క‌రోనా వ్యాక్సిన్.. ఇండియాకు అవ‌స‌ర‌ముండ‌దా?

క‌రోనా నంబ‌ర్ల‌ను జ‌నాలు సీరియ‌స్ గా తీసుకోవ‌డం మానేశారు. రోజుకు 40 వేల స్థాయి కేసులు ఇంకా ఇండియాలో వ‌స్తూనే ఉన్నాయి! జూలై నెల‌లో ఇలాగే రోజుకు 40వేల స్థాయిలో కొత్త కేసులు వ‌చ్చాయి.…

క‌రోనా నంబ‌ర్ల‌ను జ‌నాలు సీరియ‌స్ గా తీసుకోవ‌డం మానేశారు. రోజుకు 40 వేల స్థాయి కేసులు ఇంకా ఇండియాలో వ‌స్తూనే ఉన్నాయి! జూలై నెల‌లో ఇలాగే రోజుకు 40వేల స్థాయిలో కొత్త కేసులు వ‌చ్చాయి. అప్ప‌డు జ‌నాలు హ‌డ‌లిపోయారు. ప్ర‌భుత్వాలు భ‌య‌ప‌డిపోయాయి.

అనేక చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో అప్పుడు లాక్ డౌన్లు పెట్టారు. క‌ర్ఫ్యూ త‌ర‌హా వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌రిచారు. అప్పుడు ఆరోహ‌ణ క్ర‌మంలో పెరుగుతూ పోయిన క‌రోనా ప్ర‌స్తుతం అవ‌రోహ‌ణ క్ర‌మంలో న‌ల‌భై వేల‌కు పై స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్న ద‌శ‌లో ఉంది. అయితే .. జ‌నాలు, ప్ర‌భుత్వాలు ఇప్పుడు అస్స‌లు సీరియ‌స్ గా క‌నిపించ‌డం లేదు!

మ‌రోవైపు సీజ‌న‌ల్ జ‌లుబులు, జ్వ‌రాలు.. వీటిలో ఏది క‌రోనా? ఏది క‌రోనా కాదు? అనేది ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌ని అంశం అవుతోంది. ప‌రీక్ష‌ల ప‌ట్ల ఇప్ప‌టికీ సీరియ‌స్ గా ఉన్న‌ది కొన్ని రాష్ట్రాలే! ఏపీలో మొత్తం 90 ల‌క్ష‌ల మందికి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా టెస్టులు చేశార‌ట‌. రోజుకు రెండు నుంచి మూడు వేల స్థాయిలో క‌రోనా కేసులు రికార్డ‌వుతున్నాయి ఆ రాష్ట్రంలో.

ఆందోళ‌న‌క‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఢిల్లీలో క‌రోనా నంబ‌ర్లు మ‌ళ్లీ పెరుగుతూ ఉండ‌టం. దేశంలో బాగా ప‌రీక్ష‌లు చేస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒక‌టి. అక్క‌డ మ‌ళ్లీ రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఏడు వేల‌కు చేరిపోయింది! పండ‌గ సీజ‌న్లు అనే కాకుండా, జ‌నాలు క‌రోనాకు భ‌య‌ప‌డ‌టం మానేయ‌డంతో మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న‌ట్టుంది.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. దేశంలో ఫ‌స్ట్ ఫ‌స్ట్ కేసులు బాగా పెరిగిన ప్రాంతం ఢిల్లీనే, అక్క‌డే మొద‌ట త‌గ్గుముఖం మొద‌లైంది. ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డే పెరుగుద‌ల న‌మోద‌వుతోంది. దీంతో క‌రోనాకు అది సెకెండ్ వేవా? జ‌నాలు అల‌ర్ట్ కావాల్సిన స‌మ‌యం మళ్లీ మొద‌లైందా? అనే సందేహాలు జ‌నిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల  కార్య‌క‌లాపాలు మళ్లీ దాదాపు య‌థాత‌థ స్థితికి వ‌చ్చాయి. మాస్కులతో త‌ప్ప‌నిస‌రిగానే క‌నిపిస్తున్నారు ప్ర‌జ‌లు. అయితే తీస్తూ, వేసుకోవ‌డం అనే ప‌ద్ధ‌తినే వాటిని ధ‌రిస్తున్నారు. 

ఇంత‌కీ వ్యాక్సిన్ క‌థాక‌మామీషు ఏమిటి? అంటే.. ఇప్పుడ‌ప్పుడే ఆ ఆశ‌లు ఇండియాకు లేన‌ట్టేన‌ని స్ప‌ష్టం అవుతూనే ఉంది. ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి రాద‌ని, వ‌చ్చే ఏడాది మార్చికి అని ఇది వ‌ర‌కే కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో వ్యాక్సిన్ వ‌చ్చింది అని చెప్పుకోవ‌డానికి కూడా ఇంకా ఐదు నెల‌ల స‌మ‌యం ప‌ట్టేలా ఉంది!

మ‌రోవైపు ఐసీఎంఆర్ లెక్క‌ల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఈ పాటికి దేశంలో స‌గం జ‌నాభాకు క‌రోనా వ్యాపించి ఉంటుందంటున్నారు. ఆగ‌స్టు 15 నాటికే దేశంలో 15 కోట్ల మందికిపైగా క‌రోనా సోకింద‌ని అప్ప‌ట్లో ఐసీఎంఆర్ ప్ర‌క‌టించిన‌ట్టుగా ఉంది. మ‌రి ఆ లెక్క‌లు తీసుకుంటే.. ఇప్పటికి దేశంలో స‌గం జ‌నాభాకు క‌రోనా సోకి-వెళ్లిపోయి ఉండ‌టంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు.

ఇలా అసింప్ట‌మాటిక్ గా భారీ ఎత్తున జ‌న‌సందోహానికి క‌రోనా వ్యాపించ‌డం వ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెంపొందే అవ‌కాశం ఉంటుంద‌నేది ఒక విశ్లేష‌ణ‌. అందుకే ఇప్పుడు క‌రోనా నంబ‌ర్లు త‌గ్గుతున్నాయ‌ని, ఇదే తీరున కొన‌సాగితే.. వ్యాక్సిన్ వ‌చ్చేలోపు దాని అవ‌స‌రం ప్ర‌జ‌ల‌కు లేకుండా పోవ‌చ్చ‌ని మేధావులు కొంద‌రు చెబుతున్నారు.

అయితే క‌రోనా వ్యాక్సిన్ రూపాంత‌రం చెందే అవ‌కాశం ఉంటుంద‌నే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. వ్యాక్సిన్ వేయించుకోవ‌డం మంచిద‌ని వారు సూచిస్తున్నారు. కానీ నిఖార్సైన వ్యాక్సిన్ కోసం మ‌రింత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని మాత్రం స్ప‌ష్టం అవుతోంది.

రాజ్యాంగం విఫలం అయిందనడం ధర్మమేనా?