నారా చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడు తప్పుల పుణ్యమా అని వ్యవస్థలు విధ్వంసం అవుతున్నాయి. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి అసలు విధ్వంసకారుడు చంద్రబాబే. విధ్వంసం, చంద్రబాబు కవల పిల్లలు.
2014 విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. హైదరాబాద్‌పై మనకు ఇప్పటికీ హక్కు ఉంది. కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల హక్కును విడిచి పెట్టి మూటముల్లా సర్దుకుని అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ప్రజా దేవుళ్లు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన చంద్రబాబు తన పని పక్కన పెట్టి , పక్క రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల్లో తల దూర్చాడు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే స్టీపెన్ ఓటు కోసం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇదే సమయంలో స్టీపెన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి బ్రీఫ్ చేసిన వాయిస్ రికార్డు కూడా చిక్కింది. ఇదే సందర్భంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం కూడా బయటికొచ్చింది. దీంతో చంద్రబాబు, కేసీఆర్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొంతకాలం పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టించాయి.
కారణాలు ఏవైతేనేం చంద్రబాబు ఉన్నఫలంగా హైదరాబాద్ నుంచి అమరావతికి అన్నీ సర్దుకుని రావాల్సిన పరిస్థితి తెచ్చాడు. ఇక అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడి రాజధాని ఉనికికే ప్రమాదం తెచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గగ్గోలు పెడితే ప్రయోజనం ఏంటి?
ఇక మూడో తప్పు విషయానికి వద్దాం. శాసనమండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చించి తిరిగి అసెంబ్లీకి పంపాల్సి ఉండగా, ఆ పని చేయకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం చారిత్రిక తప్పిదం. ఈ పరిణామం శాసనమండలి రద్దుకు దారి తీసింది. ఇలా చంద్రబాబు మూడు తప్పిదాల వల్ల రెండు రాజధానులు, ఒక శాసనమండలి పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.