కేటీఆర్ పూర్ ప్లాన్: మోడీ ఇక్కడ.. మహా ధర్నా అక్కడా?

ఏ పాలకుల నిర్ణయమైనా సరే ప్రజాకంటకంగా ఉన్నదని అనిపించినప్పుడు, ప్రజలు తెలియజేసే నిరసన ఆ పాలకుల దృష్టికి వెళ్లేలా ఉండాలి. పాలకుల తీరులో కదలిక తీసుకురావాలి. అందుకే ధర్నాలు, ఘెరావ్ లు, బంద్ లు…

ఏ పాలకుల నిర్ణయమైనా సరే ప్రజాకంటకంగా ఉన్నదని అనిపించినప్పుడు, ప్రజలు తెలియజేసే నిరసన ఆ పాలకుల దృష్టికి వెళ్లేలా ఉండాలి. పాలకుల తీరులో కదలిక తీసుకురావాలి. అందుకే ధర్నాలు, ఘెరావ్ లు, బంద్ లు ఏ కార్యక్రమాలు చేసినా.. ఆ నిరసనలతో ప్రభుత్వాన్ని ఇరుకునపడేసి ప్రజాప్రయోజనం నెరవేర్చుకోవాలని ఉద్యమకారులు అనుకుంటారు. 

కానీ.. సింగరేణి గనుల మీద తెలంగాణకు హక్కుల కోసం మంత్రి కేటీఆర్ పిలుపు ఇస్తున్న మహాధర్నా పోరాటాలు చిత్రంగా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాదుకు వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే.. అక్కడెక్కడో సింగరేణి ప్రాంతంలో మహాధర్నాలు చేయాలని పిలుపు ఇవ్వడం.. లక్ష్యరహితంగా కనిపిస్తోంది. 

ప్రధాని నరేంద్రమోడీ 8-9 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల టూర్ పెట్టుకున్నారు. పలు అభివృద్ధి పనుల వ్యవహారమూ, కర్నాటకలో ఎన్నికల ప్రచారమూ ఆయన లక్ష్యం. నిజానికి ఆయన ప్రారంభించే పనులేవీ, ప్రధాని స్థాయికి తగినవి కాదు. కానీ.. చిన్న పనిచేసినా సరే.. పెద్ద ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలనే సూత్రాన్ని నమ్మి పాలన సాగిస్తున్న నరేంద్రమోడీ.. ఒక రైలు ప్రారంభించడానికి, కొన్ని రిపేరు పనులకు శంకు స్థాపన చేయడానికి హైదరాబాదు వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ బహిరంగసభకూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ సభలో కేసీఆర్ సర్కారు మీద నిశిత విమర్శలు కూడా కురిపిస్తారు. 

అదంతా బాగానే ఉంది. కానీ.. సింగరేణి గనుల్లో కొన్నింటిని ప్రెవేటు సంస్థలకు వేలంలో విక్రయించడానికి కేంద్రం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్న భారాస ఈ సందర్భంగా అదే రోజున అక్కడ ఆందోళన చేయాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం, సింగరేణి ప్రాంతాల్లో మహాధర్నాలు ఉంటాయట. ఇంత పూర్ గా కేటీఆర్ ఎలా ప్లాన్ చేశారో అర్థం కావడం లేదు. 

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాదు కార్యక్రమాల్లో పాల్గొంటుండగా ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో మహాధర్నాలు చేయడం వలన ఏం జరుగుతుంది? ప్రధాని కార్యక్రమాలకు టీవీ ఛానెళ్ల లైవ్ అటెన్షన్ తగ్గించడానికి వీరి మహాధర్నాలు కొంత ఉపయోగపడవచ్చు తప్ప, ప్రధాని దృష్టికి వారి నిరసనల సీరియస్ నెస్ వెళుతుందా? హైదరాబాదు నగరంలో కూడా నిరసనలు తెలియజేయకుండా, ప్రధాని పర్యటించే మార్గాల్లో రోడ్డు పక్కన నిరసనకారులు నిల్చుని సింగరేణి గనుల అరాచక విక్రయప్రయత్నాల్ని నిరసనించేలా తమ నిరసనల్ని శాంతియుతంగా తెలియజేసేలా ఉద్యమిస్తే ఆయన దృష్టికి నేరుగా సమస్య తెలుస్తుంది. ఇలాంటి నిరసన స్వచ్ఛంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

గతంలో కావేరీ జలాల వివాదం రేగినప్పుడు.. చెన్నై కార్యక్రమానికి వెళ్లిన ప్రధాని మోడీకి నిరసనలు తెలియజేయడానికి స్థానికులు రోడ్లకు ఇరువైపులా బారికేడ్ల వద్ద గుంపులు కూడారు. ప్రధాని వారి నిరసనలకు జడుసుకుని రోడ్డు మార్గంలో వెళ్లాలనుకున్న తన మొదటి ప్లాన్ మార్చుకుని విమానాశ్రయం నుంచి కార్యక్రమ వేదిక వద్దకు హెలికాప్టర్ లో వెళ్లారు. 

అయినా సరే స్థానికులు హెలికాప్టర్ మార్గంలో గాల్లోకి నల్ల బెలూన్లు ఎగరేసి ప్రధానికి తమ నిరసన తెలిపారు. దానితో పోల్చిచూస్తే.. గులాబీ నేత కేటీఆర్ పిలుపు ఇచ్చిన ఈ మహాధర్నా.. నిరసనల సెగ ప్రధానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, జాగ్రత్తగా, సుతిమెత్తగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.