ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు కాపురం కూడా చేశాడు. వైవాహిక బంధంలో ఉంటూ మరో అమ్మాయిని ఇష్టపడ్డాడు. అక్కడితో ఆగలేదు ఆ నీచుడు. తన ప్రేయసితో కలిసి భార్యనే హత్య చేయడానికి కుట్ర పన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.
బాదేపల్లికి చెందిన వినోద్, అనితను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే ఉన్నారు. అంతలోనే వినోద్ కు, కవిత అనే అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించిన తర్వాత తనకు పెళ్లయిన విషయాన్ని బయటపెట్టాడు వినోద్. ఈ సందర్భంలో ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? వెంటనే అతడ్ని వదిలేస్తుంది.
కానీ కవిత మాత్రం వినోద్ ను ఇష్టపడింది. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. దీంతో ఇద్దరి మధ్య అడ్డంకిగా ఉన్న అనితను తప్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆమెను హత్య చేయడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు.
మంచి టైమ్ కోసం చూసిన వినోద్, తెల్లవారుజామున 4 గంటలకు తన భార్య అనితను కారులో ఎక్కించుకొని బయల్దేరాడు. మధ్యలో కవిత కూడా జాయిన్ అయింది. అనితకు అనుమానం వచ్చింది. కాస్త ముందుగానే మేల్కొంది. వెంటనే జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించింది.
ఫోన్ సిగ్నల్ ఆధారంగా వినోద్ నడుపుతున్న కారును ట్రేస్ చేసి కనుక్కున్నారు పోలీసులు. పోలీసులు ఛేజ్ చేస్తున్నారని తెలుసుకున్న వెంటనే అనితను దించేసి పరారయ్యాడు వినోద్. జరిగిన ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.