రైతులు కోర్టుకి వెళ్లినా లాభం లేకుండా బాబు ప్రభుత్వం వారి చేత సంతకాలు చేయించుకుంది. ఇప్పుడు రైతుల పేర ఆందోళన చేస్తోంది. రైతుల పక్షాన యిప్పుడు పోరాడే మేధావులు, సామాజిక కార్యకర్తలు అప్పుడెందుకు మౌనం వహించారో, యీ అన్యాయాన్ని ఎలా జరగనిచ్చారో, రైతులను ఎడ్యుకేట్ చేసి ఎందుకు ఆపలేదో సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా రైతులు దగా పడ్డారు. వాళ్లెందరు? అంటే బుగ్గన చెప్పినదాని ప్రకారం మొత్తం 28 వేల మందిలో 14 వేల మంది ప్లాట్లు యిచ్చే ప్రాసెస్ నడుస్తూండగానే అమ్మేసుకున్నారు. ప్రాసెస్ అయిన తర్వాత 8 వేల మంది అమ్ముకున్నారు. అంటే యిప్పుడు 6 వేల మంది ఉన్నారు. వీరి సంక్షేమం గురించే యిప్పుడు మనం ఆలోచించాలి. తక్కినవారందరినీ వ్యాపారస్తులగానే చూడాలి.
బాధితుల సంఖ్య ఎంతో చెప్పకుండా టిడిపి రైతుల పేర ఉద్యమం చేస్తోంది. ఆ పార్టీ నాయకులు అక్కడ భూములు కొనకుండా ఉండి వుంటే, రైతుల కోసం నిస్వార్థంగా ఉద్యమిస్తున్నారనే పేరు వచ్చేది. ఇప్పుడేం చేసినా తమ ఆస్తుల గురించే చేశారనే అనిపిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్తున్న 4 వేల ఎకరాలు 2014 జూన్ నుంచి డిసెంబరు లోపున కొన్నవి. ఎకరా 4 కోట్లు చొప్పున ప్రభుత్వ ఏజన్సీలకు అమ్మారు, అది మినిమమ్ అనుకున్నా 4 వేల ఎకరాలంటే 16 వేల కోట్లు అక్కడికే తేలింది. అది పోతోందంటే బాధే కదా!
రాజధాని సమాచారం టిడిపిలో అందరికీ అందలేదు. బాబుకి సన్నిహితులైన కొందరికే అంది, వాళ్ల పేర్లే వినబడుతున్నాయి. బిజెపి వారికి భాగస్వామి అయినా బిజెపి నేతలెవరికీ సమాచారం అందినట్లు లేదు. (సుజనా యిప్పుడు బిజెపి కానీ, అప్పుడు కాదు కదా) 2014 డిసెంబరు తర్వాత అనేకమంది – టిడిపి, వైసిపివారే కాక తెలంగాణ వారు కూడా- అక్కడ భూములు కొని వుంటారు. అవో 4 వేల ఎకరాలంటే యింకో 16 వేల కోట్ల స్టేక్ ఉందన్నమాట. ఇక్కడ ఘోరమేమిటంటే లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించి అమరావతిని అభివృద్ధి చేసి వీళ్ల భూముల విలువ పెంచాలని ప్లాను. ఆస్తులు వాళ్లకు, అప్పులు ప్రజలకు!
అమరావతి ప్రాభవం తగ్గిపోతోందంటే ఈ పెట్టుబడిదారులందరూ ఖేదపడతారు. ఈ ఉద్యమానికి ఊతమిస్తారు. సహజం. సెలక్టు కమిటీ ఊరూరా తిరిగి, అభిప్రాయాలు సేకరించినప్పుడు వీళ్లు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తారు. వాళ్లలాగే తక్కిన జిల్లాల వాళ్లూ తమ వాదన వినిపిస్తారు కానీ వాళ్లకు ఫైనాన్షియల్ స్టేక్ లేదు. ఈ పెట్టుబడిదారుల స్టేక్స్ భారీగా ఉన్నాయి. అందువలన వీరున్నంత ధాటీగా అవతలివాళ్లు ఉండకపోవచ్చు. ఇక ఇన్సైడ్ ట్రేడింగ్ పదాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఏ సెక్షన్ కింద వాళ్లపై కేసులు పెడతారో నాకు యిప్పటిదాకా అర్థం కాలేదు. మహా అయితే అధికార రహస్యాలు బయట చెప్పినందుకు బాబుపై కేసు పెట్టవచ్చేమో కానీ (రాజకీయ నాయకులపై కేసులు ఎప్పటికీ తెల్లారవు) భూములు కొన్నవాళ్లపై ఎలా పెడతారు?
ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ బుగ్గన 2014 జూన్ నుంచి డిసెంబరు దాకా కొన్నవాళ్ల జాబితా చదివారు. మంచి వక్త అయిన పయ్యావుల కేశవ్ లేచి 2014 సెప్టెంబరు 1న కాబినెట్ తీర్మానం జరిగి, రాజధాని విషయం ప్రకటన వచ్చాకనే అక్టోబరులో తను కొన్నాను కాబట్టి, తనది ఆ కేటగిరీ కింద రాదని వాదించారు. అంటే సెప్టెంబరు ముందు అక్కడ కొన్నవాళ్లు ఆ కేటగిరీ కింద వస్తారని ఆయనే ఒప్పుకున్నట్లయింది. అలా కొన్న టిడిపివాళ్లూ చాలామంది ఉన్నారు. సెప్టెంబరు 1న విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వస్తుందని ప్రకటించారు కాబట్టి గుంటూరు, విజయవాడ పరిసరాల్లో కొంటే అర్థం చేసుకోవచ్చని, కానీ విజయవాడకు 30 కి.మీ.ల దూరంలో, ఏ రోడ్డు సౌకర్యమూ లేని చోట, మారుమూల గ్రామంలో ఎందుకు కొన్నారని బుగ్గన అడిగితే కేశవ్ సమాధాన మివ్వలేదు. వీళ్లు స్థలాలు కొన్న ఊళ్లలో కాపిటల్ వస్తుందని డిసెంబరు 30 దాకా పబ్లిక్ డొమైన్‌లోకి రాలేదని గుర్తించాలి. రాజధానిలో యిల్లు కట్టుకుందామనుకోవడం తప్పా? అని కేశవ్ అడిగితే, యింటి కోసం ఎకరాలకు ఎకరాలు కొంటారా అని వైసిపి వాళ్లు అడిగారు.
ఆ మారుమూల గ్రామాల్లో పనికట్టుకుని కొనడమే అందరికీ అనుమానాలు కలిగిస్తున్నాయి. టిడిపి వాళ్లు అది చేయకుండా ఉండాల్సింది. కోర్ కాపిటల్ రీజియన్ యింత అని డిక్లేర్ చేసి, తర్వాత వీళ్ల భూములు ఆ పరిధిలోకి రాకుండా దాన్ని కుదించారని అంటున్నారు. వీళ్ల భూములు పోకుండా డిజైన్లు మార్చారనీ అంటున్నారు. గతంలో హైదరాబాదులో ఓఆర్ఆర్ విషయంలో వైయస్‌పై యిలాటి ఆరోపణలే వచ్చాయి. వాటిని నిరూపించినవాడెవడూ లేకపోయాడు. ఇప్పుడు చూస్తే ఓఆర్ఆర్ పక్కన అనేకమంది తక్కినవాళ్ల బిల్డింగులు కనబడుతున్నాయి. టిడిపి వాళ్లు కూడా యీ ఆరోపణపై సిబిఐ విచారణ జరిపించాలని ఛాలెంజ్ చేయాలి. కానీ స్పీకర్ విచారణ వేయమంటే ఆయన మీదే బాబు విరుచుకుపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌ను నిరూపించండి అని టిడిపి అడిగితే బుగ్గన 4 వేల ఎకరాల లిస్టు సర్వే నెంబర్లతో సహా యిచ్చారు. ఆ పేర్లున్న వారెవరూ మేం అవి కొనలేదు అనటం లేదు.
ఎవరెవరివో పేర్లు చదివి వారు మీకు బినామీలు అంటేే టిడిపి నాయకులు అభ్యంతర పెడుతున్నారు. కావాలంటే బినామీ చట్టం కింద చర్య తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు. బినామీ అనేది నిరూపించడం చాలా కష్టం. భూములు కొన్న 800 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు మాత్రం బినామీలని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ వారిలో ఒకరైన టిడిపి ఎమ్మేల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు కనీసం 12 కోట్ల విలువైన 3 ఎకరాలు కొన్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఎమ్మేల్యే కూతురు కాబట్టి సొంత డబ్బు ఉండే వుంటుందనుకోవాలా? లేక తెల్లకార్డు ఉంది కాబట్టి బినామీ అనుకోవాలా? బినామీ వ్యవహారం పలు కేంద్రశాఖలు అనేకరకాలుగా పరిశోధిస్తే తప్ప తేలదు. చివరకు వీరిలో కొందరు అమాయకులుగా తేలవచ్చు కూడా. కానీ యీ లోపున టిడిపి నాయకులు తమ స్వప్రయోజనాల కోసమే ఉద్యమం చేయిస్తున్నారది భావం బలపడుతోంది.
దీనిలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. రాష్ట్రవిభజన జరుగుతుందన్న సంకేతాలు బలంగా వస్తున్న తరుణంలో 'ఎవరైనా రాష్ట్రంలో ఎక్కడైనా సరే, సమైక్యవాద వేదికలు ఏర్పాటు నేను వచ్చి సదస్సులు ఏర్పాటు చేసి అందరి చేత మాట్లాడిస్తాన'ని నా కాలమ్ ద్వారా ఆఫర్ యిస్తే ఆంధ్రమూలాలున్న ఎందరో ఎన్నారైలు నాకు మెయిల్స్ రాశారు, ఫోన్ చేసి మాట్లాడారు – 'హైదరాబాదులో మా పెట్టుబడులు పోతాయన్న భయంగా ఉంది. మీరు సదస్సులు ఏర్పాటు చేసి, ప్రజల్లో చైతన్యం తెప్పించండి, ఎంత ఖర్చయినా మేం భరిస్తాం, మీకు డబ్బు పంపుతాం' అని. 'సమైక్యవాదం గురించి అంత నిబద్ధత ఉంటే తెలంగాణ కోసం లేఖ యిచ్చి, 2009లో తెరాసతో పొత్తు పెట్టుకున్న టిడిపిని ఆనాటి ఎన్నికలలో ఎందుకు సమర్థించారు? మహాకూటమి గెలవకపోవచ్చని రాసినందుకు నన్నెందుకు తిట్టారు?' అని నేనడిగితే 'పాతవి వదిలిపెట్టండి, డబ్బు పంపుతాం, తీసుకోండి' అని అన్నారు. 'నాకు డబ్బు అక్కరలేదు. మీ ఊళ్లలో మీ ఫ్రెండ్స్‌కు చెప్పి ఏర్పాట్లు చేయించండి. నేను నా ఖర్చులతో వెళ్లి మాట్లాడతాను' అని చెప్పాను. ఒక్కరూ అలాటి సదస్సులు ఏర్పాటు చేయించలేక పోయారు.
అమరావతి పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన ఎన్నారైలు యిలాటి ఆఫర్లు ఉద్యమకారులకు యిస్తూ వుండవచ్చు. ఎందుకంటే యిది కోట్లతో వ్యవహారం. ఒక ఎన్నారై రాశారు – తను, తన మేనమామలు కొన్నేళ్ల కష్టార్జితాన్ని వెచ్చించి, అప్పులు తెచ్చి రూ.1.20 కోట్లతో ఒక రైతు వద్ద 450 గజాల కమ్మర్షియల్ ప్లాట్ కొన్నారట. ప్రభుత్వం రైతులకు భూమి తిరిగి యిచ్చేస్తానంటోంది, మా భవిష్యత్తు ఏమిటి? అని అడిగారు. జాలి వేసింది. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మార్చేస్తూ ఉంటే యిలాటి సామాన్యులు ఏమవాలి? బాబు అమ్మిన బంగారు కలలు నమ్మి యీయన బోల్తా పడ్డారు కదా! బలిసిన పెట్టుబడిదారులు, ప్రజాధనం దోచుకునే రాజకీయ నాయకులు ఎలా పోయినా మనకు చింత లేదు కానీ, రాజకీయ నాయకుల పంతాల మధ్య నలిగి యిలాటి, మనబోటి కష్టజీవులు నష్టపోయినపుడు దుఃఖం కలుగుతుంది.
'పెట్టినది ఎలాగూ పెట్టారు, జగన్‌ను అడ్డుకోవడానికి పోరాటం చేస్తున్నాం, మీ పెట్టుబడిలో 1% విరాళమివ్వండి' అని అడిగితే ఆయన ఓ లక్ష పంపడా? బాబు జోలె పడితే డబ్బులెందుకు రావు? 'మిమ్మల్ని, మీ కబుర్లను నమ్మి పెట్టుబడులు పెట్టాం, ఉద్యమం చేయండి, ఎలాగైనా ఏదో ఒకటి చేసైనా సరే, రాజధాని తరలింపు ఆపండి, అక్కడ అద్భుతనగరం వెలిసేట్లా చూడండి, కావాలంటే విరాళాలిస్తాం' అని బాబుపై టిడిపి నాయకుల, రియల్టర్ల ఒత్తిడే కాదు, యిలాటి సామాన్య పెట్టుబడిదారుల ఒత్తిడి కూడా ఉండదా? ఆందోళన చేయక తప్పని పరిస్థితిలో బాబు ఉన్నారు. దీనివలన తక్కిన జిల్లాలలో టిడిపి పరపతి దెబ్బ తింటుందని తెలిసినా ఆయన పోరాటం చేయక తప్పదు. సెలక్టు కమిటీకి పంపించడం ద్వారా మూడు నెలలు ఆలస్యం చేయించారు కానీ అది తాత్కాలిక విజయమే. చివరకు అసెంబ్లీ మాటే చెల్లుతుంది.
అందుకని కోర్టు ద్వారా ఆపించడమొక్కటే మార్గం. కోర్టు కూడా రాజధానిని మార్చడానికి వీల్లేదు అంటే సెక్రటేరియట్‌ను అమరావతిలో కంటిన్యూ చేయవచ్చు. తక్కినవి తరలించేయవచ్చు. హైకోర్టు రాయలసీమకు యివ్వడానికి వీల్లేదు అని సుప్రీం కోర్టు అంటుందా? అలాటి ఉదాహరణలు ఉన్నాయా? నాకు తెలియదు. ఒకవేళ సుప్రీం కోర్టు అలా అంటే హైకోర్టు కూడా అమరావతిలోనే కొనసాగించి, కర్నూలులో బెంచ్ పెట్టవచ్చు. కానీ ప్రతి ప్రభుత్వ శాఖ అమరావతిలోనే ఉండాలి, అద్భుత నగరం కట్టి తీరాలి అని ఏ కోర్టూ చెప్పదు. ఆ నగరం వెలవకపోతే టిడిపి పై ఒత్తిడి తగ్గదు. అదీ టిడిపి నాయకుల వెతలకు కారణం!
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)