది. త‌న తండ్రికి ఉన్న భారీ ఆస్తి ఒక మాన‌సిక చికిత్సాల‌యంతో ముడిపడి ఉంద‌ని చార్లీకి తెలుస్తుంది.

అక్క‌డ త‌న‌కు సోద‌రుడయ్యే ర్యాన్ ఉంటాడ‌ని, అత‌డి బాధ్య‌త త‌ను తీసుకుంటేనే త‌న‌కు ఆస్తి క‌లిసి వ‌స్తుంద‌ని చార్లీకి తెలుస్తుంది. అప్ప‌టికే పీక‌ల్లోతు అప్పుల్లో మునిగి ఉంటాడు చార్లీ. దీంతో త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో త‌న సోద‌రుడిని చేర‌దీస్తాడు. ఆ తిక్క మ‌నిషి తీరు చూసి.. చార్లీ గ‌ర్ల్ ఫ్రెండ్ వ‌దిలి వెళ్లిపోతుంది. డ‌బ్బు కోసం సోద‌రుడిని వ‌దిలించుకోలేని ప‌రిస్థితుల్లో అత‌డి బాధ్య‌త తీసుకుంటాడు చార్లీ.

అలాంటి మాన‌సిక ప‌రిస్థితుల్లో ఉన్న వ్య‌క్తిని ట్రీట్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో చార్లీకి త్వ‌ర‌గానే అర్థం అవుతుంది. విమానం ఎక్కుదామ‌ని అన్న‌ను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్తాడు చార్లీ. స‌సేమేరా విమానం ఎక్క‌నంటాడు ర్యాన్. ఎందుక‌లా అంటే.. గ‌త కొన్నేళ్ల‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదాల లెక్క‌ల‌న్నీ చెబుతాడు. ఎంత మంది మ‌ర‌ణించిన నంబ‌ర్లు చెబుతాడు.

వార్తప‌త్రిక‌ల్లో త‌ను చ‌దివిన విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌న్నీ చెప్పి.. విమానం ఎక్క‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన అంశ‌మ‌ని, తాము ఎక్కే విమానం కూలిపోయే అవ‌కాశాలున్న శాతమెంతో వివ‌రించి.. విమానం ఎక్క‌డానికి నిరాక‌రిస్తాడు  ర్యాన్. కార్లో వెళ్దామంటాడు.

అయితే కారుకు కూడా ప్ర‌మాదం జ‌ర‌గ‌వ‌చ్చ‌ని, దానికీ అవ‌కాశాలున్నాయ‌ని చార్లీ కౌంట‌ర్ ఇచ్చినా.. ర్యాన్ మాత్రం త‌ను ప‌ట్టిన ప‌ట్టు విడ‌వ‌డు. విమాన ప్ర‌మాదాల గురించి త‌ను చేసిన విశ్లేష‌ణ‌ను కారు ప్ర‌మాదాల‌కు అన్వ‌యించ‌డు! అదీ అత‌డి మానసిక తీరు. త‌ప్ప‌క కారులోనే అన్న‌ను తీసుకెళ్తాడు చార్లీ.

ఈ ప్ర‌యాణంలో సోద‌రుడిని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. తమ బాల్య స్మృతులు గుర్తుకు వ‌స్తాయి. చిన్న‌ప్పుడు తను రైన్ మ్యాన్ అంటూ పిలుచుకున్న వాడే ఈ ర్యాన్ అనే విష‌యం చార్లీకి గుర్తుకు వ‌స్తుంది. అత‌డు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రి పాలయ్యాడో తెలుస్తుంది. డ‌బ్బు కోసం కాకుండా, సోద‌రుడితో బంధం ఏర్ప‌డుతుంది.

అత‌డి బాధ్య‌త తీసుకోవాల‌నుకుంటాడు. అప్ప‌టికే చార్లీకి అప్పులుంటాయి. వారి ప్రయాణంలో లాస్ వెగాస్ వెళ్తారు. అప్ప‌టికే సోద‌రుడికి ఉన్న అపార‌మైన మేధ‌స్సు చార్లీకి అర్థ‌మవుతుంది. కొన్ని కొన్ని విష‌యాల్లో అమాయ‌కుడు, మ‌నుషుల్లో క‌లిసిపోలేని వాడు అయిన ర్యాన్, మ‌రి కొన్ని విష‌యాల్లో అపార‌మైన మేధావి అని అర్థం అవుతుంది. ర్యాన్ ను తీసుకెళ్లి క్యాసినోకు వెళ్తాడు చార్లీ. అక్క‌డ బ్లాక్ జాక్ లో భారీగా డ‌బ్బులు గెలుస్తాడు.

ర్యాన్ నంబ‌ర్లు చెబుతుంటే, ఆ నంబ‌ర్ల మీద బెట్ కాస్తూ డాల‌ర్ల పంట పండించుకుంటాడు చార్లీ. వీరు డ‌బ్బులు గెలుచుకునే వైనాన్ని చూసి క్యాసినో నిర్వాహ‌కులు హ‌డాలిపోతారు. ఏదో మోసం చేస్తున్నార‌ని అనుకుంటారు. ఎలాంటి మోసం లేకుండా ర్యాన్ మేధ‌స్సుతో వారు డ‌బ్బులు గెలుస్తున్నార‌నే విష‌యాన్ని అర్థం చేసుకుని, అక్క‌డ నుంచి వెళ్లిపొమ్మ‌ని కోర‌తారు నిర్వాహ‌కులు.

అప్ప‌టికే చార్లీ 86 వేల డాల‌ర్ల‌మొత్తాన్ని నెగ్గాడు! అత‌డికి ఉన్న అప్పు 80 వేల డాల‌ర్లు మాత్ర‌మే. త‌న సోద‌రుడి మేధ‌స్సుతో రాత్రికి రాత్రి అత‌డి అప్పుల‌న్నీ తిరిపోయి, ఆరు వేల డాల‌ర్ల స‌ర్ ప్ల‌స్ స్థాయికి వ‌చ్చేస్తాడు. గ‌ర్ల్ ఫ్రెండ్ తిరిగొస్తుంది.!

చార్లీ, ర్యాన్ ల తండ్రి రాసిన వీలునామా ప్ర‌కారం.. ర్యాన్ ను మాన‌సిక చికిత్సాల‌యానికి అప్ప‌గించేస్తే చార్లీకి రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్ల మొత్తం వ‌స్తుంద‌ని  వైద్యుడొక‌రు గుర్తు చేస్తారు. అయితే త‌న‌కు డ‌బ్బు అక్క‌ర్లేద‌ని, త‌న సోద‌రుడు త‌న‌తోనే ఉంటాడ‌ని చెబుతాడు. కోర్టు అపాయింట్ చేసిన సైకియాట్రిస్ట్ ర్యాన్ తో మాట్లాడ‌తాడు.

త‌న‌కేం కావాలో ర్యాన్ తేల్చుకోలేక‌పోతున్నాడ‌ని, అత‌డిని మాన‌సిక చికిత్సాల‌యానికే తీసుకెళ్లాల‌ని ఆదేశాలిస్తారు. డాక్ట‌ర్ తో క‌లిసి ర్యాన్ తిరిగి మెంట‌ల్ ఇన్స్టిట్యూష‌న్ కు వెళ్లిపోతుండ‌గా.. త‌ను రెండు వారాల్లో వ‌చ్చి క‌లుస్తానంటూ చార్లీ హామీ ఇవ్వడం, ర్యాన్ ట్రైన్ ఎక్కి వెళ్లిపోవ‌డంతో సినిమా ముగుస్తుంది.

వైద్య ప‌రిభాష‌లో సవ‌న్త్ సిండ్రోమ్ అని ఒక మాన‌సిక స్థితి ఉంటుంది. ఆ మాన‌సిక స్థితిలో ఉండే వారు అపార‌మైన మేధావులు, అంతే స‌మ‌యంలో అమాయ‌కులు. అలాంటి ఆటిస్టిక్ స‌వ‌న్త్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ బోలెడ‌న్ని ఇంటెలిజెంట్ సీన్ల‌తో ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంది.

ఆద్యంతం చాలా హ్యూమ‌ర‌స్ గా సాగుతుంది. బ‌య‌టి నుంచి చూసిన‌ప్పుడు అలాంటి వారు భ‌య‌పెడ‌తారు, కానీ వారితో ఉండే వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయ‌నే క‌థాంశాన్ని చ‌క్క‌గా చూపించారు. ఆటిజంతో బాధ‌ప‌డే వాళ్లంతా మేధావులు కాక‌పోవ‌చ్చు, కానీ వారిలో కొన్ని అరుదైన ల‌క్ష‌ణాలు మాత్రం ఉంటాయి.

రైన్ మ్యాన్ లోని పాత్ర‌కు స్ఫూర్తి ఒక నిజ‌జీవితంలోనే వ్య‌క్తే. అపార‌మేధావి అయిన ఒక అమెరిక‌న్ ఆటిజం పేషెంట్  పాత్ర ఆధారంగా ఈ సినిమా క‌థ‌ను త‌యారు చేశారు. సినిమాలో ర్యాన్ గా, ఆటిస్టిక్ స‌వ‌న్త్ గా అద్భుతంగా న‌టించాడు డస్టిన్ హోప్ మ‌న్.

బెస్ట్ పిక్చ‌ర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్ట‌ర్ విభాగాల్లో ఈ సినిమా అకాడ‌మీ అవార్డుల‌ను సొంతం చేసుకుంది. డ‌స్టిన్ హోప్ మ‌న్ ఈ సినిమాతో ఉత్త‌మ‌న‌టుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు.

ఈ సినిమాలోని ర్యాన్ పాత్ర స్ఫూర్తితో క‌మ‌ల్ హాస‌న్ ఒక పాత్ర‌లో న‌టించాడు. అదే 'గుణ‌'. గుణ సినిమాలో క‌మ‌ల్ పాత్ర‌కు స్ఫూర్తి రైన్ మ్యాన్ లో హోప్ మ‌న్ చేసిన పాత్రే. గుణ‌లో కూడా క‌మ‌ల్ చూడ‌టానికి పిచ్చాడిలా క‌నిపిస్తూ, గొప్ప తెలివి తేట‌లు ఉండే పాత్ర‌లో క‌నిపిస్తాడు.

మాన‌సికంగా ఎదిగీఎద‌గ‌ని త‌ర‌హా పాత్ర‌ను క‌మ‌ల్ అద్భుతంగా పండించాడు. గుణ క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ర‌కే ఆ స్ఫూర్తి. ఆ పై గుణ ఒక ల‌వ్ స్టోరీలా సాగుతుంది. విషాదంతంగా ముగుస్తుంది. రైన్ మ్యాన్ పాత్ర‌ను మ‌రోలా ప్ర‌యోగించాడు క‌మ‌ల్.

-జీవ‌న్ రెడ్డి.బి