లైట్ గా మందేసుకోండి.. బీజేపీ మహిళా ఎంపీ

ఇటీవల ఏపీలో సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలు ఎంత కలకలం రేపాయో తెలిసిందే. పక్క రాష్ట్రం నేతలు కూడా సోముని ఉతికి ఆరేశారు. వీర్రాజుని టార్గెట్ చేస్తూ పరోక్షంగా బీజేపీని చెడుగుడు ఆడుకున్నారు.…

ఇటీవల ఏపీలో సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలు ఎంత కలకలం రేపాయో తెలిసిందే. పక్క రాష్ట్రం నేతలు కూడా సోముని ఉతికి ఆరేశారు. వీర్రాజుని టార్గెట్ చేస్తూ పరోక్షంగా బీజేపీని చెడుగుడు ఆడుకున్నారు. అసలు మద్యపానంపై బీజేపీ విధానం ఏంటని ప్రశ్నించారు. తాజాగా బీజేపీ మహిళా ఎంపీ సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మందు లిమిట్ గా తాగొచ్చని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆమెను ఇప్పుడు నెటిజన్లు ట్రోలింగ్ తో ఆడుకుంటున్నారు.

లైట్ గా పుచ్చుకోండి..

మందు ఎంత తీసుకోవాలి, అసలు తీసుకోవాలా వద్దా..? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. హార్ట్ పేషెంట్లు ప్రతి రోజూ ఔషధం లాగా ఆల్కహాల్ కూడా పరిమిత మోతాదులో తీసుకోవచ్చని చెప్పే డాక్టర్లు కూడా ఉంటారు. అయితే అసలు మందు లేకపోయినా ఆరోగ్యానికి వచ్చే ఇబ్బందేమీ లేదని, దాని జోలికి వెళ్లకపోవడం అత్యుత్తమం అని అనేవారి సంఖ్యే ఎక్కువ. 

అయితే మందు లిమిట్ గా తీసుకోవచ్చని సాక్షాత్తూ లోక్ సభ ఎంపీ బహిరంగంగా ప్రకటించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులోనూ ఆమె మహిళా ఎంపీ. గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వి. ఇప్పుడా సాధ్వి ప్రగ్యాఠాకూర్ మరో బాంబు పేల్చి బీజేపీని బోనులో దోషిగా నిలబెట్టారు.

ఆయుర్వేదం, ఇతర వైద్య ప్రక్రియల్లో ఆల్రహాల్ ని మితంగా వాడతారని కూడా సెలవిచ్చారు ప్రగ్యా. అతిగా తీసుకుంటే ఏదైనా విషమేనని చెబుతున్న ఆమె, లైట్ గా మందేసుకుంటే ఉపయోగాలే ఎక్కువ ఉంటాయని అంటున్నారు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ప్రగ్యాని ఆటాడేసుకుంటున్నారు.

ఓ వైపు బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న బీహార్ లాంటి రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ మద్యపాన నిషేధం కోసం పట్టుబడుతోంది. ఈ దశలో కమల నాయకులు ఇలా నోరు జారడం నెటిజన్లకు పనిపెడుతోంది. చీప్ లిక్కర్ వ్యాఖ్యల్ని కవర్ చేసుకోడానికి సోము వీర్రాజుకి రెండు వారాల టైమ్ పట్టింది. 

అది ఇది, అంటూ ఏవేవో ప్రెస్ మీట్లు పెట్టి సారాయి వీర్రాజు అనే ట్యాగ్ లైన్ ని తొలిగించుకోవాలని చూశారు. మరిప్పుడు సాధ్వి ప్రగ్యా ఠాకూర్.. ఈ వ్యాఖ్యలపై వక్రీకరణ ముద్ర వేస్తారో, లేక మరింతగా వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.