లూసిఫర్. ఈ సినిమా హీరో రామ్ చరణ్ కు ఇన్ స్టాంట్ గా నచ్చేసింది. ఆ వెంటనే హక్కులు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేత కొనిపించేసారు. అంతవరకు బాగానే నడచింది. కానీ ఆ మలయాళ సినిమాను తెలుగుకు, అది కూడా మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్లు తయారుచేయగల డైరక్టర్ దొరకడం లేదు.
సాహో లాంటి డిజాస్టర్ మూవీ అందించిన సుజిత్ కు అవకాశం ఇచ్చారు. కానీ అతగాడు స్క్రిప్ట్ చేయలేకపోయాడు. మెగాస్టార్ కు అచ్చివచ్చిన డైరక్టర్ వివి వినాయక్ కు అవకాశం ఇచ్చారు. అక్కడా కుదరలేదు. దీంతో ఇప్పుడు మరెవరు అనే అన్వేషణ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చూపు మాస్ డైరక్టర్ హరీష్ శంకర్ వైపు వుందని బోగట్టా. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ కోసం వెయిటింగ్ లో వున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి కనీసం మరో ఏడాది పడుతుందని, ఈలోగా లూసిఫర్ రీమేక్ చేసేయమని హరీష్ కు కబురుచేసే పనిలో మెగాస్టార్ వున్నారని ఇండస్ట్రీ వర్గాల బొగట్టా.
వకీల్ సాబ్, అయ్యప్పన్ రీమేక్, క్రిష్ సినిమా చేసిన తరవాత కానీ హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ కాదు. అందుకే హరీష్ తో లూసిఫర్ రీమేక్ చేయించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.అయితే మెగాస్టార్ అనుకుంటే సరిపోదు, పవర్ స్టార్ కు చెప్పి, ఆయన తో హరీష్ కు చెప్పిస్తే తప్ప పని జరగదు.
మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. గబ్బర్ సింగ్, వాల్మీకి లాంటి సక్సెస్ ఫుల్ రీమేక్ లు మాత్రమే కాదు, తెలుగుకు సక్సెస్ ఫుల్ అడాప్షన్ కూడా చేసారు హరీష్ శంకర్. అందువల్ల లూసిఫర్ కు ఆయన కచ్చితంగా మంచి చాయిస్ నే.