జీతాలు తగ్గాయో పెరిగాయో తరవాత సంగతి, హెచ్ఆర్ఏ బాగా తగ్గింది కదా. ఆర్థిక ఇబ్బందుల్ని అర్థం చేసుకోండి అని ఉద్యోగులకు చెబుతున్నారు కదా. పోనీ అదే టోన్ తో ఆర్థిక ఇబ్బందులున్నాయి, అమ్మఒడి తగ్గిస్తాం అని చెప్పమనండి. జనాలు ఊరుకుంటారా..? ఈ లాజిక్ ని ఉద్యోగుల వద్దే ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదు.
జనాలకిచ్చే ఆర్థిక సాయం తగ్గిస్తే ఎవరూ రోడ్డెక్కరు కానీ ఎన్నికల సమయంలో సమాధానం చెబుతారు. కానీ ఉద్యోగులు ఇప్పుడే వార్నింగ్ బెల్ కొట్టారు. నిజంగా ఇది వైసీపీ ప్రభుత్వానికి మంచిదే, వ్యతిరేకత వస్తుందని తెలిసి సర్దుబాటు చేసుకోవడం మంచి నిర్ణయం, మరి ప్రభుత్వం ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో చూడాలి.
కేబినెట్ లో చర్చిస్తారా..?
సహజంగా కేబినెట్ భేటీకి సంబంధించి ముందే అజెండా తయారవుతుంది. ఈరోజు కేబినెట్ భేటీలో ప్రధాన అజెండా కరోనాపై యుద్ధం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది.
కొత్త మార్గదర్శకాల విడుదలపై కూడా క్లారిటీ వస్తుంది. అదే సమయంలో సినిమా టికెట్ రేట్లపై కూడా ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. సీఎం జగన్ తో చిరంజీవి భేటీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేసిందనేది ఇప్పుడు బయటకు తెలుస్తుంది.
చిరంజీవి చెప్పినట్టు పండగ తర్వాత ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు కేబినెట్ భేటీ తర్వాత వెలువడుతుందని అంటున్నారు. ఇక ఉద్యోగుల సమస్యల గురించి చర్చిస్తారా లేదా లైట్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
ఉద్యోగుల కలెక్టరేట్ ముట్టడి తర్వాత మాట్లాడిన మంత్రులంతా సర్దుకుపోవాలని సూచించారే కానీ, చర్చిస్తామని మాత్రం చెప్పలేదు. అంటే ఒకరకంగా ప్రభుత్వ నిర్ణయం ఇదీ అంటూ వారు కుండబద్దలు కొట్టారు. మరి అంత వివరణ ఇచ్చాక కేబినెట్ లో దీని గురించి చర్చిస్తారో లేదో చూడాలి. ఒకవేళ నిజంగానే కేబినెట్ లో పీఆర్సీ, ఉద్యోగుల గొడవపై చర్చ జరక్కపోతే మాత్రం అది నిజంగా పెద్ద తప్పే అవుతుంది.
ఓవైపు ఉద్యోగులు ఈరోజే సమ్మె నోటీసు ఇస్తామంటున్నారు. కేబినెట్ భేటీతో సంబంధం లేకుండా వారు తమ మీటింగ్ పెట్టుకున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఐక్యతారాగం పాడుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం చేతులు కాలేవరకు ఆగడం సరికాదు.
ప్రతిపక్షాల వలలో పడొద్దంటూ ఉద్యోగులకు చెబుతున్నా.. ఉద్యమంలో ఉద్యోగులపై ప్రతిపక్షాల ప్రభావం ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఇలాంటి టైమ్ లో జగన్ తెగేదాకా లాగడం సరికాదు. కేబినెట్ భేటీలో చర్చించి ఉభయకుశలోపరిగా నిర్ణయం తీసుకుంటే మంచిది.